Sunday, April 26, 2015

శ్రీ వీరేశలింగ సమాజ గ్రంథాలయం కుముదవల్లి (కోడవల్లి)

అది ఒక అందమైన గ్రామం, అందమైన గ్రామస్తులు (గ్రామస్తుల అందం వాళ్ళు చేసిన చేస్తున్న పనులబట్టి నిర్నయిచబడాలి అని నా గట్టి నమ్మకం)  అలాంటి ఊళ్ళో ఒక గ్రంథాలయం - ఒక గ్రంథాలయం తన పూర్తీ ప్రయోజనాన్ని ప్రజలకు అందివ్వడం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. కాని ప్రయోజనానికి ఆవల కూడా సేవలను అందించడం ఒక్క భీమవరం దగ్గరలో కోడవల్లి అనికూడా పిలిచే కుముదవల్లిలోని వీరేశలింగ సమాజ గ్రంథాలయానికి మాత్రమే చెందుతుంది -  అలాంటి గొప్ప గ్రంథాలయ పూర్వాపరాల్లోకెళితే

గ్రంథాలయం ఉద్యమం, జాతీయ కాంగ్రెస్ స్థాపన
ప్రజల సామూహిక శక్తిని సమీకరించి, ఒక వ్యవస్థాపరమైన మార్పుకోసం జరిగే ధీర్ఘ కాల పోరాటాన్ని సాంఘిక ఉద్యమం అంటారు. పరాయి పాలన విముక్తి కోసం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించాలనే భావన దివ్య జ్ఞాన సమాజ సభ్యుడైన ఏ.ఓ.హ్యూమ్‌కు కలిగింది. హ్యూం మిత్రులతో  కూడిన సమావేశం ఈ ఆలోచనను దృవపరచింది. ఈ అలోచనను ఉద్యమ రూపంలోకి తెచ్చేందుకు 1885లో  బొంబాయిలో ప్రధమ కాంగ్రెస్ మహాసభ జరిగింది. తదుపరి జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.

అప్పటి రోజులలో దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన బ్రిటిష్ పాలన వలన భారత దేశ ఏ విధంగా నష్టపోతున్నదీ వివరించింది. ఇలాంటి పుస్తకాలను చదివేలా చేస్తేనే ప్రజలలో సామాజిక చైతన్యం కలుగుతుందని గ్రహించిన కొందరు యువకులు పల్లెలలో గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. అప్పటి రోజులలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రాయకుదురులో సుజనానంద గ్రంథాలయం, ఏ.ఓ. హ్యూం పేరున కోపల్లె లోనూ, దాదాబాయి నౌరోజీ పేరున ఉండి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. కుముదవల్లి గ్రామంలో గ్రంథాలయం స్థాపించాలని ఆలోచన ఆ గ్రామానికి చెందిన వడ్రంగి అయిన చిన్నమరాజు గారికి కలిగింది. 

ప్రారంభ చరిత్ర
ఆయన ముందుగా తన వద్ద కల 50 పుస్తకాలు, వాటితో పాటుగా తను తెప్పించే దేశాభిమాని, ఆధ్రపత్రిక, ఆంధ్ర ప్రకాశీక వంటివి తెచ్చి గ్రంథాలయం ప్రారంభించారు. దానికి శ్రీ వేరేశలింగ కవి సమాజ గ్రంథాలయం అని నామకరణం చేసారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ పుస్తకాలకు భూపతిరాజు లచ్చిరాజు గారు ఆశ్రయం ఇచ్చారు. 1897 నాటికి తెలుగు పుస్తకాల ముద్రణ అంతగా లేదు. అయినా పోస్టాఫీసూలద్వారానూ, ఇతర మార్గాలలోనూ దొరికినంత వరకూ గ్రంథాలనూ, పత్రికలనూ సేకరించేవారు.

గ్రంథాలయ నిర్మాణం
గ్రంథాలయ నిర్మాణానికి ముఖ్యులు అని కొందరు ఉంటారు కాని గ్రంథాలయమే బ్రతుకుగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారని శ్రీ భూపతిరాజు తిరుపతి రాజు గారు ఈ గ్రంథాలయం ద్వారా నిరూపించారు.

ప్రారంభించిన కొద్ది రోజులలో గ్రామానికి చెందిన రైతు కుటుంభానికి చెందిన యువకుడు వీరేశలింగ గ్రంథాలయానికి చదువుకొనేటందుకు వస్తూ దానికి పెద్ద అభిమానిగా మారిపోయాడు. క్రమ క్రమంగా గ్రంథాలయ సేవకే అంకితమైపోయారు. గ్రంథాలయ అభివృద్దికొరకు నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. ఆయనే తిరుపతిరాజు. అప్పటి గ్రంథాలయం ఉచితంగా ఉన్న వసతిలో ఉంది. దానికి శాశ్వతమైన వసతి కొరకు కృషి మొదలెట్టారు. గ్రామ మద్యగా సెంటు స్థలాన్ని గవర్నమెంటు నుండి సంపాదించారు. తన సహచరుడు అయిన కాళ్ళకూరి నరసింహం గారి సలహా మేరకు ప్రజా కార్యక్రమాల పట్ల ఆశక్తి కలిగిన వితరణ శీలి పోలవరం జమిందారు (వీరిది వీరవాసరం స్వగ్రామం) అయినటువంటి కొచ్చెర్ల కోట రామచంద్ర వెంకట కృష్ణరావు గారిని సంప్రదించి వారి ద్వారా గ్రంథాలయం కొరకు 400 విరాళంగా పొందారు. ఆ నిధితో తాటాకుల ఇంటిని నిర్మించి దానిలోకి గ్రంథాలయాన్ని మార్చారు.
పాఠకుల ఆశక్తి కొత్తగా కట్టిన ఇంటిలోకి మారిన గ్రంథాలయానికి పాఠకుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఉన్న వాటితో పాటు మరికొన్ని పత్రికలను కూడా తీసుకోసాగారు అప్పట్లో వచ్చే పత్రికలు
 • బ్రహ్మ ప్రకాశిని (1886) రఘుపతి వెంకట రత్నం నాయుడు
 • కృష్ణాపత్రిక (1902) ముట్నూరి కృష్ణారావు
 • ఆముద్రిత గ్రంథ చింతామణి (1895)
 • జనానా (1904) రాయసం వెంకట శివుడు
 • ఆంధ్రపత్రిక (1905) కాశీనాధుని నాగెశ్వరరావు పంతులు
విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ప్రచురణలు అన్నిటినీ గ్రంథాలయానికి సేకరించేవారు. మచిలీపట్నం ఆంధ్ర బాషావర్ధనీ సమాజ ప్రచురణలు, కందుకూరి వారి అన్ని రచనలూ ఇక్కడ భద్రపరచేవారు. కందుకూరి వారి శిష్యుడైన తిరుపతి రాజు గారు కేవలం గ్రంథాలయాన్ని పుస్తకాల కొరకే కాక ఒక ప్రజా హిత కార్యక్రమ శాలగా మార్చివేసారు. దీని ద్వారా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించేవారు.

గ్రంథాలయ అభివృద్ది ఇలా పలు కార్యక్రమాలు జరుగుతూ గ్రంథాలయం అనది మన్ననలతో పాటుగా పుస్తకాల సంఖ్య, పాఠకుల సంఖ్య కూడా పెరగటం, కొత్తగా పుస్తకాలకు బీరువాలు ఏర్పాటు చేయడం వలన స్థలాభావం కలగటం గమనింఛి మంచి గ్రంథాలయం నిర్మించవలసిన వసరం ఉన్నదని గ్రహించి ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం ప్రక్కగా మరొక సెంటు భూమి ఇవ్వవలసిందిగా కోరారు. అలా వచ్చిన భూమిలో నిర్మాణం కొరకు తిరుపతి రాజు గారు అనేక మందిని విరాళాలకోసం కలిసారు అలా విరాలం ఇచ్చిన ధాతలు
 • పిఠాపురం మహారాజావారు
 • పోలవరం జమిందారు
 • కోడూరుపాడుకు చెందిన నడింపల్లి నారాయణరాజు
 • భూపతి రాజు సుబ్బరాజు
 • భూపతిరాజు సోమరాజు
 • సాగి వెంకట నరసింహరాజు
 • పెన్మత్స వెంకట్రామరాజు (గోటేరు)
 • భూపతిరాజు కృష్ణం రాజు గారి సతీమణి సీతయ్యమ్మ గార్ల ద్వారా సుమారు 620 రూపాయలు సేకరించి పెంకుటిల్లు నిర్మించారు.
ఈ పెంకుటింటికి కృష్ణారావు మందిరం అని పిలిచేవారు. తరువాత గ్రంథాలయ నిర్వహణ, అభివృద్ది కొరకు మరిన్ని నిధులు కావాలని భావించి 1916 నాటికి సుమారు మూడువేల స్థిర, చరాస్తులను గ్రంథాలయానికి సమకూర్చారు. 1932 నాటికి గ్రంథాలయంలో 16 వందల గ్రంంథాలు చేరాయి. ఈ గ్రంథాలయానికి జిల్లాలోనే గొప్ప గ్రంథాలయంగా పేరు ప్రఖ్యాతులు కలిగాయి. 
 
సరికొత్త భవన నిర్మాణం
దాదాపు 75 సంవత్సరలు సేవలందించిన గ్రంథాలయ పెంకుటిల్లు బలహీనమైపోవడంతోనూ, పుస్తకాల సంఖ్య పెరగతం వలన, చదువుకొనే స్తహలం తగ్గుతూ ఉండటం వలన మరొక విశాలమైన భవన నిర్మాణానికి పూనుకొన్నారు. 1985 మార్చి 1 వతేదీన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూపతిరాజు రామచంద్రరాజు, వారి సతీమణి సూర్యావతి గార్లచే శంకుస్థాపన చేయించారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖులు లార్స్‌విన్ గ్రూప్ కంపెనీకి చెందిన ఎస్.కృష్ణంరాజు గారు, రాసి గ్రూప్ సంస్థల అధిపతి బి.వి రాజు గారు, డెల్టా పేపర్ మిల్స్ అధిపతులు అయిన భూపతిరాజు సూర్యనారాయణ రాజు గార్ల ప్రధాన విరాళాల సహాయంతో సుమారు నాలుగు లక్షలతో నూతన భవనం ఏర్పాటుచేసారు.  దీనిని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి నుండీ అనేక రకాలుగ ఈ గ్రంథాలయం సేవలు కొనసాగిస్తుంది.  

No comments: