Monday, July 23, 2007

మిలీనియం పార్క్ { కొన్ని మార్పులతో }

మా ఊరిలో ఉన్న పెద్ద చెరువులు రెండిట్లో మొదటిది రామచంద్ర గ్రంధాలయం వీధిలో బాలసంగం ప్రక్కనుండగా రెండవది బస్టాండ్ ప్రక్కనుంది. బస్టాండ్ వైపుకాక రెండవవైపును పార్కుగా మార్చాలని పంచాయితీవారు అనుకొన్నారు. మా పంచాయితీవారికి ఈ కధా కాలంలో ఏమయిందో తెలియదుగాని పూనకం వచ్హినట్లుగా కొన్ని మంచి పనులు ఎడా పెడా చేసేయడం మొదలు పెట్టారు. అప్పటి మంచి పనులల్లో ఒకటి ఇంటింటికీ నాలుగునాలుగు మొక్కలు పంచడం మరియు రోడ్లప్రక్క పాతేందుకు. అవికూడా చందనం, జామాయిలు, కొబ్బరి, రేగు, పనస లాటి మంచివి. ఈమొక్కలను నర్సరీలనుంచి దిగుమతి చేసుకోకుండా నర్సరీలనుండి అనుభవమున్న పనివాళ్ళను తీసుకొచ్హి దాదాపు ఆరేడునెలలు అదే చెరువు గట్టున పంచాయతీవారే పెంచడంచేసారు. పంచడం అయిపోయాక మిగిలిన మొక్కలు ఏంచేయాలనే అలోచనలోనుంచి పార్కుగా మార్చాలనుకొన్నారేమో. మరి కొద్ది రోజులకు చిన్న పెద్దా మెక్కలతో మధ్యమధ్య సిమెంట్ బెంచీలతో అందమైన పార్క్ ముస్తాబయ్యింది. 2000 ముందు పూర్తవడంతో ఒకటవ తేదీన ప్రారంభోత్సవం చేయించారు. అందరూ మిలీనియం పార్కుగా పిలుస్తూండంతో పంచాయితీ వారే ఆపేరుతో ఒక బోర్డు తగిలించేసారు అలా అదేపేరు స్థిరపడిపోయింది. పగలు పంచాయితీ నౌకర్ ఒకతడు చూసుకొంటూ ఉండేవాడు. రోజూ జనం వచ్హి కాసేపు కూర్చొని వాళ్ళ చుట్టూ గడ్డీ గాదం పీకేసి వెళ్ళిపోయేవారు.అక్కడి వరకూ బాగానేఉన్నా సమస్య మొదలైంది రాత్రి సమయాల్లోనే. బస్టాండ్ దగ్గరగా ఉండటమూ ఆటోవాళ్ళ, టాక్సీ వాళ్ళ 'వాహనములు నిలుపు స్థలమూ దాని ప్రక్కనే అవుటచే రాత్రి సమయములలో వారి స్వేచ్హా ప్రపంచమునకు అడ్డాగా' పార్కు మారునను విషయము వేరు చెప్పనక్కరలేదనుకొనుచున్నాను. అక్కడ ఆనిశీధిలో ఆ నిశాచరులు జరుపు అకౄత్యములు వర్నింపతగనివై ఉండుటచే మరువాటి ఉదయమునకు ఆ ఉధ్యానవనము ఉక్కిరిబిక్కియై మహాసంగ్రామంలో వరిగి పడిఉన్న పీనుగులవలె నేలకూలిన వౄక్షాలతో తెగిపడిన తలల్లా దొరలుతున్న విస్కీ రమ్ము బ్రాందీ మొదలగు ప్రఖ్యాతబ్రాండు మధుపాత్రలతోనూ, ఆరగించలేక వదిలివేయబడిన అర బిరియానీ పొట్లాలతోనూ, బక్షించిన బిరియానీ అప్పటికే తిష్ట వేయబడిన మధువుతో ఇమడక తగవులాడి బయటకురికిన కారణమున ఏర్పడిన పోగులతోనూ, మరునాటిఉదయమునకు సర్వాంగ సుందరముగా దర్శనమిచ్హుచుండేది. వీరికి మేము మాత్రము ఎందుకు తీసిపోవలెననో లేక మా వంతు సహాయము మేమున్నూ చేసెదము అనో అటు చుట్టు ప్రక్కల నివసించెడి పురజనులునూ... తెల్లగా వెన్నెల విరజిమ్మే చంద్రుని గాని మేమున్నాంసుమా అనే కరెంట్ దీపాలను గాని లెక్క చేయక వారివారల పిలగాండ్ర సౌకర్యార్దం చెంబులునూ డొక్కులునూ నీటితో గొనిపోయి పిడకలు చేయించెడివారని ఉదయ సమయమున ముక్కును వేళ్ళతో భందించి ఆరహదారిన వేంచేసెడి పురజనుల కధనం. ఇది నిజము కాదని నొక్కి వక్కాణిస్తూ అడిగిన వారిని కరిచేలా ఉరికేవారక్కడి వారు.................ఇట్లు ప్రజోపయోగార్ధం ఏర్పాటు చేయబడిన ఈ ఉద్యానవనం ఇట్టి అకౄత్య కార్యక్రమములకు వేదికగా శోభించుట ఎంతమాత్రమూ సరిగాదని తక్షణం ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఒంటి మానవుని ఎంక్వయిరీకమీషన్ అను ఒకటి గుబ్బల ఎర్రియ్య అనే గ్రామ పంచాయితీ నౌకరుతో ఏర్పాటు చేయబడినది.తన ఎంక్వయిరీలో భాగంగా పరిశోధనాకార్యక్రమములునెరుపుటకై ఆ రాత్రి వెళ్ళిన ఎర్రియ్య మరునాటి ఉదయం ఆరెంపీ డాట్టర్ మసేనురావు గారి మకాంలో తెల్లని బాండేజీలతో తేలాడని తెలియ వచ్హింది. కారణాల కోసం మిలీనియం పార్క్ పరిసరప్రాంతములయందు వెదుకడానికి ప్రయత్నించగా దొరకినవేమిటనగా......గొల్లిగాడు. మా పిల్లల్నే చింతబరికెతో కొడతాడా, ఆడి చేతులిరిగిపోను. ఆడోళ్ళని కూడా చూడకుండా అంతలేసిమాటలంటాడా ఈడి జిమ్మడిపోను....ఇక వినలేక ఈ కారణాలు సరిపోతాయని పారిపోయిన సంగతి ప్రక్కనపెడదాం.---లోపాయికారీగా తెలిసిన విషయమేమంటే కుమ్మింది ఆడోళ్ళుకాదు ఆటో డ్రైవర్స్ అని కాని వాళ్ళను రెచ్హగొట్టింది మాత్రం వీళ్ళేనట.------ఇక ఎర్రియ్యను ఆ పరిస్థితిలో చూసిన పంచాయితీ పెద్దలు బెద్ద మీటింగ్ బెట్టి కుస్తీలు మల్లగుల్లాలు మరమరాలు తినేయడం పూర్తయ్యేకా తీసుకున్న నిర్ణయం, మరో ఎల్లయ్యనో,పుల్లయ్యనో ఒంటిమనిషి కమీషనర్ గా పెట్టేందుకు సాహసించలేక మిలీనియం పార్కును మిలీనియంలోనే అంతం చేసేయాలని తొక్కి చంపేయగా మిగిలిన మొక్కలనుకూడా పీకించెయ్యాలని నిర్ణయించేసారు... ....బల్లలను మాత్రం వదిలేసారు పిల్లలు బచ్హాలాడుకొనేందుకుఅలా మాఊరి మిలీనియం పార్క్ మట్టికలిసిపోయింది.శిదిలాలు మాత్రం మిగిలేఉన్నాయ్. పార్కు స్థిరమని తలచి ఫొటో తీయనందుకు మదీయకర్మంబిట్లే తగలడినదని మిక్కిలి చింతించుచూ...........శెలవ్."

Wednesday, July 18, 2007

ఫేవరెట్ ప్లేసులెవరికుండవ్?

నాకిష్టమైన ప్రదేశం.


Tuesday, July 17, 2007

ఒక జ్ఞాపకం

ఊరికి తూర్పుగా ఏరోటున్నాది.
చల్లగా మెల్లగా రా...రారా....... అంటున్నాది.
ఆటలు....సరదా సరదా ఈతలు ఎన్నోఉన్నాయన్నాది.
అటు ఏరూ...... ఇటు ఊరూ..... మధ్యలో మంగమ్మగారూ.
మధ్యలో మంగమ్మగారూ........?
వారెవరూ......? మధ్యలో ఎలా వచ్హారూ ....?
మంగమ్మగారూ..... మా స్నేహితుని మామ్మగారూ....
నా మనవడిని చెడగొట్టేవాడివి నువ్వే అంటారూ...
దొరికితే నామెదడు భోంచేసేస్తారూ....
తీసుకెళ్ళేది లేదిని గదమాయిస్తారూ...
గడప దాటితే మనవడి కాళ్ళిరగ్గొడతానంటారూ...
దొడ్డి గుమ్మం గుండా పారిపోయే మా ఇద్దరినీ చూసి నవ్వుకుంటారూ...
వెదవలు మాటవింటేనా...... అనుకుంటారు."

Sunday, July 15, 2007

రావి మొక్క

ఈ రావి మొక్కను బాగా చిన్నగా ఉన్నపుడు తీసుకొచ్హాను. అది పెరుగుతూ ఉంటే రెండుసార్లు కుండీలను మార్చాను. మరో రెండుసార్లు పైభాగమంతా కత్తిరించేసాను. అదిమాత్రం వామనుడిలా విపరీతంగా పెరిగిపోతూనేఉంది. ఇక కుండీ పగలగొట్టి నేలపై నాలుగయిదు ఇటికలను లేపేసి కొంత మట్టి తవ్వి దీన్ని పాతేసాను. ఇక ఇపుడు ఇది నాతో పాటే పెరుగుతుంది పెద్దవుతుంది. ఇంకా మాపిల్లలతోపాటుగా పెరుగుతూ ఇంకా ఇంకా పేద్దదయిపోతుంది. దాంతో కోతికొమ్మచ్హి అడుకోవచ్హు, ఊయల కట్టి ఊగచ్హు, దాని క్రిందో మంచమేసి హాయిగా అడ్డంగా పడుకోవచ్హు, అపై పిట్టలు రెట్టలు వెయ్యచ్హు "నాకు ఈపోష్టుకు వచ్హిన కామెంట్స్ దౄష్టిలో పెట్టుకొని మరొక్కసారి మోడరేట్ చేయాలనిపించింది. మారుటేరు అనే ఊరినుంచి గోదావరిని ఆనుకొని ఉన్న కోడేరు అనే ఊరివరకూ 50 అడుగుల వెడల్పు గల రోడ్డు 7 కిలో మీటర్లవరకూఉంటుంది. ఈరోడ్ లో విపరీతమైన ఎండ వేడి కాల్చేస్తున్నపుడు కూడా స్థానికులు సైకిళ్ళపై తిరుగుతునే ఉంటారు.కాని ఎవరి వంటిమీదకూడా ఒక్క ఎండ పొడ కూడా పడేదికాదు . కారణం ఆరోడ్డుకు రెండు వైపులా మర్రి, రావి, గుగ్గిళం, మరియు చింత లాంటి చెట్లు వరుసగా ప్రక్కప్రక్కగా ఈ 7 కిలోమీటర్లూ పరచుకునుంటాయి. నిజాయితీ కలిగిన అధికార్లు ఎవరో అప్పుడెప్పుడో పుణ్యం కట్టుకొని పనులు ఖచ్హితంగా చేయించి ఉంటారు. ప్రతి సంవత్సరం రోడ్డు మీదకొచ్హే కొమ్మలను కొట్టేస్తుంటారు అవి మళ్ళీ పెరుగుతూ పోతుంటాయి. రోడ్డు పొడుగూతా ఎంతదూరంచూసినా రెండువైపులా గోడలా అద్భుతంగా కనిపించేది.

ఇదంతా ఒకప్పటి మాట ---మరి ఇప్పుడు..? వరదల కారణంగా కొన్నిపోతే, బాగాపెరిగిన చెట్ల తొర్రలలో రాత్రి వేళల పెట్రొల్ పోసి మంట పెట్టి దుర్మార్గంగా చెట్లను చంపేసే వారి వలన మరికొన్ని. దాదాపు 90 శాతం వరకూ పోయాయి. బోడి రోడ్డు మాత్రం మిగిలిందిప్పుడు. అటు వెళ్ళినపుడల్లా నాకనిపించేది మళ్ళీ పూర్వపు మాదిరి ఎవరు నాటుతారు నాటినా ఎప్పటికి పెద్దవయ్యేను అని. దీంద్వారా నాకు తెలిసిందేమిటయ్యా అంటే పూల పండ్ల మొక్కలు వేస్తే వాటి ఆలనా పాలనా ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. లేదా అవి చచ్హూరుకుంటాయి. కాని పైన చెప్పబడిన మొక్కలను ఎక్కడైనా వేసి మరచిపోయినా అవి పెరుగుతూ పోతాయ్. లేదా కొంత శ్రద్ధ చేసి వదిలేస్తే ఇంకా బాగా పెరుగుతాయ్. వీటి గురించి లాబాలు చెప్పక్కరలేదు మీకూ తెలుసు. నాకు అలాటి అవకాశం ఏది దొరికినా వదలను. ముందోసారి పంచాయతీలో ఇంటింటికీ రెండు మొక్కలు పంచుతుంటే వద్దనుకున్న వాళ్ళను బ్రతిమలాడి వాళ్ళను తీసుకెళ్ళి మరీ వాళ్ళమొక్కలను కూడా నేను తీసుకు తెచ్హుకున్నాను . తెచ్హినవన్నీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి.మా పెద్దమ్మగారింటికెళ్ళినపుడు రెండు మూడు బాదంకాయలను ఒకప్రక్కగా పాతి వచ్హేసాను ఆ సంగతి మరచిపోయాను కూడా. కొంతకాలానికి నేవెళ్ళెసరికి అక్కడొక మీడియం బాదం చెట్టుంది నాకు మహానందం కలిగింది. ఇవన్నీ నాకే ఉపయోగపడతాయనీ కాదు. నాకే ఉపయోగపడాలనీకాదు. నే చేస్తూ పోతానంతే అతరువాతంతా సర్వ ప్రయోజనం........

Tuesday, July 10, 2007

తోటపని.

జీవితంలో వేగం పెరిగి కొన్ని చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకొంటున్నాం. కొంచెం సమయం చిక్కించుకొని తోటపని లాంటివి చేసుకొంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మెదడు ఫ్రెష్ అవుతుంది.కాదా? ఉదయాన్నే లేచి నిన్న పాతిన మొలకలు ఎంత పెరిగాయో, ఏ మొగ్గలు పువ్వులుగా మారాయో, ఏ పూత పిందెలుగా మారాయో, చూసుకొంటూ, వాటిని శుభ్రం చేయడం నీళ్ళు పోయడం పెద్ద పనేంకాదుకధ.
అరె భయ్ ! గీడ కాలు పెట్టనీకి జాగ లేదు. గీ అపార్ట్ మెంట్లల మొక్కల్ గిక్కల్ అంటవ్. ఏడనుంచ్హొచ్హినవ్ దిమాఖ్ గిట్ట ఖరాభయిందర.
అరే ఏందే అన్న గట్లంటవ్. మొక్కలు పెంచనీకి జగా కావల్నా ఏంది. ప్లాంట్లున్నయ్ గాదె ఈడ కిడికిల ఒగటి, ఆడ టివి పక్కనొకటి, గాడ బెడ్రూంల జాగా ఉండెగాదె ఆడొకటి, ఇటు చూడన్నా గిసంటి ప్లేస్ల గులాప్పూల మొక్కెడితే రూంకేం అందమొత్తదన్నా........
ఇలా చెయ్యచ్హు అని నే చెపాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు కాకుంటే కొంచెం బద్దకం. ప్రొద్ధుటే లేచేందుకే ఎంతో కష్టపడాలి, ఇక ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలంటే మరెంత కష్టపడాలో .
తెల్లవారుజామున తీసిన రెండు ఫొటోలను ఇక్కడిచ్హాను. చూసి మీరానందిస్తే నాకూ ఆనందమే.అందులో ఒక ఫొటో నే తయారు చేసిన మడి. చూసారుగా ఇది చాలా చిన్నపని కొంత నేల గడ్డపారతో తవ్వి మట్టి గడ్డలను చిన్నగా చిదిపి ఒక బకెట్ నీళ్ళు పోసి మెత్తగా ఉన్న మట్టిలో మెంతులుఒకప్రక్క, ధనియాలు ఒకప్రక్క, గోంగూర విత్తనాలు ఒక ప్రక్క, ఇలా ఎన్నైనా వేయచ్హు. మా అమ్మగారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్హుకుంటారు. వాళ్ళకూ వీళ్ళకూ కూడా ఇస్తుంటారు. చూసారా చిన్నపని వలన తాజా సరుకు దాంతో ఆరోగ్యం దాంతరువాత ఆనందం.

Sunday, July 8, 2007

నా ఒకానొక ఫ్రెండ్

నా స్నేహితుల లిస్టు కొంచెం పెద్దదే, అందులో నోరున్నవారూ,నోరులేనివారూ ఉన్నారు. నే సరదాగా అడుకొనే అలాంటి వాళ్ళలో ఒక ఫ్రెండును పరిచయం చేస్తున్నాను. భాగుంది కదూ?

Thursday, July 5, 2007

చందమామ కధల్లో పల్లె.

నేను చందమామ కధలు చదివేటపుడు కధల్లో చేప్పే ఒక ఊరు ఊరిప్రక్కన ఏరు దూరంగా కొండపై దేవాలయంవీటన్నిటినీ దానిలోని బొమ్మల సహాయంతో పూర్తిగా ఊహించేందుకు ప్రయత్నించేవాడిని. కాని వీలయ్యేది కాదు.చందమామలో శంకర్ గారి బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. చిన్న బొమ్మతో పెద్ద ప్రపంచాన్ని చూపే ప్రయత్నం చేసేవారాయన. నేనూ అలానే ఊరంటే ఇలా ఉండాలీ అనుకొంటూ ఒక బొమ్మగీసే ప్రయత్నం చేసా.....

Tuesday, July 3, 2007

సొంతడబ్బా.


---సొంత డబ్బాలో ఒకానొక పోష్ట్ ,,,సొంతడబ్బా అని ఎందుకంటే సహాధ్యాయుల బ్లాగులను సందర్శించినపుడు అనేకానేక రంగుల విశేషాలు"విషయమున్న విశేషాలే సుమండీ" కనిపించి కొంచెం కంగారు పుడుతుంది. అరెరే వీళ్ళంతా భలే రాసిపడేస్తున్నారు. మనం మన డబ్బా తప్ప వేరేం రాయలేకున్నాం ఎందుకని? ఎందుకనబ్బాఅనుకుంటూ ఉంటే నాలోవాడు చెప్తాడు. నీ బ్లాగు నీ ఇష్టం నీ సుత్తితో నువ్వు కొట్టు దెబ్బలు తినేవాడి గురించి నీకెందుకు. అందుకనే ధైర్యంగా ఇంకో "'డబ్బా'' వదిలెయ్ అన్నాడు. మరి కాచుకోండి.


నాకు వర్షం అంటే చాలాఇష్టం సాధారణంగా వర్షమొచ్హినపుడు అందరూ ఇంట్లో కూర్చుంటారు. నేనైతే వర్షంలోతడుస్తూ సైకిల్ పై రోడ్లవెంట తిరుగుతాను. అదేంసరదా అంటే నాక్కూడా తెలియదు. కాని వర్షం నన్ను వెనుకకుతోస్తూ ఉంటే ముందుకు పోవడం చాలా బాగుంటుంది. చిన్నగా కురుస్తూ ఉంటే మాత్రం చెరువు గట్టుకు వెళ్ళి ఇటు నుంచి అటు-అటు నుంచి ఇటు, తిరుగుతుంటా.. ఒరేయ్ అదేం పనిరా వానలో తడిస్తే రొంపడతాది రా పైకిరా పై నుంచి మా అమ్మ-అరుపులు వినిపిస్తుంటాయి. మనం వినిపించుకుంటేకద. చెరువు గట్టువెంట తిరిగే అలవాటు ఇప్పటిదికాదు. చిన్నపుడు ఏదైనా తప్పు చేసినపుడు మా అమ్మ చీపురులోంచి రెండుమూడు ఈనెలు తీసి వెంట పడితే దొరక్కుండా చెరువు చుట్టూ తిరిగేవాడిని. చెరువుకు కొంచెం దూరంగా ఒక చింతచెట్టుండేది దానిమానులో పుచ్హుపట్టి ఒకవైపు వరిగి పోయింది. వరిగి మళ్ళీ పెరగడంతో అది చూడ్డానికి విష్ణుమూర్తి శేషపానుపులా ఉంటుంది. అలిగినపుడు మనకదే ఆశ్రయం. చాలా సమయం వరకూ ఇంటికి వచ్హే వాడిని కాను. మా చిన్నక్క వచ్హి కొంతసేపు బ్రతిమలాడేది నేను నాకోపమంతా తనమీదచూపిస్తూ నేరాను పో! అనేవాడ్ని. బలవంతంగా లాక్కెళుతుంటే వదలమని కొడుతుండేవాడిని. భరించి మరీ తీసుకెళ్ళేది. అసలు నేను దెబ్బలు తినేదెక్కడ ఎప్పుడు మా అమ్మ చెయ్యెత్తినా తనే అడ్డంగా వచ్హేసేది దాంతో తనకీ పడిపోయేవి. చెరువుకు ఆవైపుగా పెద్ద కాళీ స్థలం ఉండేది. అక్కడ మరో ఎనిమిది చెట్లు అటు నాలుగు ఇటు నాలుగుగా వరుసగాఉండేవి. అటు చుట్టు ప్రక్కలవాళ్ళకదే' పేద్ద' ఆట స్థలం. కోతికొమ్మచ్హి ఆడినా కొండ కొమ్మచ్హి ఆడినా గూటీ బిళ్ళ, వేటికయినా మాకదే అడ్డాగా ఉండేది. చాలాకాలం తరువాత వాటిలో ఏడు చెట్లను కొట్టేయడం జరిగింది.

ఎనిమిది చెట్ల వల్లనే మాఏరియాను చింతల తోట అంటారట.ఏడు చెట్లు కొట్టేయగా మిగిలిన ఒకేఒక చెట్టు అదే ఇది.