Saturday, March 28, 2015

అద్భుత స్మశానాలు


స్మశానం అంటే పవిత్ర భూమి, ప్రశాంతమైన ప్రదేశం....కాని మనదేశంలో మాత్రం అందమైన భూమి కాలేక పోతున్నది. మనిషి పోతే విలువలేని కట్టెగా జమకట్టినట్టే మరుభూమిని సైతం విలువలేనిదిగానే చూస్తున్నాం.
కొండొకచో కొన్ని చోట్ల సుందరమైన స్మశానాలు ఉన్నా వాటి వద్ద కూడా భయపడుతూ వెళ్ళే వాళ్ళను చూస్తే అయ్యో అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోనక్కరలేదు, మన స్మశానాలు అలా ఉన్నాయి. చుట్టూ భయంకరమైన దుర్గంధం, చెత్త, చెంబు తీసుకెళ్లే అందరికీ అదే రహదారి, వీటికి తోడు ఆక్రమణలకు అడ్డులేకపోవడం..ఇలా స్మశానాలు చిక్కి ముక్కి కుళ్ళిపోతున్నాయి. అందుకే అందరూ మన స్మశానాలను పబ్లిక్ టాయిలెట్స్ అంటున్నారు.

అవసరం ఆరోజుకే అనుకునే మన ఆలోచనకు పరాకాష్ట మన స్మశానాలు, మనం ముక్కు మూసుకొని మూడు గంటల్లో పని పూర్తి చేసుకు వచ్చేస్తాం, మరి జీవితానంతర కాలంలో అక్కడే శాస్వతంగా ఉండే మన పెద్దలను, పిల్లలను, హితులనూ ఇలా అందరినీ అదే కంపులో వదిలేసి వచ్చేస్తాం. మనం మారలేమా, మనను వదిలిపోయే వాళ్లకోసం మనమేం చేయలేమా... ఎలా చేస్తాం అనుకొనే ప్రశ్నే లేదు. చేయగలం ..ఎందుకంటే అలా ముందడుగు వేసిన కొందరి  కృషి పలితంగా  ఏర్పడిన సుందర వనాలు మనముందు ఎన్నో ఉన్నాయి...

అలాంటి సుందర వనాల ఒక అనుభవం -
రాజమండ్రి కైలాసభూమికి నేను నా స్నేహితుడు వెళ్ళాం, మా ముందు ఒక జంట నడుస్తున్నారు. వాళ్ళు నవ్వుకొంటూ మేము ప్రక్కకు రాగానే అడిగారు. ముందు తినడానికి షాపులేవైనా ఉంటాయా అని. ఇక్కడ షాపులేం ఉండవు, బయటకు వెళ్ళాలి. స్మశానంలో షాపులేం ఉంటాయి అన్నాను. స్మశానమా అని తుళ్ళిపడి, ఇది స్మశానమా అని మళ్ళీ అడిగారు. మేము నవ్వుతూ బయట చూసి పార్కనుకున్నరేమో స్మశానమే అటు కాలుస్తారు, ఇటు పూడుస్తారు - ఇక్కడే శవాన్ని పడుకోబెడతారు అన్నా ప్రక్క మందిరంలోని సోపానం చూపుతూ... అంతే వాళ్ళు దేవుడా స్మశానమా అనుకొంటూ ఒక్క ఉరుకుతో వెనుదిరిగి వడివడిగా బయటకు వెళ్ళిపోయారు. రాజమండ్రికి అటు ఇటు అలాంటి సూపర్ స్పెషాలిటీ సుందర స్మశానాలు ఉన్నాయి.

రాజమండ్రిలా కాకపోయినా మేమూ తీసిపోమనే విధంగా మరికొన్ని అద్భుత ఉద్యానవన స్మశానవాటికలు ఉన్నాయి- వాటిలో చెప్పుకోదగినవి. గుంటూరు మహాప్రస్థానం, పితృవనం, స్వర్గధామం,  విశాఖపట్నం లో మద్దేలపాలెం వద్ద శాంతివనం..లాంటివి... అసలు ఆ పేర్లు పెట్టటంలోనే వాటి అందం కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా తగిన వసతులతోనూ, హంగులతోనూ జీవిత కాల పోషణా ఏర్పాట్లు చేయబడినవే. వచ్చిన వాళ్ళు కూర్చొనేందుకు, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏ.సి రూములు, ద్వాన మందిరాలు, సంతాప మండపాలు ఇలా అనేకం (మూడు రోజుల కార్యక్రమం నుండి 11 రోజుల కార్యక్రమం కూడా అక్కడే జరుపుకొనే విధంగా ఆన్ని వసతులు ఉన్నాయి)

నిజానికి మిగతా జిల్లాల కంటే గుంటూరు జిల్లాలో ఈ చైతన్యం చాలా ఎక్కువ. రాబోయే రోజుల్లో అక్కడ ఉద్యమంలా నడిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఏదేమైనా ఇలాంటి కొన్ని సుందర స్మశాన నిర్మాణాల జరగాలని ఇదొక ఉద్యమంలా గ్రామ గ్రామానికీ వ్యాపించి, పోయిన వారి దగ్గరకు ఎప్పుడైనా పలకరింపు కోసమైనా సరదాగా వెళ్ళిరావాలనేట్టుగా ఉండాలి
అలాంటి అద్భుత స్మశానాల నిర్మాణం అన్ని చోట్లా జరగాలి, వాటిలో అందరూ స్వేచ్చగా భయం లేకుండా గౌరవంగా తిరగాలి. మీ ఊళ్లో స్మశానం ఎలా ఉందో చూస్తారా ఇకనైనా?

Tuesday, March 24, 2015

మాలతి కృష్ణమూర్తి హొళ్ళ


మాలతి కృష్ణమూర్తి
అంగవైకల్యం శాపం అనుకొనే ఎందరికో ఆదర్శంగా నిలిచే ధీర వనితామణి. 14 నెల ప్రాయంలో వైరల్ జ్వరం ద్వారా శరీరం అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయిన ఆమె జాతీయ స్థాయిలో సుమారు 300 స్వర్ణ, కాంశ్య పతకాలు గెల్చుకొనే స్థాయిలో ఎలా నిలిచింది. ?


మాలతి జూలై 6వతేదీ 1958లో కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోట గ్రామంలో జన్మించింది. నలుగురు పిల్లలలో ఒకరైన ఈమె తండ్రి హొటల్ నడుపుతుండేవాడు. అలాంటి సమయంలో చక్కని పాప పుట్టిందని మురిసిపోతున్న వారికి  జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురికావడం పెద్ద షాక్. పెద్దయాక పక్షవాతం సంభవించడం ఒకరకమైతే తెలిసీతెలియని వయసులో ఇలాంటి కష్టం రావడం మరీ భయంకరం. పాప బ్రతుకుతుందా అనే స్థితి నుండి, బ్రతికితే ఆమె భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న పెద్ద భూతంలా కనిపించేది. మద్రాస్‌లోని అడయార్‌ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేరారు. రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు, కరెంట్ షాక్‌లూ వంటి వాటి ద్వారా పైభాగానికి శక్తి వచ్చింది. పై భాగానికి అయితే స్పర్శ వచ్చింది కాని క్రింది భాగంలో ఏ మార్పూ లేదు.

తరువాత 15 ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, డాక్టర్ల చుట్టూనే తిరిగింది. బాల్యంలో సహజంగా ఉండే ఆటపాటలు, సుఖసంతోషాలు ఏవీ ఆమె జీవితంలో లేవు. ఈ 15సంవత్సరాల్లో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది.   శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో అవరోధాలతో ఆమె తన చదువు కొనసాగించింది. హైస్కూల్‌ చదువు పూర్తి అయ్యేంతలో, మాలతి నడుము పైభాగం బలపడింది  కాలేజీలో చేరదామని వెళితే తన తరగతి మొదటి అంతస్తులో ఉండేది. ఎవరి సాయంతోనో తప్ప సాధ్యం కాదు. ఎలా రోజూ ?... తండ్రి ప్రోత్సాహంతో కళాశాల ప్రినిసిపల్‌ను కలసి తన తరగతి గదిని క్రింది ప్లోర్‌కు మార్పించగలిగింది. ఈ సంఘటన ద్వారా ఆమె తనూ ఏదైనా చేయగలన్న నూతనోత్సాహంతో ముందుకు నడిచింది. 

1975లో బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలలో మొదటిసారి మాలతి పాల్గొన్నది. దానిలో రెండు బంగారు పతకాలు సాధించిన ఈమె వికలాంగుల క్రీడా పోటీలలో పాల్గొని 100 మీటర్లు, 200వ మీటర్ల వీల్‌ఛేర్‌ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది, వీల్‌ ఛైర్‌లో కూచునే బ్యాడ్‌మింటన్‌, షాట్‌ ఫుట్‌ విసరటం, డిస్క్‌త్రో, జావ్‌లిన్‌ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి వాటిలో అనేక బంగారు పతకాలు గెలుపొందినది. ఈమె ప్రతిభ  ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది.  1989లో డెన్మార్క్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు అందు కొన్నది. పలు దేశాలలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని ఇప్పటికీ 158 బంగారుపతకాలతోపాటుగా 20 రజితపతకాలుకూడా పొందారు.  క్రీడారంగంలో అత్యధిక పతకాలను గెలుచుకొన్న వికలాంగ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం, మాలతికృష్ణమూర్తిని 'విశ్వశ్రేష్ట మహిళ'గా గౌరవించింది. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. క్రీడాశాఖ అర్జున అవార్డుతో సత్కరించింది.

ప్రస్తుతం ఈమె బెంగుళూరులోని బసవేశ్వర నగర సిండికేట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఆఫీసరుగా పనిచేస్తున్నారు. కేవలం తను విజయాలు సాధించడం మాత్రంఏ కాక తనలాంటి మరింట మంది అటు అడుగులు వేయాలనే సంకల్పంతో  వికలాంగుల కోసం మాత్రు పౌండేషన్ అనే పేరుతో ఆశ్రమం, క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి  నిర్వహిస్తున్నారు.  దీనిలో సుమారు 16 మంది వికలాంగ విధ్యార్దినీ, విద్యార్ధులు ఉన్నారు. 

ఆశక్తిగా ఉన్న ఈ కధలో ఆమె తపన, కసి, పట్టుదల మాత్రమే  కాదు, ఆమెలో కల కరుణ, దయ, సేవాగుణం కూడా కనిపిస్తాయి. వైకల్యం ఉన్న వారితో పాటు ఏ వైకల్యం లేని కొందరికి కూడా ఈమె స్పూర్తి ప్రధాత
(సమాచార సేకరణ, అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల ద్వారా)

Sunday, March 8, 2015

అరసవల్లి సూర్యభవానుని దేవాలయ చరిత్ర


శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అతి పురాతన ఆలయం అరసవల్లి.  భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ 3 శాసనాలు లభిస్తున్నవి. వీటిని దేవాలయం నుండి బయటకు వచ్చు ద్వారం వద్ద ప్రదర్శనకు ఉంచారు. ఈ  శాసనాల ద్వారా ఈ ఆలయం  క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినదిగా అతి ప్రాచీనమైనదిగానూ చెప్పబడినది. దీనిని ఒరిసాకు చెందిన కళింగ రాజులలో నల్గవ వాడైన దేవేంద్రవర్మ నిర్మించినట్టుగ చరిత్రకారుల కధనం.
పురాణ కధనం
ఈ ఆలయానికి శ్రీకాకుళం నాగావళి ఒడ్డున కల ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయానికి సంభందం కలిగి ఉన్నది. ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారిని మహాశివరాత్రి దర్శించిన జన్మరాహిత్యం ఉండదని ప్రతీతి. ఇక్కడ లింగ మూర్తిని బలరాముడు ప్రతిష్టించెను. ఈ మూర్తిలో రుద్రకోటి గణము కనిపించుట వలన బలరాముడు రుద్రకోటేశ్వరునిగా నామకరణము చేసెను. 
ప్రతిష్ట పూర్తి అయిన తరువాత దేవతలంతా శివుని దర్శించుకొని వెళ్ళారు. కాని ఇంద్రుడు ఆలస్యంగా రావడం వలన నందీశ్వర, బృంగీశ్వర, శృంగీశ్వర తదితరులు తరువాత రమ్మని చెప్పగా వారితో ఇంద్రుడు వాదిస్తూ ఘర్షణకు దిగెను. కోపము వచ్చిన నందీశ్వరుడు కొమ్ములతో ఇంద్రుని దూరంగా విసిరేసాడు. ఇండ్రుడు పడిన ప్రాంతం తరువాత ఇంద్ర పుష్కరిణిగా ఏర్పడినది. ఇంద్రుడు నంది కొమ్ముల ధాటికి సర్వశక్తులు కోల్పోయి పడిఉన్నసమయం - అప్పుడే తొలి వెలుగులతో ఉదయిస్తున్న సూర్య భగవానుని ప్రార్ధించగా సూర్యుడు ప్రత్యక్షమై నీవు పడినచోట వజ్రాయుధంతో త్రవ్వమనగా అక్కడ సూర్యభగవానుని విగ్రహం బయల్పడినది. దానిని ప్రతిష్టించి కొలిస్తే శక్తి తిరిగి వస్తుందని సూర్యభగవానుడు తెల్పడంతో, అక్కడ మూర్తిని ప్రతిష్టించి పూజించి, తనశక్తులను పొందాడు. తరువాత అక్కడ ఆలయ నిర్మాణం గావించాడు.

నిర్మాణ విశేషాలు
ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజాము నవాబు పాలన క్రిందికి వచ్చింది. ఔరంగజేబు ద్వారా ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాల ధ్వంసం జరిగింది. ఆ విషయాలను అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఒకటి. 
సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించారు. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
ఇప్పటి తధనంతర దేవాలయం 18 వ శతాబ్ధంలో ఆదిత్య విష్ణు శర్మ మరియు భానుశర్మవార్ల వంశస్తుల ద్వారా నిర్మించబడినది. శ్రీ రామకృష్ణరావు దుసి గారు ఆలయానికి మరిన్ని నిధులు అందించారు.

ప్రత్యేకతలు
* దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ,ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది. 
* విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రధం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. 
* ప్రతి రధ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రధం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు.
* బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంభందించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేసారు.
* ఈ ఆలాయం శ్రీకాకుళానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. త్వరలో శ్రీకాకుళంలోనేకలసిపోవచ్చు

Friday, March 6, 2015

శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాకుళం


ఉమారుద్రకోటేశ్వరస్వామి దేవస్థానం పంచాయతన దేవాలయాల్లో ఒకటి. దేవాలయాన్ని ఆనుకొని నాగవళి నది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. 'శ్రీ'లకు ఆకారమైన పట్టణంగా శ్రీకాకుళంను పూర్వం రుద్రకోటేశ్వర అగ్రహారం అనెడివారు. బలరాముడు ద్వాపర యుగాంతమున ప్రతిష్టించిన ఐదు ఆలయాల్లో ఒకటి కనుక పంచలింగ క్షేత్రమని పిలిచేవారు. బౌద్ద ప్రాభల్యం ఎక్కువగా కల ఈ ప్రాంతం క్రీ.శ. 4 వ శతాబ్ధం నుండి  వైదిక మత ప్రాభల్యం పెరిగి శైవమతం వ్యాప్తి జరిగింది. 

ఉమా రుద్ర కోటేశ్వర స్వామి క్షేత్ర చరిత్ర
కురుక్షేత్ర సంగ్రామంలో బంధునాశానన్ని చూడలేక బలరాముడు తీర్ధ యాత్రలకు దక్షణానికి బయలుదేరతాడు. వింద్యపర్వతములు దాటి దండకారణ్యం అధిగమించి మాధవ వనములో పధ్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచూఉండెను. కరువు కాటకములతో బాధపడుతున్న కళింగ ప్రజలు కొందరు బలరాముని దర్శించవచ్చి తమకు కరువునుండి విముక్తి కల్పించమని వేడుకొన్నారు. దానితో బలరాముడు వారికి జలాధారము కల్పిస్తే పాడిపంటలతో ఆ ప్రాంతము సస్యశ్యామలమవునని తలచి వారితో మీరు కాశీ క్షేత్రమునకు వెళ్ళకుండా ఇక్కడికే గంగా జలమును తెప్పిస్తాను అని తన నాగలితో భూమిని చీల్చుచూ జలమును పైకి తెచ్చెను. అలా నాగలి వలన ఏర్పడినది కనుక దానిని నాగావళి నదిగా పిలిచారు. ఆ జలవాహిని సంగం దగ్గర నుండి వేగవతి, సువర్ణముఖీ నదులను కలుపుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసి సాగర సంగమం చేసినది.
 ఈ నాగావళి వడ్డున పంచ లింగాలను బలరాముడు ప్రతిష్టించెను - అవి
* ఒరిస్సాలో రాయఘడ వద్ద పాయకపాడులో పాయకేశ్వర స్వామివారు
* పార్వతీపురంకు మూడు కిలోమీటర్ల దూరంలో గుంప గ్రామంలో సంగమేశ్వరస్వామి
* పాలకొండ దరి సంగం వద్ద సంగమేశ్వరుడు
* శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వరుడు
* కళ్ళేపల్లి గ్రామం వద్ద మణి నాగేశ్వర స్వామి

నిర్మాణ విశేషాలు
ఈ ఆలయంలో ప్రాచీన వైఖరి కొట్టొచ్చినట్టుగా కంపిస్తుంది. పూర్వదేవాలయం మహమ్మదీయ దండయాత్రలకు నాశనం అవ్వగా 1774 లో కోనాడ వస్తవ్యులు శ్రీ మగటపల్లి కామయ్య శెట్టి గారిచే పునర్నిర్మాణం జరిగినది. మూల విగ్రహాన్ని 2003లో అష్టభంధన సహిత శిలాకవచంతో సద్గురు కృష్ణయాజి గారి ఆధ్వర్యంలో పునప్రతిష్టించారు. ఈ ఆలయం శిల్ప సౌందర్యంతో శాస్త్రీయ మెళకువలతో నిర్మించారు. ఆలయ మద్యస్తంగా పెద్ద ఏకశిలా నందీశ్వరుడు, ద్వారానికిరువైపులా బృంగీశ్వర,శృంగీశ్వరులు దర్శనమిస్తారు. మరోవైపుగా ఆలయ సముదాయంలో శ్రీరాముడు సీతమ్మ వారితో ఏకశిలపై దర్శనమిస్తారు. ఇంకొకవైపు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. దేవాలయ వెలుపలి వైపుగా పెను వటవృక్షం ఉంది. దీని పాదప్రాంతంలో వరసిద్ది వినాయక స్వామి పూజలందుకొంటుంటాడు.

Tuesday, March 3, 2015

శ్రీకాకుళం



శ్రీకాకుళం అతి పురాతన చరిత్ర కలిగిన పట్టణం. భారతదేశం యొక్క  ఈశాన్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక ప్రముక పట్టణం మరియు జిల్లా యొక్క ముఖ్యపట్టణం. ఉత్తరాంధ్రగానూ, గుల్షంబాద్ గానూ, చీకాకోల్ గానూ, శీఖాకోల్‌గా కూడా పిలుస్తూ శ్రీకాకుళం స్థిరపరచబడినది. 
 
చారిత్రక విశేషాలు
దీని చారిత్రక విశేషాలలోనికి వెళితే, క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్ధంలో బౌద్ద మత ప్రాభల్యం ఎక్కువగా ఉండేది. 14 వ శతాబ్ధంలో భారతదేశ తూర్పు రాజవంశాలైన గంగారాజ వంశపు రాజుల యొక్క కళింగ రాజ్యంలో సుమారుగా 800 సంవత్సరాలు ఒక భాగంగా ఉండేది.  ఒరిస్సా గజపతులను, కొండ జమీలకు కూడా భాగంగా కలుపుకొని రాజ్యం వర్ధిల్లింది. విజయనగరం రాజులు కూడా కొంత కాలం శ్రీకాకుళంలో కొంత భాగాన్ని పరిపాలించారు. తరువాత ముస్లిం పరిపాలనలో కొంత కాలం ఉంది. వారు గుల్షన్‌బాద్‌గా వ్యవహరించేవారు. తరువాత కొంత కాలానికి బ్రిటిష్ రాజరికంలో దీనిని చీకాకోల్‌గా వ్యవహరించారు. స్వతంత్రానంతరం శ్రీకాకుళంగా మార్చారు. 
శాలిహుండం, జగతి మెట్ట, ధంతపురి మొదలైన ప్రదేశాలలో జరిగిన అనేక తవ్వకాల ఆధారంగా ఇక్కడి ప్రజలు గొప్ప శాంతితో కూడిన సాంస్కృతిక జీవితం అనుభవించిన ఆనవాళ్ళు లభించాయి.
నదులు
బలరాముని నాగలి ధాటికి విచ్చిల్లిన భూమి నుండి ఉద్భవించిన నాగావళీ నది మొదలు వంశధార, మహేంద్రతనయ, చంపావతి, భుధ, సువర్ణముఖి, వేగవతి మరియు గోముఖి నదుల వలన పచ్చని పంటలతో, అరణ్యాలతో విలసిల్లిన భూమి శ్రీకాకుళం.
క్షేత్రాలు
పురాణపరంగా, పుణ్యక్షేత్రాలపరంగా వాసికెక్కిన మేటి శ్రీకాకుళం పట్టణం. పురాణాలలో తెల్పబడిన ఎన్నో క్షేత్రాలు, తీర్ధాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. అరసవెల్లి, శ్రీకూర్మం, ముఖలింగం లాంటి ప్రసిద్ద క్షేత్రాలతో విలసిల్లుతుంది.

ప్రముఖులు
ఇక్కడ వడ్డాది పాపయ్య, ఎస్. కాంతారావు, కరణం మల్లేశ్వరి,కాళీపట్నం రామారావు, కోడి రామ్మూర్తి నాయుడు,గిడుగు రామమూర్తి, బలివాడ కాంతారావు, మల్లాది వేంకట కృష్ణశర్మ, సర్దార్ గౌతు లచ్చన్న వంటి పెక్కుమంది కళాకారులు, సాహితీకారులు, రాజకీయనాయకులు ఇలా ఎన్నో రంగాలలో విశేషమైన కృషి చేసారు

శ్రీకాకుళం పట్టణానికి రవాణా బహుముఖాలుగా ఉంది. మద్రాస్,కలకత్తా జాతీయ రహదారి 5 ను ఆనుకొని ఉండటం, శ్రీకాకుళం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే లైను ద్వారా రవాణా వసతి కలిగిఉంది.