Tuesday, March 24, 2015

మాలతి కృష్ణమూర్తి హొళ్ళ


మాలతి కృష్ణమూర్తి
అంగవైకల్యం శాపం అనుకొనే ఎందరికో ఆదర్శంగా నిలిచే ధీర వనితామణి. 14 నెల ప్రాయంలో వైరల్ జ్వరం ద్వారా శరీరం అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయిన ఆమె జాతీయ స్థాయిలో సుమారు 300 స్వర్ణ, కాంశ్య పతకాలు గెల్చుకొనే స్థాయిలో ఎలా నిలిచింది. ?


మాలతి జూలై 6వతేదీ 1958లో కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోట గ్రామంలో జన్మించింది. నలుగురు పిల్లలలో ఒకరైన ఈమె తండ్రి హొటల్ నడుపుతుండేవాడు. అలాంటి సమయంలో చక్కని పాప పుట్టిందని మురిసిపోతున్న వారికి  జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురికావడం పెద్ద షాక్. పెద్దయాక పక్షవాతం సంభవించడం ఒకరకమైతే తెలిసీతెలియని వయసులో ఇలాంటి కష్టం రావడం మరీ భయంకరం. పాప బ్రతుకుతుందా అనే స్థితి నుండి, బ్రతికితే ఆమె భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న పెద్ద భూతంలా కనిపించేది. మద్రాస్‌లోని అడయార్‌ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేరారు. రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు, కరెంట్ షాక్‌లూ వంటి వాటి ద్వారా పైభాగానికి శక్తి వచ్చింది. పై భాగానికి అయితే స్పర్శ వచ్చింది కాని క్రింది భాగంలో ఏ మార్పూ లేదు.

తరువాత 15 ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు, ఆపరేషన్లు, డాక్టర్ల చుట్టూనే తిరిగింది. బాల్యంలో సహజంగా ఉండే ఆటపాటలు, సుఖసంతోషాలు ఏవీ ఆమె జీవితంలో లేవు. ఈ 15సంవత్సరాల్లో ఆమె 27 ఆపరేషన్లు చేయించుకుంది.   శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో అవరోధాలతో ఆమె తన చదువు కొనసాగించింది. హైస్కూల్‌ చదువు పూర్తి అయ్యేంతలో, మాలతి నడుము పైభాగం బలపడింది  కాలేజీలో చేరదామని వెళితే తన తరగతి మొదటి అంతస్తులో ఉండేది. ఎవరి సాయంతోనో తప్ప సాధ్యం కాదు. ఎలా రోజూ ?... తండ్రి ప్రోత్సాహంతో కళాశాల ప్రినిసిపల్‌ను కలసి తన తరగతి గదిని క్రింది ప్లోర్‌కు మార్పించగలిగింది. ఈ సంఘటన ద్వారా ఆమె తనూ ఏదైనా చేయగలన్న నూతనోత్సాహంతో ముందుకు నడిచింది. 

1975లో బెంగుళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలలో మొదటిసారి మాలతి పాల్గొన్నది. దానిలో రెండు బంగారు పతకాలు సాధించిన ఈమె వికలాంగుల క్రీడా పోటీలలో పాల్గొని 100 మీటర్లు, 200వ మీటర్ల వీల్‌ఛేర్‌ పరుగు పందాలలో తన ప్రతిభ కనబరచింది, వీల్‌ ఛైర్‌లో కూచునే బ్యాడ్‌మింటన్‌, షాట్‌ ఫుట్‌ విసరటం, డిస్క్‌త్రో, జావ్‌లిన్‌ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి వాటిలో అనేక బంగారు పతకాలు గెలుపొందినది. ఈమె ప్రతిభ  ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది.  1989లో డెన్మార్క్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలలో 4 బంగారు పతకాలు అందు కొన్నది. పలు దేశాలలో జరిగిన ఆటల పోటీలలో పాల్గొని ఇప్పటికీ 158 బంగారుపతకాలతోపాటుగా 20 రజితపతకాలుకూడా పొందారు.  క్రీడారంగంలో అత్యధిక పతకాలను గెలుచుకొన్న వికలాంగ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 1999లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం, మాలతికృష్ణమూర్తిని 'విశ్వశ్రేష్ట మహిళ'గా గౌరవించింది. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. క్రీడాశాఖ అర్జున అవార్డుతో సత్కరించింది.

ప్రస్తుతం ఈమె బెంగుళూరులోని బసవేశ్వర నగర సిండికేట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఆఫీసరుగా పనిచేస్తున్నారు. కేవలం తను విజయాలు సాధించడం మాత్రంఏ కాక తనలాంటి మరింట మంది అటు అడుగులు వేయాలనే సంకల్పంతో  వికలాంగుల కోసం మాత్రు పౌండేషన్ అనే పేరుతో ఆశ్రమం, క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి  నిర్వహిస్తున్నారు.  దీనిలో సుమారు 16 మంది వికలాంగ విధ్యార్దినీ, విద్యార్ధులు ఉన్నారు. 

ఆశక్తిగా ఉన్న ఈ కధలో ఆమె తపన, కసి, పట్టుదల మాత్రమే  కాదు, ఆమెలో కల కరుణ, దయ, సేవాగుణం కూడా కనిపిస్తాయి. వైకల్యం ఉన్న వారితో పాటు ఏ వైకల్యం లేని కొందరికి కూడా ఈమె స్పూర్తి ప్రధాత
(సమాచార సేకరణ, అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల ద్వారా)

No comments: