Friday, December 26, 2008

పెస్టివల్ పుస్తకాలు




అదేంటో గాని హైదరాబాదు ఏరకంగా సూసినా నాకు చెత్త సిటీలాగే కనిపిత్తాది. ఏదో కొన్ని ఇసయాల్లో తప్ప అలాంటిదే ఒకిసియం 'పుస్తకాల దుకాణాలు' మంచియ్యన్నీ ఇక్కడుంటం. మద్య అబిట్స్ విశాలాంద్ర సూత్తే భలే ముచ్చటేసింది. సూపరు సూపరు బుక్సు అన్నీ ఉన్నాయి. ఆత్రం కొద్దీ చేలా కొనేసాను. అంతే కాక సంవత్సరానికి సభ్యత్వం కూడా తీసుకొన్నా అప్పటికంటే కూడా మొన్నామధ్య జరిగిన బుక్కు పెస్టివల్కెళ్ళినపుడు ఇంకా చాలా మంచి పుస్తకాలు కొనేసే చాన్సు వచ్చింది. ఎలాగా మందగ్గర కార్డుందికద అందరికీ 10 పెర్సెంట్ అయితే మనకి 20 పెర్సెంట్ వచ్చుద్ది.
అయితే మేము అలాగెల్లినందుకు చాలామందికి మంచి జరిగిందండోయ్ అదేంటంటారా.
పెద్దపెద్ద పుస్తకాలు, ఎక్కువ రేట్లున్న పుస్తకాలు కొనాలనుకుని ఎనకాడేవోళ్లకు నా కార్డు బాగా ఉపయోగపడింది. నేను పెస్టివల్కి రెండుసార్లెల్లేను. మొదటి సారెల్లినపుడు మన గుంపోళ్ళ మీటింగ్ జరిగింది. అప్పుడన్నమాట. ఆ రోజున నింపాదిగా చూడాలనుకొనే పెద్దయ్యలు కొంతమంది తగిలి పెద్దపుస్తకాల కోసం మోజుపడితే కొనిపించీసేం. మల్రోజు క్రిస్మస్ కెళ్ళాం అప్పుడూ బాగా జనాలున్నారు. మొదట్రోజు తెలీటం చేత ఈ సారి చాలా మంది పుస్తక ప్రియులికి 20 పర్సెంట్ తగ్గీపిత్తాం కొనుక్కుంటారా అనడిగితే ఓయస్ అనీసేరు. దాంతో ఆళ్ళకి ఆళ్ళ ప్రెండ్స్ ఆళ్ళకి ప్రెండ్స్ అలా చాలామందిచేత పెద్దపెద్ద పుస్తకాలు,రేటెక్కువ పుస్తకాలు కొనిపించీసేం. ఆళ్ళూ ఆళ్ళ స్నేహితులూ, ఆళ్ళతో పాటు మేమూ చేలా ఆనందపడిపోయేం. ఇయ్యన్నె కాక మేంగూడా చాలా పుస్తకాలు కొనీసేం. మొదట్రోజు విజేత పబ్లికేషన్స్ వాళ్ళ సాపుకెళ్ళినపుడు పెద్దబాలశిక్ష ఎంతాని అడిగేం ' నూటతొంభై అసల్రేటు నూటిరవైకిచ్చేత్తాం తీసుకొండన్నారు. సరే మొత్తమంతా చూసేసాక మల్లొచ్చి తీసుకుందాం అనుకుని అన్నీ అయ్యేకా వచ్చి అడిగితే నూటిరవైయ్యన్నారు.అదేంటండే ఇందాకొచ్చి అడిగితే నూటిరవయ్యేనన్నారు ఇప్పుడు ఇరవై పెంచేసేరు అనగానే కొద్దిగా ఆగండి అని మా ముందున్న బేరం అదే పెద్దబాలశిక్షకు నూటయాబై ఇచ్చి వెళ్ళిపోగానే మాకు మరోటి నూట ఇరవై ఇమ్మని ఇచ్చేసేరు. ఇచ్చేత్తా అన్నారు మీరు ముందు అడిగారు కనుక ఆరేటు ఇప్పుడు కాదండి అని,
పోన్లే మనకైతే తక్కువకే వచ్చిందికద అనుకుని బయల్దేరేసాం.




ఆ మద్య విజయవాడ ఎళ్ళినపుడు ఎమొస్కో వాళ్ళను శ్రీపాద గారివి వడ్లగింజలు,క్షీరసాగరమధనం లాంటి నవల్లేమమయినా ఉన్నాయా ఆని అడిగితే ఈ మద్య అటువంటి నవల్లు ప్రింటింగ్ జరగటం లేదు, మాదగ్గరకూడా లేవు అన్నారు. అయ్యో అనుకొన్నా. బుక్ పెస్టివల్లో నాకా పుస్తకాలు దొరికేసినయ్యి. శ్రీపాదకధలు అనీ ఒకటి, పుల్లంపేట జరీచీర అనీ ఒకటి. ముందు చూళ్ళేదుకాని పుల్లపేట జరీచీర బుక్కులోనే ఇయ్యన్నీ ఉన్నాయ్. కాపోతే కధలు తగ్గించేసి చిన్నగా మార్చేసేరు. సరే ఏదైనా నాక్కావలసిన పుస్తకాలు దొరికినియ్యి అదే ఆనందం.

నేను తీసుకున్న పుస్తకాలు ఇయ్యి
1. ఒకయోగి ఆత్మకధ
2. అత్తగారి కధలు (భానుమతి)
3. అంపశయ్య (నవీన్)
4. రంగులరాట్నం (ముళ్ళపూడీ వెంకట రమణ)
5. బుడుబు ( శీ రమణ )
6. శ్రీపాద కధలు (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి)
7. పుల్లపేట జరీచీర (శ్రీపాద)
8. పెద్దబాలశిక్ష
9. ఆనాటి వాన చినుకులు (వంశీ)
10. మా పసలపూడి కధలు (వంశీ)
11. బాపు బొమ్మల రామాయణం (రమణ)
12. స్తోత్ర రత్నాలు (శ్రీనివాస్)

ఇంకా కూని మల్లది నవల్లూ, యందమూరి నవల్లూ కూడా

Thursday, August 28, 2008

మా ఊరి కృష్ణ మందిరం



మా ఊళ్ళో ఇంత వరకూ క్రిష్నాష్టమికి ఉట్టి కొట్టాలంటే వీదిలో టెంపరరీగా ఆరోజు మందం ఏదో వీలయినట్టు చిన్న పందిరి వేసి అక్కడొక క్రిష్నుడి పటం పెట్టి పండగ అయిందనిపించేవారు.
కొద్దిగా గట్టిగా అయిఒతే మాత్రం బాల సంఘం గాంధీ బొమ్మల దగ్గర మెయిను గుమ్మంపైన ఎప్పుడో రాజుల కుర్రోళ్ళు కట్టించిన మాదిరి బొమ్మ దగ్గర మాత్రం ఇప్పటి కుర్రోళ్ళకు ఉత్సాహం పోయినా అప్పటి కుర్రోళ్ళు ముసలోళ్ళయిపోయినా వాల్లే చిన్న బుడ్డోళ్ళను కూడా వేసుకొని తిరిగుతూ బాల సంఘపు పెద్ద గుమ్మం పైన కట్టిన మండపంలో ఉన్న చిన్న క్రిష్ణుడి బొమ్మ దగ్గరా, ఆచుట్టు పక్కలా చేతనైన అలంకారం చేసి క్రిష్ణాష్టమి కొద్దిగా ఘనంగానే చేసాం అనిపిస్తారు.

దాంతరువాత దానికంతే కొద్దిగా తక్కువగానే అయినా మేమూ బానే చేత్తాం అనిపించుకొనే మరో కుర్రోళ్ళ టీం బస్టాండ్ సెంటర్లో ఉంది. బస్టాండును ఆనుకొని కూలిపోడానికి సిద్దంగా ఉన్న సాయిబుల సీను సైకిలు షాపు పక్కన మొన్నామద్య కుర్రోళ్ళు చందాలేసుకొనీ, సెంటర్లోని కొట్లలో వసూలు చేసిన మొత్తం కలిపి అక్కడొక దిమ్మ కట్టి దానిపై చిన్న విగ్రహం పెట్టారు. అలా నిలబెట్టిన చిన్ని క్రిష్ణుడి విగ్రహం దగ్గర మాత్రం మొదటి దానికి విరుద్దంగా పిల్లగాళ్ళు దార్లో దొరికిన వాడ్ని దొరికినట్టుగా అడ్డంపడి అటకాయించి కొందరితో తిట్లు తిని మరీ వసూలు చేసిన కొద్దిపాటి పైకంతో బానే చేసేం అనిపించేవారు.



మొన్నా మద్య వరకూ సాయిబాబా గుడి లేకపోవడంతో అంతా పక్క టౌనుకు వెళుతుండేవారు. ఇప్పుడు అదీ కట్టేసారు. ఇది లేదూ అనుకోడానికి వీల్లేకుందా అన్ని దేవాలయాలూ విశాలంగా కట్టేసారు ఊళ్ళో. ఇక లేనిదల్లా ఒక్క క్రిష్ణుడి గుడి మత్రమే అనుకుంటూ ఉండే వాళ్ళం.

అయితే కోరికా తీరిపోయింది. నాకు మొన్న ఊరెళితే అది కూడా కనిపించి భలే హాచ్చర్యమేసింది. గుడి కట్టిన తీరు మరీ భలేగనిపించింది. చుట్టూ కాళీగా, ముందు రెండు వాటర్ పౌంటెన్లు, మద్యగా పాలరాతి క్రిష్నుడు. అబ్బా భలే అందంగా ఉంది. అరె చాలా ఎక్కువ చెపుతున్నాడు పిల్లోడు అనుకోవద్దు. పల్లెటూళ్ళో మాత్రం ఉంటే గొప్పగానే ఉంటదని మీకూ తెలుసు. (సాక్షానికి బొమ్మలు కూడా ఇచ్చానండోయ్)



ఇక మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటయా అంటే ఇక నుండి అక్కడ కూడా ఉట్టి కొట్టే ఉత్సవం భలే చేస్తారని....

Tuesday, July 15, 2008

రహదారిమిత్రులు


సాధారణంగా ఎవరి ఊరిని గురించిన సంగతులు వారు గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటే. అలానే గమనిస్తే మన ఊళ్లలో కొన్ని ప్రత్యేక మైన కేరక్టర్స్ కనిపిస్తుంటాయి. వాళ్లు అందరికీ గురుతుంటూ చాలా కాలం తరువాత అయినా మనం అక్కడికి వెళ్ళినపుడల్లా వాళ్లను గురించి ప్రత్యేకంగా అడుగుతుంటాం. అలాంటి ఒకరిద్దరు మా ఊళ్ళో కూడా ఉన్నారు.
మా ఊరు నరసాపురం, నిదదవోలుల మద్య మెయిన్ రోడ్డు నుండి రెండు, రెండున్నర కిలో మీటర్లు లోపలికుంటుంది. అందువలన రాత్రి పది దాటాక "రాత్రి" సినిమా మొదటిపార్టులా ఉంటుంది అక్కడి వాతావరణం. మనిషన్న వాడు కనిపించడు, లోపలికెళ్ళేందుకు ఏ విధమైన వాహనాలు ఉండవు. పదకొండు అయితే ఇక మరీ భయంకరం. దారంతా కొన్ని చోట్ల తప్ప పూర్తిగా కరెంటు దీపాలు కూడా ఉండవు. ఆ సమయంలో ఏ ముఖ్యమైన పని మీద అయినా ఆలస్యం అయిన వాళ్లకు చచ్చే చావే.
అనవసరంగా వచ్చాం రా' బాబూ అనుకొంటూ నడుస్తున్న వాళ్ళకు వెనుకగా దీపాల వెలుగుతోపాటు మోటార్ సైకిల్ సౌండ్ వినిపిస్తుంది. వెనుక సీటుపై పెద్ద అల్యూమినియం పాలకేను, దానికి రెండుప్రక్కలా మరో రెండు పాలకేనులు, ముందువైపు రెండు ఇత్తడి బిందెలు, ఇంకా డ్రైవింగ్ సీటుపై ఒక భారీ ఆకారం కనిపిస్తుంది. అది పాల వ్యాపారం చేసే గుబ్బల శ్రీనివాస్ అనే శాల్తీది. దారిలో నడిచెళ్లేది ఒకరే అయితే సీటులోనే ఏదో విదంగా ఇరికించి వాళ్ళనువాళ్ళకు కావలసిన ఇంటి దగ్గర్లోని దారిలో దించేస్తాడు. ఇద్దరుంటే వెనక సీటుపై కల పాలకేనుపై కూర్చోబెట్టి పడిపోకుండా ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చి భయ్యమని పోనిస్తాడు. ఆ సమయంలో ఎవరున్నా అక్కడ జరిగేదదే. మీ కేం భయ్యం లేదు నేను తీస్కేల్తా కదా జాగర్తగా అని భరోసాతో సైతం తీసుకెళ్లడం రోజూ పాల వ్యాపారం చేసి పొద్దుపోయిన తరువాత వచ్చే అతని అలవాటు. అసలే పాలకేను దానిపై మరో మనిషి కూర్చుంటే ఎలా ఉంటుంది. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టుగా అనిపిస్తుటుంది అలా ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొస్తున్నపుడు చూస్తే
ఇక రెండవ వ్యక్తి - పేపరు విలేకరిగా పనిచేస్తూ పదకొండు గంటలకు వచ్చే మారుతి. అతని సైకిల్ ప్రయాణంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఊరి వరకూ రావడం కూడా మామూలుగా కనిపించే దృశ్యమే. కొత్తవాళ్ళు మొహమాట పడుతారేమోనని అడిగి మరీ తీసుకెళ్ళడం ఇతడి ప్రత్యేకత.
అలసట పని ఒత్తిడి లాంటివి వారికి ఉండవా అనుకొంటాం మేము. పని చేసి చేసి అలసిపోయి కూడా రాత్రి సమయంలోలో అలా ఒకరికి హెల్ప్ చేయాలని అనుకోవడం అదీ తెలియని వారికి సైతం.
కనిపించకుందా సేవ చేసే ఇలాంటి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు
అవునా? కాదా?

Tuesday, April 8, 2008

హైదరా'బాధ 'లో

బ్లాగు మిత్రులందరకూ వందనాలు. మరి కొందరి బ్లాగు మిత్రులతో నేనుకూడా చేరేందుకు గ్రేటర్ అని గుర్తించిన అత్యంత చెత్త, కాలుష్య నగరమైన భాగ్యనగరమునకు జీవనోపాధికొరకై ఉధ్యోగము వెతుకుతూ వచ్చేసాను.కొంత వరకూ బాగుగనే ఉన్నా- ఎక్కువ కష్టకార్యమనబడినది మటుకు గధి వెతుకులాట అని తెలియబడినది. అందులోనూ పెండ్లి అయిన వారికి కొన్ని మినహాయింపులు కలవులెండి. కేవలం బ్రహ్మచారులమైన మమ్మే నిజముగా చారులలన్నట్లుగా ట్రీట్ చేస్తూ షాదీ అయిందా అని అడిగి లేదనంగానే 'చల్ చల్ రూమ్ గీమ్ నయ్' అని తరిమేస్తున్నారు.కావున బాధలకు పేరు పడిన హైదరా'బాధ 'లో ఎంతో ఓపికతో నివసిస్తూన్న యావన్మంది బ్రహ్మచారి బ్లాగ్మిత్రులకూ మనవి చేయునది ఏమనగా నాకు అత్యవసరముగా కూకట్పల్లి,హౌసింగ్ బోర్డ్, నిజాం పేట్ ఏరియాలలో ఏదో ఒక చోట ఒక గది కావలెను. మీకు లేదా మీ మిత్రులకు తెలిసిన' గది' విశేషాలు ఉంటే నాకు తెలియ చేయగలరని మనవి.

kiran kumar chava గారు చెప్పినందున బడ్జెట్ విషేషాలు కూడా చేర్చుతున్నాను. అద్దె - రెండు నుండి మూడు వేల వరకూ భరించగలను.వంట - వండుకొనుట 'సేప్ఫ్' అని తేలిన మిదట అలా డిసైడ్ అయిపోయాను.

పోస్టు ఇచ్చిన తరువాత
కొందరు ఇచ్చిన జవాబులు బావున్నా అవేవీ నాకు ఉపయోగ పడువిధంగా లేవు. దయచేసి నాకు ఉపయోగంగా జవాబులు ఉంటే మరింత సంతోషపడి ఉండేవాడిని


సదా కృతజ్ఞతలతో మీ.... విశ్వనాధ్

Sunday, March 2, 2008

పట్టి

పట్టి అంటే మళయాళ బాషలో కుక్క. మళయాళీలు పోడా పట్టి అంటూ ఉంటారు. మనది ఆ పట్టి కాదు. కాలవలను, బోదెలను దాటేందుకు ఒక దుంగను అడ్డుగా వేస్తుంటారు. గోదావరి జిల్లాలలో అలా కాలవలపై ఉండే దుంగలను పట్టి అని వ్యవహరిస్తుంటారు. తాటి, కొబ్బరి చెట్లను ఇలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న కాలవలకు చెట్ల కొమ్మలను వాడుతుంటారు. తమ పంట చేలకు నీళ్ళు పెట్టేందుకు ఈ పట్టి అనేదాన్ని ఆధారం చేసుకొని తాటాకులతో, కొబ్బరి ఆకులతో ఒక దడిలా కడతారు. దాంతో నీరు కొంతవరకూ ఆగి వాళ్ళ చేలలోకి వెళుతుంటుంది. పట్టి అనే వీటిపై నడి చేందుకు కొంత ప్రావీణ్యం అవసరం. అదే వర్షాకాలమైతే మరీ అద్భుతమైన ప్రావీణ్య అవసరం. కొత్త వారైతే నేర్వకుండానే డాన్సు చేయచ్చు తడిచిన వీటిపై. అయిటే అలాంటి సంధర్భాలలో కూడా పొలాల్లో పని చేసే కూలీలు పెద్ద మోపులను తలపై పెట్టుకొని సునాయాసంగా చక చకా నడిచి వెళ్ళిపోతుంటారు దీనిపై.
మా ఇంటికి దగ్గరలో చిన్న కాలువలు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుండీ పొలాలలో తిరగటం అలవాటైన నాకు అలాంటి పట్లపై నడవటం అలవాటే. అందుకే ఇలా.


కాకుంటే మా స్నేహితుల పరిస్థితేమిటో మీరూ చూడండి."