Thursday, May 7, 2015

ఆంధ్ర సాహిత్య పరిషత్ - కాకినాడ ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE - KAKINADA)

ఆంధ్ర సాహిత్య పరిషత్ - ఇది కాకినాడలో ఒకప్పుడు అనేకానేక రచయితల, కవులకు ప్రియమైన ప్రదేశం. అలాంటి ఈ సంస్థ వేటలో -

కాకినాడ పట్టణంలో అడుగుపెడుతూ అడిగా రామారావు పేట ఎక్కడ అని. దానిని ఏ రామారావు పేట అనే ప్రశ్న జవాబుగానూ దానిపై ఇక్కడ రెండు రామారావు పేటలున్నాయి, ఏ రామారావు పేట, మామూలు రామారావు పేట. మీకే పేట కావాలి? - పైపుల చెరువుండే రామారవు పేట కావాలి - అయితే తిన్నగా వెళ్ళండి అన్నారు.
పైపుల చెరువు వెదుక్కుంటూ వెళ్ళి దారిలో చాలా మందిని అడిగా అంధ్ర సాహిత్య పరిషత్ అనే గ్రంథాలయం లేదా ప్రచురణాలయం ఎక్కడ అని. ఎవ్వరికీ తెలియదు అన్నారు. వెదుకుతూ వెళ్ళిన నాకు ఆ చెరువు ఒడ్డున చౌదరి గ్రంథాలయం కనిపించింది. దాన్లోకి వెళ్ళి రిషెప్షన్లో కనిపించిన ఆమెను అడిగా ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని. నాకు తెలీదు అని, ఎందుకు అని అడిగింది. ఏం లేదని అక్కడ చదువుకుంటున్న పెద్దలు కొందరిని చూసి వాళ్ళు పెద్దలు కనుక తెలిసి ఉండచ్చు అని వాళ్ళను అడిగా? ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని - వాళ్ళు మొహమొహాలు చూసుకొని ఇక్కడ అటువంటిదేమీ లేదే అని తేల్చారు.


లైబ్రరీలో చదువుకుంటున్న ఆ చుట్టుపక్కల ఉండే పెద్దలకే తెలిసి ఉండకపోతే మరెవరికి తెలుస్తుంది. ఇక తప్పక నాకు దీని గురించి చెప్పిన సన్నిధానం నరసింహశర్మగారికి ఫోన్ చేసా. ఆయన చెప్పారు- మీరు సరిగ్గానే వెళ్ళారు, మీరు నిల్చున్న గర్ంథాలయం ఎదురు సందులో ఫైర్ సర్వీస్ ఉంటుంది, అదగితే ఎవరైనా చెపుతారు, దాని ప్రక్కనే ఉంది ఆంధ్ర సాహిత్య పరిషత్ అని. వాటే ట్రాజడీ అనుకుంటూ ఎదురుగా సందులోకి చూస్తే ఫైర్ సర్వీస్ ఆఫీస్, దానికో చిన్న ఎర్ర బోర్డ్, దాని ప్రక్కనే తాటికాయలంత  పేద్ద అక్షరాలతో రోడ్డు మీదకి బోర్డ్ ఉంది, ఆంధ్ర సాహిత్య పరిషత్ అని, హతవిధీ ఇంత పేద్ద అక్షరాల బోర్డే చూడలేకున్నారే ఇక్కడి వృద్ద మానవులూ అనుకుంటూ  లోనికి ప్రవెశించా....
ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రస్తుతం అది మ్యూజియంగా మార్పు చెందినది.


ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే 1911 మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ది, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు.


సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947 లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల  దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది.


సాహిత్య పరిషత్ కేవలం ప్రచురణే కాక సుమారు 10,000 పుస్తకాలను భద్రపరచింది. తాటిఆకుల తాళపత్ర గ్రంథాలను సుమారుగా 4,776 వరకూ సేకరించి భద్రపరచింది.

1973 నుండి సాహిత్య పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు.  ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది. 1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.

 ఈ భవనంలో వస్తు ప్రదర్శన మరియు గ్రంథ ప్రదర్శనలే కాక వెనుక కల హాలులో కాకినాడ తదితర ప్రాంతాల కవులు, రచయితల కార్యక్రమాలు జరుగుతాయి. నెలలో ప్రతి మూడవ ఆదివారం ఇక్కడ కవి సంగమం జరుగుతుంది. ప్రముఖులు, కవులు, రచయితలు సాహిత్య అభిమానులు పాల్గొంటారు...