Wednesday, December 30, 2015

ఫేస్‌బుక్ - ప్రీ బేసిక్స్

ప్రీ బేసిక్స్ - ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఫేస్‌బుక్ వాడని వారున్నారా అనే విధంగా విస్తృత వ్యాపి పొందిన ఫేస్‌బుక్ నెట్ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటే, ఇక చెప్పనక్కరనేలేదు. వాళ్ళూ వీళ్ళూ అని కాక అందరూ ఎడాపెడా వాడేయగలుగుతారు. ఇలా ఫ్రీగా ఇవ్వడం బాగుందనుకుని పొలోమని ఫ్రీబేసిస్ కొరకు మెసేజ్‌లు పెట్టుకొంటూ పోతే ఆనక మొత్తంగా వట్టిపోతాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు మనం వాడేసుకొంటాం ఇంకేంటి సమస్య అంటే చాలా సమస్యలు ఉన్నాయి.
* ప్రకటనలు ఇప్పుడు వేలలో ఉంతే అవి లక్షల్లో ఉండచ్చు, వాటి వీక్షణ ద్వారా వాళ్ళు ఉచితానికి పెట్టే దానికి డబల్ త్రిబుల్ ఇన్‌కం లాగుతారు.
* పోటీ తత్వం నసించి నీరసించి పోయి ఇతర సైట్‌లు చాలా కనుమరుగైపోతాయి.
* బాగా డబ్బున్న కంపెనీల ఆధిపత్యం ద్వారా అంతర్జాలాన్ని కూడా కార్పోరేట్ సంస్థల మాదిరి తయారుచేస్తారు.
* ఇదో జాడ్యంలా మారి నెటిజన్ల సృజనకు అగాధంలా మారుతుంది.

* పిచ్చి పీక్స్‌కెళ్ళడం అనే మాట, లేదా వదిలించుకోలేని దురలవాట్ల సరసన ఫేస్బుక్ కూడా చేరుతుంది.
* యువతలో పని తత్వం తగ్గి పనికిమాలిన చాటింగ్ ద్వారా విలువైన జీవితకాలాన్ని కోల్పోతారు
ఉచితం ఉచితం అని మన రాజకీయనాయకులు చేతికి ఎముకలేని గొప్పోళ్ళ మాదిరి మన డబ్బుని వెదజల్లి మనలను వెదవలను చేస్తుంటే, వాటిని చూసి మనం పొంగిపోతూ మన వెనుక తాటాకులను మర్చిపోతున్నాం - తెల్ల వాళ్ళు అలాంటి పనులు చేయడంలో మనకన్నా బాగా ముందున్నారు

Wednesday, December 9, 2015

బాణభట్టు

కాదంబరి అనే అద్భుతమైన కావ్య రచన చేసిన కవి బాణభట్టు  ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. సంస్కృ కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి  కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం వలన. పదమూడు శతాబ్ధాలుగా వాజ్మయ రచయితగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.
వత్స గోత్రీకుడైన బాణుడు బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలో సోణా (సౌన్) నదీ తీరంలో ఉన్న పృధుకూట గ్రామంలో జన్మించాడు. ఊ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికూటగా పిలుస్తున్నారు. ఈయన తలిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే నడిచింది. తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణీంచుట వలన దేశ సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారంలో అనేకమంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యాపద్దతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకొన్నాడు.

బాణుడు కామ, అర్ధ, రాజనీతి, అలంకార శాస్త్రాలను అభ్యసించాడు. అతడి ప్రతిభా విశేషాలను విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతడిని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వనించాడు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వారికి వినిపించాడు. దానికి సంతసించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని కానుకలుగా సమర్పించాడని ఒక కథనం.

బాణుణి కాలం హర్షవర్ధనుని కాలంలో కనుక క్రీ.శ. 606 నుండి 648 వరకూ ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా.  బాణుడు హర్షచరిత్రతోపాటు కాదంబరిని కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేసాడు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కదా వస్తువుగా తీసుకోవడమనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమనుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణభట్టు పూర్తిచేసాడు. ఇతడిని ఇంకా పుళింద,పుళింద్ర  పేర్లతో పిలుస్తారు. అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తిచేసి పండితుల ప్రసంసలు పొందాడు.
సంస్కృత మూలంగా కల కాధంబరిని తెనుగులో
పేరాల భరతశర్మ గారు తన సిధ్ధాంత గ్రంధంలో మొత్తం కాదంబరి కధను చక్కని శైలిలో తెనించారు. అని హరిబాబు గారు పేర్కొన్నారు. అది ఎవరికైనా లభ్యత ఉంటె తెలియచేయగలరు.