Tuesday, July 15, 2008

రహదారిమిత్రులు


సాధారణంగా ఎవరి ఊరిని గురించిన సంగతులు వారు గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటే. అలానే గమనిస్తే మన ఊళ్లలో కొన్ని ప్రత్యేక మైన కేరక్టర్స్ కనిపిస్తుంటాయి. వాళ్లు అందరికీ గురుతుంటూ చాలా కాలం తరువాత అయినా మనం అక్కడికి వెళ్ళినపుడల్లా వాళ్లను గురించి ప్రత్యేకంగా అడుగుతుంటాం. అలాంటి ఒకరిద్దరు మా ఊళ్ళో కూడా ఉన్నారు.
మా ఊరు నరసాపురం, నిదదవోలుల మద్య మెయిన్ రోడ్డు నుండి రెండు, రెండున్నర కిలో మీటర్లు లోపలికుంటుంది. అందువలన రాత్రి పది దాటాక "రాత్రి" సినిమా మొదటిపార్టులా ఉంటుంది అక్కడి వాతావరణం. మనిషన్న వాడు కనిపించడు, లోపలికెళ్ళేందుకు ఏ విధమైన వాహనాలు ఉండవు. పదకొండు అయితే ఇక మరీ భయంకరం. దారంతా కొన్ని చోట్ల తప్ప పూర్తిగా కరెంటు దీపాలు కూడా ఉండవు. ఆ సమయంలో ఏ ముఖ్యమైన పని మీద అయినా ఆలస్యం అయిన వాళ్లకు చచ్చే చావే.
అనవసరంగా వచ్చాం రా' బాబూ అనుకొంటూ నడుస్తున్న వాళ్ళకు వెనుకగా దీపాల వెలుగుతోపాటు మోటార్ సైకిల్ సౌండ్ వినిపిస్తుంది. వెనుక సీటుపై పెద్ద అల్యూమినియం పాలకేను, దానికి రెండుప్రక్కలా మరో రెండు పాలకేనులు, ముందువైపు రెండు ఇత్తడి బిందెలు, ఇంకా డ్రైవింగ్ సీటుపై ఒక భారీ ఆకారం కనిపిస్తుంది. అది పాల వ్యాపారం చేసే గుబ్బల శ్రీనివాస్ అనే శాల్తీది. దారిలో నడిచెళ్లేది ఒకరే అయితే సీటులోనే ఏదో విదంగా ఇరికించి వాళ్ళనువాళ్ళకు కావలసిన ఇంటి దగ్గర్లోని దారిలో దించేస్తాడు. ఇద్దరుంటే వెనక సీటుపై కల పాలకేనుపై కూర్చోబెట్టి పడిపోకుండా ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చి భయ్యమని పోనిస్తాడు. ఆ సమయంలో ఎవరున్నా అక్కడ జరిగేదదే. మీ కేం భయ్యం లేదు నేను తీస్కేల్తా కదా జాగర్తగా అని భరోసాతో సైతం తీసుకెళ్లడం రోజూ పాల వ్యాపారం చేసి పొద్దుపోయిన తరువాత వచ్చే అతని అలవాటు. అసలే పాలకేను దానిపై మరో మనిషి కూర్చుంటే ఎలా ఉంటుంది. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టుగా అనిపిస్తుటుంది అలా ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొస్తున్నపుడు చూస్తే
ఇక రెండవ వ్యక్తి - పేపరు విలేకరిగా పనిచేస్తూ పదకొండు గంటలకు వచ్చే మారుతి. అతని సైకిల్ ప్రయాణంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఊరి వరకూ రావడం కూడా మామూలుగా కనిపించే దృశ్యమే. కొత్తవాళ్ళు మొహమాట పడుతారేమోనని అడిగి మరీ తీసుకెళ్ళడం ఇతడి ప్రత్యేకత.
అలసట పని ఒత్తిడి లాంటివి వారికి ఉండవా అనుకొంటాం మేము. పని చేసి చేసి అలసిపోయి కూడా రాత్రి సమయంలోలో అలా ఒకరికి హెల్ప్ చేయాలని అనుకోవడం అదీ తెలియని వారికి సైతం.
కనిపించకుందా సేవ చేసే ఇలాంటి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు
అవునా? కాదా?