Sunday, March 21, 2010

పీచు మిఠాయి

పీచు మిఠాయి అనేది మా చిన్నప్పుడు భలే ఇష్టంగా తినే వాళ్లం. ఎర్రగా పీచుపీచుగా ఉండే అదంటే ఇష్టం ఉండని వాళ్ళు అరుదు.
ప్రస్తుతం
బయట చాలా తక్కువగా కనిపిస్తున్నా ప్యాకెట్లలో షాపింగ్ మాల్స్, సినిమా దియేటర్స్ వంటి వాటిలో కొద్ది ఎక్కువ ఖరీదులో అయినా బాగానే దొరుకుతున్నాయి.



అప్పట్లో సైకిల్ పై వీధులలో తిరుగుతూ పాత ఇనప సామాన్లు గాని, ప్లాస్టిక్ గాజు సీసాలు లాటివి ఇచ్చినా
అక్కడికక్కడే త్రిప్పుతూ తయారు చేసి
ఇచ్చేసేవాళ్ళు.

చిన్నప్పుడు అయితే రోజూ డబ్బులు దొరికేవి కావు. డొంకలు బొంకలు ఏదో ఒక మూల పాత ఇనప సామానో మరోటో వెతికి పట్టేసే వాళ్లం. అలా కొన్నామంటే ఇక ఆరోజుకు పండగే

దానిని తయారు చేసే పద్దతి ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. పంచాదారతోనే చేస్తారంటే నమ్మేవాళ్ళం కాదు. ఎర్రగా ఉన్న దానిని పంచదార కాదు మరేదో అనుకొనేవాళ్ళం.

వారానికి జరిగే మా ఊరి సంతలో ఇప్పటికీ ఒకతను పెడుతుంటాడు. వెళ్ళిన ప్రతీసారీ తప్పకుండా కొంటూఉంటాను. నిజానికి అది తిప్పుతుంటే చూడ్డానికి వెళతాను కొనడానికి కాదు. డ్రమ్మును అలా తిప్పుతూ ఉంటే తీగలుగా సాలీడు దారాల్లా వచ్చే వాటిని చూడటం భలే సరదాగా ఉంటుంది. తరువాత పుల్లతో దానిని త్రిప్పుతూ గుండ్రంగా తయారుచేసి మనకివ్వడమ్ ఇంకా భలేగుంటుంది.
కాని వెళ్లి అక్కడ నిల్చుంటే బావోదని కొని అక్కడ తెలిసున్న పిల్లలెవరైనా ఉంటే ఇచ్చేస్తూఉంటాను.


నా కూడా ప్రెండ్స్ ఎవరైనా వచ్చినా 'ఎహే ఇదెందుకురా' చిన్న పిల్లోడిలా' అంటూ ఉంటారు. నే చేసేది చూసి ఎవడి దూల వాడికానందం అనుకుంటారు :)

ఇలాటి చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించడం తెలియకపోవడంమీ ఖర్మ అంటాను (అనను, అనుకుంటాను అంతే :).

Monday, October 5, 2009

వాసవీధామ్

పెనుగొండ అంటే చాలా మంది ఎరిగి ఉండచ్చు. అది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయము ద్వారా ప్రసిద్ది చెందింది. ఇటీవల వరకూ ఎక్కువగా తెలియక పోయినా ఇక ఇటుపై తప్పక గొప్పగా ప్రసిద్ది చెందవచ్చు.
ఇది చదవండి మీకూ తెలుస్తూంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.



నేను పెనుగొండ వెళ్ళి చాలా కాలం అయింది. మద్య జరిగిన మార్పులు చూస్తే చాలా బాగా అనిపించాయి. వాసవీ ధామ్ అని పేరుతో పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. అసలు వాసవి ఆలయమే ఊరికి ఒక వైపు చక్కని పచ్చపొలాల ప్రక్కగా ఉంటుంది. దీనికి తోడు ఎదురుగా పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. అలాంటి వాతావరణానికి గుడికి కొద్ది దూరంగా అనేక ఎకరాల పంట చేలను పూడ్చి నిర్మణాలు చేపట్టారు. ఇక్కడ యాత్రికులకు అనేక కాటేజీలు, వాసవి గురించిన సమస్త వివరాలూ ప్రదర్శించే పెద్ద ప్రదర్శన శాల, ద్యాన మందిరాలు , స్టార్ హొటలూ, అనేక చిన్న దేవాలయాలు ఇలా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. లోనివైపుగా వాసవీమాత అగ్నిలో దహనమౌతున్న ప్రతిమను సహజంగా ఉండేలా రూపొందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు తొంభై అడుగుల పైబడిన వాసవీ మాత విగ్రహం. ఇది ప్రస్తుతం సిమెంటుతో నిర్మించారు, తరువాత ఇలానే దీనిపై కాంస్యపు పలకలను తయారు చేస్తారట. దానిని రోడ్డువైపుగా వాసవీ ధామ్ ప్రధాన ద్వారం వైపు నిర్మించారు. చూడండి అద్భుతంగా ఉన్నది.

Thursday, May 14, 2009

మా ఊరి గ్రంధఆలయము

శ్రీ రామచంద్ర గ్రంథాలయము.
మాఊరి గ్రంధాలయము గూర్చి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది మాకొక బడి, ఒడి స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు ఊహ తెలియకముందే మానాన్నగారితో కలసి ఆ గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు. చందమామ చేతికిచ్చి ఆయన పేపరు చదువుతుంటే చందమామ,బొమ్మరిల్లు లో బొమ్మలు చూడటం అటు తరువాత ఊసుబోక చదివేవాళ్ళను చూడటం, పుస్తకాలు పేపర్లు ఎగరకుండా పెట్టే చిన్న చెక్కముక్కలతో బల్లలమీద మోదటం, అందరూ హటాత్తుగా నన్నే చూస్తుంటె ఏమీ తెలియని వాడిలా చటుక్కున మానాన్న ప్రక్కకెళ్ళి దాక్కోడం జ్ఞాపకమున్నది.
తరువాత
వచ్చీరాని చదువుతో కధలు చదవటానికి పడిన అవస్థ జ్ఞాపకమున్నది. ఆపై ట్వింకిల్ పుస్తకాల సీరియల్స్, పంచతంత్రం, గలివర్ యాత్రలు, సింధుబాద్ సాహసాలు, పరమానందయ్య శిష్యుల కధలు, రామకృష్ణమఠం వారి అందమైన రంగుల పుస్తకాలైన బొమ్మలకధలు, పిల్ల రామాయణం, బొమ్మల భారతం, లాంటి వాటి నుండి ఎగురుకుంటూ వారపత్రికలు, మాసపత్రికలు లాంటి పుస్తకాలకు అలవటుపడటం ఠంచనుగా వారం వారం చదవటం తెలుసు. వాటి తరువాత తరమైన మదుబాబు,పానుగంటి లాంటి డిటెక్టివు పుస్తకాలు శెలవు,శెలవుల్లోనూ రోజుల తరబడి కూర్చొని చదవటమ్. మా వాళ్ళు చదువు చదవక పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నానని కోప్పడటం తెలుసు. అటునుండి వేసవి శెలవుల్లో రుచిమరిగి ఇప్పటి వరకూ విడవలేకున్న నవల్ల గురించి చెప్పేదేముంది మీకే తెలుసు. ఇదంతా ఎందుకంటే నాకా అదృష్టం మా గ్రంధాలయం వలనన్నమాట.





అటువంటి గ్రంధాలయం గురించి కుతంత చిన్నగా చెప్పేసి మిగించేత్తాను. 1870 లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంధాలయములలో ఒకటి.. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంధాలయము 1914 లో పండిత రుద్రరాజు నరసింహరాజుగారి ప్రోత్సాహముతో భవనముగా రూపుదిద్దుకొని 1962 కు రెండు అంతస్తులుగా ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన అతి పెద్ద గ్రంధాలయముగా మార్పు చెందినది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు బాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ద గ్రంధాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఉన్న కొన్ని పుస్తకాల లిష్ట్ రాద్దామనుకొన్నాను కాని మొదలెట్టి వరకూ వచ్చేసరికి నాకు నీరసమొచ్చేసింది. ఇక మిగతావేం రాస్తాం. వదిలేసాం ఓపికున్నపుడు రాద్దాం లే అని. ఎలాగూ వీటిని వికీలో ఎక్కించాలి కనుక లిష్ట్ పూర్తి చేసి తీరతామన్న మాట.


* అద్భుత రామాయణము - అనగారి వెంకతకృష్ణరాయడు.
* అద్భుతోత్తరరామాయనము - నాదెళ్ళపురుషోత్తముడు.
* ఆధ్యాత్మరామాయణము - కోటమరాజు నాగయామాత్యుడు.వావిళ్ళవారు
* అనిరుద్ద చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు. సాహిత్యాకాడమీ
* అభినవాంధ్ర విష్ణుపురానము - అఛ్యుతరామామాత్యుతకవి.
* అమరజీవి అల్లూరి - దండు వెంకటరామరాజు.
* అభినవ భారతము - మతకపల్లి మాధవకవిమంజువాణి ఏలూరు
* అరుణాచల ఖండము - జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రశ్రీమద్రమాయనము 7 సంపుటములు- జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రవాల్మీకి రామాయణము 7అ సంపు - వావికొలను సుబ్బారావు.
* ఆంద్రమహాబారతము - నన్నయ,త్క్కన,ఎర్రాప్రగడ.వావిళ్ళ్ళవారు
* ఆంధ్రపురానము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
* ఆంధ్ర బ్రహ్మాండపురాణము - జనమంచి శేషద్రిశర్మ తణుకు
* ఆంధ్ర భవిష్యపురానము - మల్లాది సూర్యనారాయణశఅస్త్రి. తణుకు
* ఆంధ్రలింగపురాణము - ములుగు చంద్రమౌళీశ్వరశాస్త్రి. రజతముధ్రాక్షరశాల.
* ఆంధ్రస్కాందపురాణము - జనమంచి శేషద్రిశర్మ
* ఉత్తరరామాయనము- కంకటి పాపరాజు.వావిళ్ళ
* ఉత్తర హరి వంశము - నచనసోముడు వావిళ్ళ
* కపిలదేవహూతి సంవాదము - పోతన. బాలభక్త సమాజము పోడూరు.
* కవి కర్ణరపాయనము - సంకుసాల నృసింహకవి.
* కంద రామాయణముం గంధపెద వీరభద్రరఅవు. రామానంధగౌడీయ మఠము.కొవ్వూరు.

Wednesday, April 29, 2009

ఉపచార విధానం

పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.


ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం

ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం

పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం

అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం

ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము

స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం

వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం

యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం

ఏడు వారాల నగలు.


ఏడు వారాల నగల గురించి వినే ఉంటారు. రోజుకు కొన్ని నగల చొప్పున
ఏడు రోజులకూ కేటాయించబడిన నగలను ధరించేవారు అప్పటి రోజులలో.
తిదులను, నక్షత్రాలను, రాశులను అనుసరించి ఒక్కోరోజు ఒక్కో సెట్ నగలన్నమాట.

అవేమిటో చూద్దామా (కాదు చదువుదాం)


ఆదివారం - సూర్యుని కోసం కెంపుల కమ్ములు, హారాలు మొదలగునవి.
సోమవారం - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి
మంగళ వారం - కుజునికోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధ వారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారం - బౄహస్పతి కోసం పుష్యరాగపు కమ్ములు, వడ్డాణము, ఉంగరాలు.
శుక్రవారం - శుక్రుని కోసం వజ్రాల హరాలు, ముక్కు పుడక మొదలగునవి.
శనివారం - శనికోసం నీల మణి హారలు, ఉంగరాలు మొదలగునవి.

ఇది నిజానికి నా మూసేయాలనుకొనే http://viswanath123.blogspot.com/ బ్లాగులోనిది. ఇది ౨౦౦౭లో రాసాను.

Friday, January 23, 2009

మావుళ్ళమ్మ



భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత.
పోయిన సారి పండుగకు ఇంటికి వెల్లినపుడూ భీమవరం వెళ్ళా ఆ విశేషాలు వికీలో రాస్తూ బ్లాగులో కూడా ఇస్తే భావుంటుందని రాస్తున్నా....
దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి
స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.



చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్దుడు " విగ్రహాలను చెక్కారు.

మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నది. సారి ఉత్సవాలకు వేసిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక ఒక్కొక్కరోజు నాలుగు ప్రసిద్ద కళాకారుల ప్రోగ్రాములు ఇక్కడ మామూలు. వాటిలో సురభి నాటకాలు కనీసం పది ఉంటాయిట( రోజూ ప్రోగ్రాముల లిస్టు పేపరుకు అదేలెండి జిల్లా ఎడిసిం లో వస్తుందట)

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేధికగా వెలుగొందుతున్నది. ఇక్కడ సనామనం పొందిన కొందరు కళాకారులు.

Friday, December 26, 2008

పెస్టివల్ పుస్తకాలు




అదేంటో గాని హైదరాబాదు ఏరకంగా సూసినా నాకు చెత్త సిటీలాగే కనిపిత్తాది. ఏదో కొన్ని ఇసయాల్లో తప్ప అలాంటిదే ఒకిసియం 'పుస్తకాల దుకాణాలు' మంచియ్యన్నీ ఇక్కడుంటం. మద్య అబిట్స్ విశాలాంద్ర సూత్తే భలే ముచ్చటేసింది. సూపరు సూపరు బుక్సు అన్నీ ఉన్నాయి. ఆత్రం కొద్దీ చేలా కొనేసాను. అంతే కాక సంవత్సరానికి సభ్యత్వం కూడా తీసుకొన్నా అప్పటికంటే కూడా మొన్నామధ్య జరిగిన బుక్కు పెస్టివల్కెళ్ళినపుడు ఇంకా చాలా మంచి పుస్తకాలు కొనేసే చాన్సు వచ్చింది. ఎలాగా మందగ్గర కార్డుందికద అందరికీ 10 పెర్సెంట్ అయితే మనకి 20 పెర్సెంట్ వచ్చుద్ది.
అయితే మేము అలాగెల్లినందుకు చాలామందికి మంచి జరిగిందండోయ్ అదేంటంటారా.
పెద్దపెద్ద పుస్తకాలు, ఎక్కువ రేట్లున్న పుస్తకాలు కొనాలనుకుని ఎనకాడేవోళ్లకు నా కార్డు బాగా ఉపయోగపడింది. నేను పెస్టివల్కి రెండుసార్లెల్లేను. మొదటి సారెల్లినపుడు మన గుంపోళ్ళ మీటింగ్ జరిగింది. అప్పుడన్నమాట. ఆ రోజున నింపాదిగా చూడాలనుకొనే పెద్దయ్యలు కొంతమంది తగిలి పెద్దపుస్తకాల కోసం మోజుపడితే కొనిపించీసేం. మల్రోజు క్రిస్మస్ కెళ్ళాం అప్పుడూ బాగా జనాలున్నారు. మొదట్రోజు తెలీటం చేత ఈ సారి చాలా మంది పుస్తక ప్రియులికి 20 పర్సెంట్ తగ్గీపిత్తాం కొనుక్కుంటారా అనడిగితే ఓయస్ అనీసేరు. దాంతో ఆళ్ళకి ఆళ్ళ ప్రెండ్స్ ఆళ్ళకి ప్రెండ్స్ అలా చాలామందిచేత పెద్దపెద్ద పుస్తకాలు,రేటెక్కువ పుస్తకాలు కొనిపించీసేం. ఆళ్ళూ ఆళ్ళ స్నేహితులూ, ఆళ్ళతో పాటు మేమూ చేలా ఆనందపడిపోయేం. ఇయ్యన్నె కాక మేంగూడా చాలా పుస్తకాలు కొనీసేం. మొదట్రోజు విజేత పబ్లికేషన్స్ వాళ్ళ సాపుకెళ్ళినపుడు పెద్దబాలశిక్ష ఎంతాని అడిగేం ' నూటతొంభై అసల్రేటు నూటిరవైకిచ్చేత్తాం తీసుకొండన్నారు. సరే మొత్తమంతా చూసేసాక మల్లొచ్చి తీసుకుందాం అనుకుని అన్నీ అయ్యేకా వచ్చి అడిగితే నూటిరవైయ్యన్నారు.అదేంటండే ఇందాకొచ్చి అడిగితే నూటిరవయ్యేనన్నారు ఇప్పుడు ఇరవై పెంచేసేరు అనగానే కొద్దిగా ఆగండి అని మా ముందున్న బేరం అదే పెద్దబాలశిక్షకు నూటయాబై ఇచ్చి వెళ్ళిపోగానే మాకు మరోటి నూట ఇరవై ఇమ్మని ఇచ్చేసేరు. ఇచ్చేత్తా అన్నారు మీరు ముందు అడిగారు కనుక ఆరేటు ఇప్పుడు కాదండి అని,
పోన్లే మనకైతే తక్కువకే వచ్చిందికద అనుకుని బయల్దేరేసాం.




ఆ మద్య విజయవాడ ఎళ్ళినపుడు ఎమొస్కో వాళ్ళను శ్రీపాద గారివి వడ్లగింజలు,క్షీరసాగరమధనం లాంటి నవల్లేమమయినా ఉన్నాయా ఆని అడిగితే ఈ మద్య అటువంటి నవల్లు ప్రింటింగ్ జరగటం లేదు, మాదగ్గరకూడా లేవు అన్నారు. అయ్యో అనుకొన్నా. బుక్ పెస్టివల్లో నాకా పుస్తకాలు దొరికేసినయ్యి. శ్రీపాదకధలు అనీ ఒకటి, పుల్లంపేట జరీచీర అనీ ఒకటి. ముందు చూళ్ళేదుకాని పుల్లపేట జరీచీర బుక్కులోనే ఇయ్యన్నీ ఉన్నాయ్. కాపోతే కధలు తగ్గించేసి చిన్నగా మార్చేసేరు. సరే ఏదైనా నాక్కావలసిన పుస్తకాలు దొరికినియ్యి అదే ఆనందం.

నేను తీసుకున్న పుస్తకాలు ఇయ్యి
1. ఒకయోగి ఆత్మకధ
2. అత్తగారి కధలు (భానుమతి)
3. అంపశయ్య (నవీన్)
4. రంగులరాట్నం (ముళ్ళపూడీ వెంకట రమణ)
5. బుడుబు ( శీ రమణ )
6. శ్రీపాద కధలు (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి)
7. పుల్లపేట జరీచీర (శ్రీపాద)
8. పెద్దబాలశిక్ష
9. ఆనాటి వాన చినుకులు (వంశీ)
10. మా పసలపూడి కధలు (వంశీ)
11. బాపు బొమ్మల రామాయణం (రమణ)
12. స్తోత్ర రత్నాలు (శ్రీనివాస్)

ఇంకా కూని మల్లది నవల్లూ, యందమూరి నవల్లూ కూడా

Thursday, August 28, 2008

మా ఊరి కృష్ణ మందిరం



మా ఊళ్ళో ఇంత వరకూ క్రిష్నాష్టమికి ఉట్టి కొట్టాలంటే వీదిలో టెంపరరీగా ఆరోజు మందం ఏదో వీలయినట్టు చిన్న పందిరి వేసి అక్కడొక క్రిష్నుడి పటం పెట్టి పండగ అయిందనిపించేవారు.
కొద్దిగా గట్టిగా అయిఒతే మాత్రం బాల సంఘం గాంధీ బొమ్మల దగ్గర మెయిను గుమ్మంపైన ఎప్పుడో రాజుల కుర్రోళ్ళు కట్టించిన మాదిరి బొమ్మ దగ్గర మాత్రం ఇప్పటి కుర్రోళ్ళకు ఉత్సాహం పోయినా అప్పటి కుర్రోళ్ళు ముసలోళ్ళయిపోయినా వాల్లే చిన్న బుడ్డోళ్ళను కూడా వేసుకొని తిరిగుతూ బాల సంఘపు పెద్ద గుమ్మం పైన కట్టిన మండపంలో ఉన్న చిన్న క్రిష్ణుడి బొమ్మ దగ్గరా, ఆచుట్టు పక్కలా చేతనైన అలంకారం చేసి క్రిష్ణాష్టమి కొద్దిగా ఘనంగానే చేసాం అనిపిస్తారు.

దాంతరువాత దానికంతే కొద్దిగా తక్కువగానే అయినా మేమూ బానే చేత్తాం అనిపించుకొనే మరో కుర్రోళ్ళ టీం బస్టాండ్ సెంటర్లో ఉంది. బస్టాండును ఆనుకొని కూలిపోడానికి సిద్దంగా ఉన్న సాయిబుల సీను సైకిలు షాపు పక్కన మొన్నామద్య కుర్రోళ్ళు చందాలేసుకొనీ, సెంటర్లోని కొట్లలో వసూలు చేసిన మొత్తం కలిపి అక్కడొక దిమ్మ కట్టి దానిపై చిన్న విగ్రహం పెట్టారు. అలా నిలబెట్టిన చిన్ని క్రిష్ణుడి విగ్రహం దగ్గర మాత్రం మొదటి దానికి విరుద్దంగా పిల్లగాళ్ళు దార్లో దొరికిన వాడ్ని దొరికినట్టుగా అడ్డంపడి అటకాయించి కొందరితో తిట్లు తిని మరీ వసూలు చేసిన కొద్దిపాటి పైకంతో బానే చేసేం అనిపించేవారు.



మొన్నా మద్య వరకూ సాయిబాబా గుడి లేకపోవడంతో అంతా పక్క టౌనుకు వెళుతుండేవారు. ఇప్పుడు అదీ కట్టేసారు. ఇది లేదూ అనుకోడానికి వీల్లేకుందా అన్ని దేవాలయాలూ విశాలంగా కట్టేసారు ఊళ్ళో. ఇక లేనిదల్లా ఒక్క క్రిష్ణుడి గుడి మత్రమే అనుకుంటూ ఉండే వాళ్ళం.

అయితే కోరికా తీరిపోయింది. నాకు మొన్న ఊరెళితే అది కూడా కనిపించి భలే హాచ్చర్యమేసింది. గుడి కట్టిన తీరు మరీ భలేగనిపించింది. చుట్టూ కాళీగా, ముందు రెండు వాటర్ పౌంటెన్లు, మద్యగా పాలరాతి క్రిష్నుడు. అబ్బా భలే అందంగా ఉంది. అరె చాలా ఎక్కువ చెపుతున్నాడు పిల్లోడు అనుకోవద్దు. పల్లెటూళ్ళో మాత్రం ఉంటే గొప్పగానే ఉంటదని మీకూ తెలుసు. (సాక్షానికి బొమ్మలు కూడా ఇచ్చానండోయ్)



ఇక మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటయా అంటే ఇక నుండి అక్కడ కూడా ఉట్టి కొట్టే ఉత్సవం భలే చేస్తారని....

Tuesday, July 15, 2008

రహదారిమిత్రులు


సాధారణంగా ఎవరి ఊరిని గురించిన సంగతులు వారు గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటే. అలానే గమనిస్తే మన ఊళ్లలో కొన్ని ప్రత్యేక మైన కేరక్టర్స్ కనిపిస్తుంటాయి. వాళ్లు అందరికీ గురుతుంటూ చాలా కాలం తరువాత అయినా మనం అక్కడికి వెళ్ళినపుడల్లా వాళ్లను గురించి ప్రత్యేకంగా అడుగుతుంటాం. అలాంటి ఒకరిద్దరు మా ఊళ్ళో కూడా ఉన్నారు.
మా ఊరు నరసాపురం, నిదదవోలుల మద్య మెయిన్ రోడ్డు నుండి రెండు, రెండున్నర కిలో మీటర్లు లోపలికుంటుంది. అందువలన రాత్రి పది దాటాక "రాత్రి" సినిమా మొదటిపార్టులా ఉంటుంది అక్కడి వాతావరణం. మనిషన్న వాడు కనిపించడు, లోపలికెళ్ళేందుకు ఏ విధమైన వాహనాలు ఉండవు. పదకొండు అయితే ఇక మరీ భయంకరం. దారంతా కొన్ని చోట్ల తప్ప పూర్తిగా కరెంటు దీపాలు కూడా ఉండవు. ఆ సమయంలో ఏ ముఖ్యమైన పని మీద అయినా ఆలస్యం అయిన వాళ్లకు చచ్చే చావే.
అనవసరంగా వచ్చాం రా' బాబూ అనుకొంటూ నడుస్తున్న వాళ్ళకు వెనుకగా దీపాల వెలుగుతోపాటు మోటార్ సైకిల్ సౌండ్ వినిపిస్తుంది. వెనుక సీటుపై పెద్ద అల్యూమినియం పాలకేను, దానికి రెండుప్రక్కలా మరో రెండు పాలకేనులు, ముందువైపు రెండు ఇత్తడి బిందెలు, ఇంకా డ్రైవింగ్ సీటుపై ఒక భారీ ఆకారం కనిపిస్తుంది. అది పాల వ్యాపారం చేసే గుబ్బల శ్రీనివాస్ అనే శాల్తీది. దారిలో నడిచెళ్లేది ఒకరే అయితే సీటులోనే ఏదో విదంగా ఇరికించి వాళ్ళనువాళ్ళకు కావలసిన ఇంటి దగ్గర్లోని దారిలో దించేస్తాడు. ఇద్దరుంటే వెనక సీటుపై కల పాలకేనుపై కూర్చోబెట్టి పడిపోకుండా ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చి భయ్యమని పోనిస్తాడు. ఆ సమయంలో ఎవరున్నా అక్కడ జరిగేదదే. మీ కేం భయ్యం లేదు నేను తీస్కేల్తా కదా జాగర్తగా అని భరోసాతో సైతం తీసుకెళ్లడం రోజూ పాల వ్యాపారం చేసి పొద్దుపోయిన తరువాత వచ్చే అతని అలవాటు. అసలే పాలకేను దానిపై మరో మనిషి కూర్చుంటే ఎలా ఉంటుంది. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టుగా అనిపిస్తుటుంది అలా ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొస్తున్నపుడు చూస్తే
ఇక రెండవ వ్యక్తి - పేపరు విలేకరిగా పనిచేస్తూ పదకొండు గంటలకు వచ్చే మారుతి. అతని సైకిల్ ప్రయాణంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఊరి వరకూ రావడం కూడా మామూలుగా కనిపించే దృశ్యమే. కొత్తవాళ్ళు మొహమాట పడుతారేమోనని అడిగి మరీ తీసుకెళ్ళడం ఇతడి ప్రత్యేకత.
అలసట పని ఒత్తిడి లాంటివి వారికి ఉండవా అనుకొంటాం మేము. పని చేసి చేసి అలసిపోయి కూడా రాత్రి సమయంలోలో అలా ఒకరికి హెల్ప్ చేయాలని అనుకోవడం అదీ తెలియని వారికి సైతం.
కనిపించకుందా సేవ చేసే ఇలాంటి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు
అవునా? కాదా?

Tuesday, April 8, 2008

హైదరా'బాధ 'లో

బ్లాగు మిత్రులందరకూ వందనాలు. మరి కొందరి బ్లాగు మిత్రులతో నేనుకూడా చేరేందుకు గ్రేటర్ అని గుర్తించిన అత్యంత చెత్త, కాలుష్య నగరమైన భాగ్యనగరమునకు జీవనోపాధికొరకై ఉధ్యోగము వెతుకుతూ వచ్చేసాను.కొంత వరకూ బాగుగనే ఉన్నా- ఎక్కువ కష్టకార్యమనబడినది మటుకు గధి వెతుకులాట అని తెలియబడినది. అందులోనూ పెండ్లి అయిన వారికి కొన్ని మినహాయింపులు కలవులెండి. కేవలం బ్రహ్మచారులమైన మమ్మే నిజముగా చారులలన్నట్లుగా ట్రీట్ చేస్తూ షాదీ అయిందా అని అడిగి లేదనంగానే 'చల్ చల్ రూమ్ గీమ్ నయ్' అని తరిమేస్తున్నారు.కావున బాధలకు పేరు పడిన హైదరా'బాధ 'లో ఎంతో ఓపికతో నివసిస్తూన్న యావన్మంది బ్రహ్మచారి బ్లాగ్మిత్రులకూ మనవి చేయునది ఏమనగా నాకు అత్యవసరముగా కూకట్పల్లి,హౌసింగ్ బోర్డ్, నిజాం పేట్ ఏరియాలలో ఏదో ఒక చోట ఒక గది కావలెను. మీకు లేదా మీ మిత్రులకు తెలిసిన' గది' విశేషాలు ఉంటే నాకు తెలియ చేయగలరని మనవి.

kiran kumar chava గారు చెప్పినందున బడ్జెట్ విషేషాలు కూడా చేర్చుతున్నాను. అద్దె - రెండు నుండి మూడు వేల వరకూ భరించగలను.వంట - వండుకొనుట 'సేప్ఫ్' అని తేలిన మిదట అలా డిసైడ్ అయిపోయాను.

పోస్టు ఇచ్చిన తరువాత
కొందరు ఇచ్చిన జవాబులు బావున్నా అవేవీ నాకు ఉపయోగ పడువిధంగా లేవు. దయచేసి నాకు ఉపయోగంగా జవాబులు ఉంటే మరింత సంతోషపడి ఉండేవాడిని


సదా కృతజ్ఞతలతో మీ.... విశ్వనాధ్