Tuesday, April 28, 2015

గ్రంథాలయ స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం

               నా ఎరుకలో ఒక లైబ్రరీ ద్వారా చదవేందుకు అవకాశం కల్పించడం కాక మహా అయితే ఒకటో రెండో కార్యక్రమాలు జరుగుతాయి... కాని నేను ఈ మద్య చూసిన ఒక గ్రంథాలయం స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం మాదిరిగా అనేక రూపాలలో సేవలను అందించడం చూసా.....అదే వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం
                 భీమవరం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముదవల్లి గ్రామం పూర్వం నుండీ చాలా ముందు చూపు కలిగిన యువకులను కలిగి ఉండేదేమో అందుకే 1800 నుండి 1900 వరకూ బహుముఖాలుగా అక్కడి ప్రజలు అభివృద్దివైపు అడుగులు వేసారు.  మిగిలిన వారితో వేయించారు. అలాంటి వారిలో కొందరు- రాసి సిమెంట్ - బి.వి.రాజు, లార్స్‌విన్ గ్రూప్ -ఎస్.కృష్ణంరాజు, డెల్టా పేపర్మిల్స్ - భూపతిరాజు సూర్యనారాయణరాజు, డా.బి.హెచ్.సుబ్బరాజు వంటి వారు. ఇదంతా జరగటానికి కారణం వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం. దీని ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది - అభివృద్ది చిత్రం

అక్షరాశ్యతా వ్యాప్తి - ఈ గ్రంథాలయం ద్వారా రాత్రి పాఠశాలల నిర్వహణ జరిగేది. ఎందరో ఈఊరి పెద్దలు ఈ పాఠశాల ద్వారా విద్యావంతులు అవడం జరిగింది.
స్త్రీ విద్య - ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్దతి ఉందేది. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంభందించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
హిందీ ప్రచారం - 1920 నుండి ఈ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు.
అసృశ్యతా నివారణ - సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి బృందం అంతరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
వైద్య సహాయం - ఊరిలో పేదవారికి వైద్య సహాయం అందాలనృ ఉద్దేశ్యంతో - 1911 నుండి ఊరిలో వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయవేదికగా వైద్య శిబిరాలు కొనసాగేవి, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. (గ్రంథపాలకులుగా ప్రస్తుతం ఆర్.ఎం.పి పనిచేస్తున్నారు)
సహాకార పరపతి సంఘం - పల్లెలకు రైతులు వెన్నెముఖ అని నిరూపించదానికన్నట్టుగా గ్రంథాలయానికి అనుభందంగా సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం చేసారు.
జాతీయోజ్యమానికి సహాకారం - జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రంథాలాయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు. వీటిలో గ్రామ యువకులు పాల్గొనేవారు.
రాజపుత్ర సమాజ సేవా సమితి - క్షత్రియ కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్ధులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
స్త్రీ పునర్వివాహాలు - క్షత్రియ కుటుంభాలలో చాలా కాలం పునర్వివాహాలు ఉండేవి కవు, తిరుపతిరాజుగారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాదాన్ని బలపర్చై 1934లో స్త్రీ పునర్వివాహ సమాజం ఏర్పరిచారు
పోస్టల్ సేవలు - చాలా కాలం కుముదవల్లిలో పోస్టాఫీసు లేదు. తిరుపతిరాజుగారి బృందం గ్రంథాలయంలోనే అసలు ధరకే పోస్తేజీని అందించేవారు.
ఇలా అనేకరకాలుగా ఈ గ్రంథాలయం ఊరికి విజ్ఞానాన్ని పంచడం అనేది ఒక విధంగా ఆ ఊరి ప్రజల అదృష్టమే...



Sunday, April 26, 2015

శ్రీ వీరేశలింగ సమాజ గ్రంథాలయం కుముదవల్లి (కోడవల్లి)

అది ఒక అందమైన గ్రామం, అందమైన గ్రామస్తులు (గ్రామస్తుల అందం వాళ్ళు చేసిన చేస్తున్న పనులబట్టి నిర్నయిచబడాలి అని నా గట్టి నమ్మకం)  అలాంటి ఊళ్ళో ఒక గ్రంథాలయం - ఒక గ్రంథాలయం తన పూర్తీ ప్రయోజనాన్ని ప్రజలకు అందివ్వడం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. కాని ప్రయోజనానికి ఆవల కూడా సేవలను అందించడం ఒక్క భీమవరం దగ్గరలో కోడవల్లి అనికూడా పిలిచే కుముదవల్లిలోని వీరేశలింగ సమాజ గ్రంథాలయానికి మాత్రమే చెందుతుంది -  అలాంటి గొప్ప గ్రంథాలయ పూర్వాపరాల్లోకెళితే

గ్రంథాలయం ఉద్యమం, జాతీయ కాంగ్రెస్ స్థాపన
ప్రజల సామూహిక శక్తిని సమీకరించి, ఒక వ్యవస్థాపరమైన మార్పుకోసం జరిగే ధీర్ఘ కాల పోరాటాన్ని సాంఘిక ఉద్యమం అంటారు. పరాయి పాలన విముక్తి కోసం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించాలనే భావన దివ్య జ్ఞాన సమాజ సభ్యుడైన ఏ.ఓ.హ్యూమ్‌కు కలిగింది. హ్యూం మిత్రులతో  కూడిన సమావేశం ఈ ఆలోచనను దృవపరచింది. ఈ అలోచనను ఉద్యమ రూపంలోకి తెచ్చేందుకు 1885లో  బొంబాయిలో ప్రధమ కాంగ్రెస్ మహాసభ జరిగింది. తదుపరి జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.

అప్పటి రోజులలో దాదాబాయి నౌరోజీ రాసిన పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన బ్రిటిష్ పాలన వలన భారత దేశ ఏ విధంగా నష్టపోతున్నదీ వివరించింది. ఇలాంటి పుస్తకాలను చదివేలా చేస్తేనే ప్రజలలో సామాజిక చైతన్యం కలుగుతుందని గ్రహించిన కొందరు యువకులు పల్లెలలో గ్రంథాలయాల స్థాపనకు నడుం బిగించారు. అప్పటి రోజులలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రాయకుదురులో సుజనానంద గ్రంథాలయం, ఏ.ఓ. హ్యూం పేరున కోపల్లె లోనూ, దాదాబాయి నౌరోజీ పేరున ఉండి గ్రామంలోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. కుముదవల్లి గ్రామంలో గ్రంథాలయం స్థాపించాలని ఆలోచన ఆ గ్రామానికి చెందిన వడ్రంగి అయిన చిన్నమరాజు గారికి కలిగింది. 

ప్రారంభ చరిత్ర
ఆయన ముందుగా తన వద్ద కల 50 పుస్తకాలు, వాటితో పాటుగా తను తెప్పించే దేశాభిమాని, ఆధ్రపత్రిక, ఆంధ్ర ప్రకాశీక వంటివి తెచ్చి గ్రంథాలయం ప్రారంభించారు. దానికి శ్రీ వేరేశలింగ కవి సమాజ గ్రంథాలయం అని నామకరణం చేసారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ పుస్తకాలకు భూపతిరాజు లచ్చిరాజు గారు ఆశ్రయం ఇచ్చారు. 1897 నాటికి తెలుగు పుస్తకాల ముద్రణ అంతగా లేదు. అయినా పోస్టాఫీసూలద్వారానూ, ఇతర మార్గాలలోనూ దొరికినంత వరకూ గ్రంథాలనూ, పత్రికలనూ సేకరించేవారు.

గ్రంథాలయ నిర్మాణం
గ్రంథాలయ నిర్మాణానికి ముఖ్యులు అని కొందరు ఉంటారు కాని గ్రంథాలయమే బ్రతుకుగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారని శ్రీ భూపతిరాజు తిరుపతి రాజు గారు ఈ గ్రంథాలయం ద్వారా నిరూపించారు.

ప్రారంభించిన కొద్ది రోజులలో గ్రామానికి చెందిన రైతు కుటుంభానికి చెందిన యువకుడు వీరేశలింగ గ్రంథాలయానికి చదువుకొనేటందుకు వస్తూ దానికి పెద్ద అభిమానిగా మారిపోయాడు. క్రమ క్రమంగా గ్రంథాలయ సేవకే అంకితమైపోయారు. గ్రంథాలయ అభివృద్దికొరకు నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. ఆయనే తిరుపతిరాజు. అప్పటి గ్రంథాలయం ఉచితంగా ఉన్న వసతిలో ఉంది. దానికి శాశ్వతమైన వసతి కొరకు కృషి మొదలెట్టారు. గ్రామ మద్యగా సెంటు స్థలాన్ని గవర్నమెంటు నుండి సంపాదించారు. తన సహచరుడు అయిన కాళ్ళకూరి నరసింహం గారి సలహా మేరకు ప్రజా కార్యక్రమాల పట్ల ఆశక్తి కలిగిన వితరణ శీలి పోలవరం జమిందారు (వీరిది వీరవాసరం స్వగ్రామం) అయినటువంటి కొచ్చెర్ల కోట రామచంద్ర వెంకట కృష్ణరావు గారిని సంప్రదించి వారి ద్వారా గ్రంథాలయం కొరకు 400 విరాళంగా పొందారు. ఆ నిధితో తాటాకుల ఇంటిని నిర్మించి దానిలోకి గ్రంథాలయాన్ని మార్చారు.
పాఠకుల ఆశక్తి కొత్తగా కట్టిన ఇంటిలోకి మారిన గ్రంథాలయానికి పాఠకుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఉన్న వాటితో పాటు మరికొన్ని పత్రికలను కూడా తీసుకోసాగారు అప్పట్లో వచ్చే పత్రికలు
  • బ్రహ్మ ప్రకాశిని (1886) రఘుపతి వెంకట రత్నం నాయుడు
  • కృష్ణాపత్రిక (1902) ముట్నూరి కృష్ణారావు
  • ఆముద్రిత గ్రంథ చింతామణి (1895)
  • జనానా (1904) రాయసం వెంకట శివుడు
  • ఆంధ్రపత్రిక (1905) కాశీనాధుని నాగెశ్వరరావు పంతులు
విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ప్రచురణలు అన్నిటినీ గ్రంథాలయానికి సేకరించేవారు. మచిలీపట్నం ఆంధ్ర బాషావర్ధనీ సమాజ ప్రచురణలు, కందుకూరి వారి అన్ని రచనలూ ఇక్కడ భద్రపరచేవారు. కందుకూరి వారి శిష్యుడైన తిరుపతి రాజు గారు కేవలం గ్రంథాలయాన్ని పుస్తకాల కొరకే కాక ఒక ప్రజా హిత కార్యక్రమ శాలగా మార్చివేసారు. దీని ద్వారా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించేవారు.

గ్రంథాలయ అభివృద్ది ఇలా పలు కార్యక్రమాలు జరుగుతూ గ్రంథాలయం అనది మన్ననలతో పాటుగా పుస్తకాల సంఖ్య, పాఠకుల సంఖ్య కూడా పెరగటం, కొత్తగా పుస్తకాలకు బీరువాలు ఏర్పాటు చేయడం వలన స్థలాభావం కలగటం గమనింఛి మంచి గ్రంథాలయం నిర్మించవలసిన వసరం ఉన్నదని గ్రహించి ప్రస్తుతం ఉన్న గ్రంథాలయం ప్రక్కగా మరొక సెంటు భూమి ఇవ్వవలసిందిగా కోరారు. అలా వచ్చిన భూమిలో నిర్మాణం కొరకు తిరుపతి రాజు గారు అనేక మందిని విరాళాలకోసం కలిసారు అలా విరాలం ఇచ్చిన ధాతలు
  • పిఠాపురం మహారాజావారు
  • పోలవరం జమిందారు
  • కోడూరుపాడుకు చెందిన నడింపల్లి నారాయణరాజు
  • భూపతి రాజు సుబ్బరాజు
  • భూపతిరాజు సోమరాజు
  • సాగి వెంకట నరసింహరాజు
  • పెన్మత్స వెంకట్రామరాజు (గోటేరు)
  • భూపతిరాజు కృష్ణం రాజు గారి సతీమణి సీతయ్యమ్మ గార్ల ద్వారా సుమారు 620 రూపాయలు సేకరించి పెంకుటిల్లు నిర్మించారు.
ఈ పెంకుటింటికి కృష్ణారావు మందిరం అని పిలిచేవారు. తరువాత గ్రంథాలయ నిర్వహణ, అభివృద్ది కొరకు మరిన్ని నిధులు కావాలని భావించి 1916 నాటికి సుమారు మూడువేల స్థిర, చరాస్తులను గ్రంథాలయానికి సమకూర్చారు. 1932 నాటికి గ్రంథాలయంలో 16 వందల గ్రంంథాలు చేరాయి. ఈ గ్రంథాలయానికి జిల్లాలోనే గొప్ప గ్రంథాలయంగా పేరు ప్రఖ్యాతులు కలిగాయి. 
 
సరికొత్త భవన నిర్మాణం
దాదాపు 75 సంవత్సరలు సేవలందించిన గ్రంథాలయ పెంకుటిల్లు బలహీనమైపోవడంతోనూ, పుస్తకాల సంఖ్య పెరగతం వలన, చదువుకొనే స్తహలం తగ్గుతూ ఉండటం వలన మరొక విశాలమైన భవన నిర్మాణానికి పూనుకొన్నారు. 1985 మార్చి 1 వతేదీన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూపతిరాజు రామచంద్రరాజు, వారి సతీమణి సూర్యావతి గార్లచే శంకుస్థాపన చేయించారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖులు లార్స్‌విన్ గ్రూప్ కంపెనీకి చెందిన ఎస్.కృష్ణంరాజు గారు, రాసి గ్రూప్ సంస్థల అధిపతి బి.వి రాజు గారు, డెల్టా పేపర్ మిల్స్ అధిపతులు అయిన భూపతిరాజు సూర్యనారాయణ రాజు గార్ల ప్రధాన విరాళాల సహాయంతో సుమారు నాలుగు లక్షలతో నూతన భవనం ఏర్పాటుచేసారు.  దీనిని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషీ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి నుండీ అనేక రకాలుగ ఈ గ్రంథాలయం సేవలు కొనసాగిస్తుంది.  

Tuesday, April 21, 2015

పరిపక్వత లక్షణాలు

కొందరికి కొన్ని విషయాలలో అవగాహనా రాహిత్యం ఉంటుంది, వారు ఎన్నో రంగాలలో కృషిచేసినా, ఎన్ని అనుభవాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అలా ఎదుర్కోడానికి ఏదో విషయములో పరిజ్ఞానం లేకపోవడమే కారణం

కాని అలా అన్ని విషయాలలో సొంత పరిజ్ఞానం కాక ఎదుటి వారి అనుభవాల నుండి మనం ఎన్ని త్వరగా నేర్వగలిగితే అంత త్వరగా కొన్ని ఆటుపోట్ల నుండి, కష్టాల నుండి, అవమానాల నుండి బయటపడవచ్చునని ఒక పెద్దాయన చెప్పారు.


ఈటీవలి నేను కలసిన పెద్దలు, సాహితీకారుల మాటలలో ఎన్నో ఇలాటి అనుభవాలను ఏరుకొని జాగ్రత్త చేసుకొనే అవకాశం కలుగుతున్నది.
నవరసాల సాంగత్యం - నిజమే కొందరు చాదస్తంగా చెపుతారు, కొందరు అద్భుతంగా చెపుతారు, మరికొందరు నిర్లజ్జగా చెపుతారు, కొందరు నిర్భయంగా, కొందరు భయం భయంగా....కొందరు క్రూరంగా... (నిజంగానే వీళ్ళు చెపుతున్నపుడు కొడతారేమో అని భయపడేట్టూగా వాళ్ళు హవభావాలు ఉంటాయి).. చెపుతారు

ఇలా మనుష్యుల ప్రవర్తన అందులోనూ సాహితీ రంగంలో ఉన్నంత మజా మరెందులోనూ లేదు సుమా..!


ఒకాయన కొందరి గురించి ఇలా చెప్పారు...కొందరు ఇలా ఉంటారు వాళ్లలో నేనూ నువ్వూ ఉంటామనుకో అయితే మనం అలా అని ఒప్పుకోం మేం అలా ఉండం అంటాం
కాని అల్లానే ఉంటాం. ఆ కొందరే మనం అని...ఏమంటావ్ అని అడిగారు.....  :)  (ఏమంటాం? -  దేబే మొహం వేస్కుని చూడటం తప్ప)


పరిపక్వత లక్షణాలు వినే పద్దతిలో ఉంటాయని ఒకాయన చెప్పారు..... ఏలనయ్యా అని అడగ్గా -  చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు కదా లోకువ అనుకొని ఎక్కువ వాగితే - విన్నవాడు చెప్పినవాడిని గురించి జనాలో లోకువ చేస్తాడు. కనుక చెప్పినపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలని,  వినేవాడిని జాగ్రత్తగా పరిశీలిస్తూ చెప్పాలని... :)  (అంతే నేను ఇక బిగిసిపోయాను ఎలా మసిలితే ఎలా అనుకుంటాడో అని )

మరోకాయన చెప్పాడు -ఏమయ్యా  విశ్వనాధూ, నువ్వు ఇన్ని అడీగావు కదా నేనొకటి అడూగుతాను చెప్పు. నన్ను వెతుక్కుంటూ వచ్చావు, పరిచయం చేసుకున్నావు, నీ గురించి నీ పని గురించి చెప్పావు, ఇన్ని వివరించి చెపితే కాని మాట్లాడని నాతో ఎందుకయ్యా నీకు పని.. అని....  :)   (అన్నీ చెప్పేసి వెళ్ళిపొమ్మని కాబోలు - కాదని తరువాత తెలిసింది - వచ్చిన వాడు ఏపని మీద వచ్చాడో అది తెలుసుకొని దానికి తగిన జవాబిచ్చి పంపించాలి కాని ....వివరాల కోసం వాడిని హింసించడం ఏమిటయ్యా చాదస్తం కాకపోతేనూ అని సెలవిచ్చారు చివరలో -   మహానుభావుడు )

ఇంకోకాయన ఇలా చెప్పుకొచ్చాడు.. ఇలా ఎవరెవరో వస్తారు ఏదో చెపుతారు, రాసుకెళతారు... అందుకే ఒద్దయ్యా, నన్ను నా మానాన  ఒదిలేయండి.. ప్రశాంతగా ఉన్న నన్ను ఇబ్బంది పెట్టద్దు....అని  అంటూ ...ఇలా అన్నానని ఏమనుకోబ్బాయ్  అన్నారు..   :)

ఇలా బోలెడు అనుభవాలు...రాస్తూ పోతే... కొంత కాలానికి నేనూ అంటానేమో, ఏమయ్యా నీ ఇష్టమొచ్చినట్టు రాస్తానంటే నేనేమీ చెప్పను సుమీ...   :) :)

Sunday, April 12, 2015

పిఠాపురం వికీపీడియా అవగాహనా కార్యక్రమం

ఈరోజు పిఠాపురంలో జరిగిన వికీపీడియా అవగాహనా కార్యక్రమంలో నేను మిత్రుడు రాజాచంద్రతో కలసి పాల్గొన్నాము. పిఠాపురం యొక్క చారిత్రక విశేషాలు అనేకం. ఇక్కడ పుట్టి పెరిగిన గురుదత్తునిపైనే అనేక వ్యాసాలు రాయవచ్చు. అవేకాక పిఠాపుర సంస్థానం, కుక్కటేశ్వర ఆలయం, పాదగయ క్షేత్రం మొదలు అనేక చారిత్రక విశేషాలు ఉన్న పిఠాపురం గురించి అక్కడి ప్రజలే ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా వాసులకు పరిచయం కలిగించవలసిన అవసరం ఉంది. ఆయా విశేషాలను చేర్చడానికి ముందుకు వచ్చే తెలుగు అభిమానులందరకూ అభివందనం

Friday, April 3, 2015

సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి


సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి ప్రముఖ స్వాతంత్ర సమరయోదురాలు మరియు సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి.
ఈమె కృష్ణాజిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో 18 మే 1914లో వాసిరెడ్డి సీతారామయ్య, సుబ్బమ్మ దంపతులకు కడసారి బిడ్డగా జన్మించారు. ఆమె గురువు జంగా హనుమయ్య చౌదరి. ఆయన కవి, పండితుడు కావడం వల్ల ఆమెకు ఉత్తమ కావ్యాలను బోధించి మంచి విద్వత్తు కలిగించారు.

సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడు లో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, తాపీధర్మారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.

1920లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు.  1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమె ప్రయత్నిం చారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. 1932లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి చేబ్రోలు వచ్చారు.

రాట్నంపెై నూలు వడకటం, హిందీ నేర్చుకోవటం, ఖాదీధారణ అక్కడ పరిపాటి. ఉద్యమం ప్రచారం చేస్తూ రాజ్యలక్ష్మీదేవి దగ్గర బంధువెైన అన్నపూర్ణమ్మతో శాసనోల్లంఘన చేయతల పెట్టారు. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసిపో యింది. వారిని చూడాలని వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసి పోయాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ శాసనధిక్కార నినాదాలు చేస్తూ అందరూ ఊరేగింపుగా బయలుదేరారు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

శిక్ష గురించి న్యామూర్తుల ఇళ్ళలో సైతం స్త్రీలు వీరికి అండగా నిలవడంతో ఆ శిక్ష రద్దు చేసి నామమాత్రపు శిక్ష ను ముగ్గురికీ విడివిడిగా విధించారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మీదేవిని రాయవేలూరు జెైలుకు తరలించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు పరిపాటి అయినాయి. గ్రంథాలయంలో హిందీ తరగతులు నిర్వహించేవారు. తనుకూడా  కష్టపడి చదివి రాష్ర్టభాష పరీక్ష లో ఉత్తీర్ణత సాధించారు.

అస్పృశ్యతా నివారణకై సూర్యదేవర రాజ్యలకీదేవి తన వంతు కృషి చేశారు. పేరంట సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. గుంటూరుజిల్లాలో ఆ సత్యా గ్రహం చేయడానికి అనుమతి లభించిన తొలిస్త్రీ రాజ్యలక్ష్మి అని చెప్పవచ్చు. 30 జనవరి 1941లో బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణకోడూరులో ఆమె సత్యాగ్రహం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు నెలల జెైలు శిక్ష, వందరూపాయల జరిమా నా కూడా విధించారు. ఆమె జెైలు నుండి విడుదలెైన పిదప మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు చేరుకున్నారు. ఆ తరువాత తెనాలి వెళ్ళి ట్యుటోరియల్‌ కాలేజిలో చేరి బెనారస్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చేబ్రోలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి దేశాభ్యుదయానికి పాటుపడ్డారు. ఇంతలో క్విట్‌ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో రాజ్యలక్ష్మీదేవిని శాసనధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించారు. ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరిగి ప్రజలచే శాసనధిక్కారం చేయించారు. పోలీసులు ఆమెను వెంటాడేవారు.

కానీ దేశభక్తులు ఆమెను కాపాడేవారు. రాజ్యలక్ష్మీదేవి 1941లో చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తరువాత 2 అక్టోబర్‌ 1945లో ఆంధ్రరాష్ర్ట మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు. భారతదేశానికి 1947 ఆగష్టూ 15వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే నెైజాము వాసులకు విముక్తి కలగలేదు. రాజ్యలక్ష్మీదేవి విరాళాలు, చందాలు పోగుచేసి నెైజాం వ్యతిరేక పోరాట నాయకులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. మాకు ధనసహాయం వద్దు అంగబలం కావాలి. మాతో నిలబడి ఉద్య మ ప్రచారానికి సహకరించండిఅని నాయకులు కోరారు. టంగుటూరి సూర్యకుమారి పాట కచ్చేరీ ద్వారా వసూలెైన మొత్తాన్ని ధన సహాయంగా ఇవ్వటమేకాక రాజ్యలకీదేవి వ్యక్తి గతంగా నెైజాం వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదు సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమ య్యే వరకు ఆమె అక్కడి వారితో కలసి పోరాటం సాగించారు.

Thursday, April 2, 2015

సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం



శతాబ్ధాల చరిత్ర కలిగిన పిఠాపురం జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. 1907 ప్రాంతంలో పిఠాపురం మాహారాజా సూర్యారావు గారు రాజరికానికి వచ్చిన తరువాత వారితోపాటుగా బ్రహ్మ సమాజీకులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు, పిఠాపురానికి దయచేసారు. అప్పటి నుండి కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వగైరా పట్టణాలలో సమాజ పరంగానూ మహారాజావారు వ్యక్తిగతంగానూ ప్రోత్సహించి సాంఘిక న్యాయం కోసం కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెల్ళారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆదేశాaల మేరకు హరిజన, నిమ్నజాతుల అభివృద్దికై కాకినాడలో శరణాలయం, రాజమండ్రిలో వీరేశలింగ ఆస్తికపాఠశాల, పిఠాపురంలో హరిజన బాల బాలికల శరణాలయాలు స్థాపించారు. వీటిలో ఉచిత భోజన, వసతి, విద్యాభోదనలు ఏర్పాటు చేసారు. అలా పిఠాపురానికి ఉత్తేజాన్ని తీసుకొచ్చారు శ్రీ రాజావారు. అయితే ఈ మార్పు వలన రాజ వారి చుట్టూ భజన పరుల సంఖ్య ఎక్కువ చేసింది కాని సమాజంలో తగిన మార్పు తీసుకురాలేకపోయింది.  ఈ సమయంలో పురాతన సంసృతీ వ్యవస్థ, ఆధునిక బ్రహ్మ సమాజ వ్యవస్థల మద్య గ్రాంధిక బాషా బేషజాలు,  జమిందారీ వ్యవస్థ మద్య జాతీయోజ్యమం, గ్రంథాలయ పరిణామం సాగుతూ వచ్చాయి.
 
అలాంటి సమయంలో పిఠాపురం చరిత్రలో గొప్ప మలుపు చోటుచేసుకుంది. అదే సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ స్థాపన. 1915 మార్చి 16 న శ్రీ మలిరెడ్డి వెంకటరాయుడు, వేపూరి వేణుగోపాలదాసు, శ్రీ కొత్త సూయనారాయణగార్లు మరికొందరు దేశభక్తులు కలసి 16-03-1915 న  పిఠాపురంలో విద్యానంద పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. పిమ్మట శ్రీ హనుమానుల సూర్యనారాయణ గుప్త గారు అదే పట్టణంలో 12-03-1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండారాన్ని నెలకొల్పారు. దీనికి ఉపశాఖగా దామెర రామస్వామి గారి అధ్యక్షతన ఆంధ్రబాషా అభివృద్ది నాటకసమాజం అనే ఒక సంస్థను మహారాజా వారి సహకారంతో స్థాపించారు. ఈ నాటక సమాజానికి రాజావారు యాభైవేలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో నాటక సమాజానికి కావలసిన హంగులు సమకూర్చుకొని వేణీ సంహారం, విజయ విలాసం వంటి నాటకాలను, కొన్ని సంసృత నాటకాలనూ రాష్ట్రమంతటా పలు చోట్ల ప్రదర్శించేవారు. ఇలా నాటక సమాజం ద్వారా ప్రదర్శనలు ఇస్తూనే పిఠాపురం రెండు గ్రంథాలయాల నిర్వహకులు గ్రంథ సేకరణ, వనరుల సేకరణలో పోటాపోటీగా పనిచేసేవారు
1917లో కలియుక భీమునిగా కీర్తింపబడిన కోడి రామ్మూర్తి గారు పిఠాపురం వచ్చినపుడు విద్యానంద గ్రంథాలయం చూసి వంద రూపాయలు విరాళంగా ఇవ్వగా, ఆ విరాళంతో పుస్తక భద్రత కొరకు నాలుగు టేకు బీరువాలు చేయించారు. అవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.
అయితే గ్రంథాలయ ఉద్యమంలో రెండు గ్రంథాలయాలు విడివిడిగా పనిచేయడం కంటే కలసి పనిచేస్తే మరింత భావుంటుందని తలచిన స్థానిక పెద్దల కోరిక ఫలితంగా రెండు గ్రంథాలయాలు కలపి సూర్యరాయ విద్యానంధ గ్రంథాలయంగా రూపొందించారు. ఇది సోములు బాబుగా పిలిచే దామెర స్వాముల బాబు గారి ఇంట్లో ఎక్కువ కాలం నడిచింది. తదుపరి నగరంలో రెండు మూడు ఇళ్ళు మారింది. 30 సంవత్సరాలు గడిచిన పిమ్మట పాఠకుల సంఖ్య, గ్రంథాల సంఖ్య విశేషంగా పెరగటం వలన గ్రంథాలయానికి సొంత స్థలం, భవనం సమకూర్చాలనే యోచన చేసారు.    

1942లో సోషలిస్ట్ భావాలు కల చెలికాని భావనరావు గారు, అవంత్స సోమసుందర్ గార్లు దీనికి కృషిచేసారు, గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చారు. 1944 లో కొత్త కార్యవర్గం వచ్చిన పిదప పాత బస్టాండ్‌కు సమీపాన కల పెంకుటింటికి మార్చబడినది. అలా గ్రంథాలయానికి సొంత జాగా ఏర్పడినది.  చెలికాని భావనరావు గారు కొంత కాలం ఊరు విడి వెళ్ళటం జరిగింది.

ప్రకృతి వైపరీత్యాల వలన, కొన్ని వైషమ్యాల వలన గ్రంథాలయ నిర్వహణ కుంటుపడటం, కొంత భాగం అన్యాక్రాంతం అవదం జరిగింది. సాంసృతిక కూడలిగా ఉండాలనే తలంపుతో రెండో భవనంలో కి దానిని తీసుకురావడం ద్వారా గ్రంథాలయంలో ఇతర అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. అదేకాక పెంకుటింటిలో కొంత భాగం కూలిపోగా బాగా దెబ్బతినడం జరిగింది. అయితే పుస్తకాలు చాలా వరకూ జాగ్రత్త చేయబడ్డాయి.

తిరిగి ఊరు వచ్చిన చెలికాని భావనరావు గారు పరిస్థితులను పరిశీలించి గ్రంథాలయానికి తిరిగి పూర్వ వైభవం తేవాలని  రాయవరపు సుబ్బరావు గారితో కలసి కోర్టులో గ్రంథాలయం తరపున పోరాడి రాజావారి దగ్గర నుండి 1400 రూపాయలతో భవనం, స్థలం మొత్తంగా  కొనుగోలు చేసి గ్రంథాలయం పేరుతో 1974లో రిజిస్టర్ చేయించారు. జిలా గ్రంథాలయ అద్యక్షుడైన కొప్పన వెంకట కొండలరావు గారి ప్రోత్సాహంతో తిరిగి గ్రంథాలయ నిర్వహణ ఒక దారికి తీసుకువచ్చారు.

కృష్ణశాస్త్రి, విశ్వనాధ, పి నారాయణ రెడ్డి, మల్లంపల్లి సీమశేకర శర్మ వంటి అనేక మంది ప్రముఖులను ఇక్కడ ఆహ్వానించి వారి ప్రసంగాలతో ఉత్తేజితులై వారిని సన్మానించుకొంటూ వెలిగినది. 1977 లో వజ్రోత్సవం జరిగినది. పాతూరి నాగభూషణం, ఎం. ఆర్. అప్పారావు, భాష్యం అప్పలాచార్యులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మొదలైన ప్రముఖులు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు

ప్రస్తుతం ఉన్న భవనం 1977-78 లో పునర్‌నిర్మించడం జరిగింది. దీనికి నటరాజ రామకృష్ణ బృందం, కళాకృష్ణ, డా.విజయలక్ష్మీ మురళీకృష్ణ గార్లకుమార్తె తుషార, సతివాడ సూర్యనారాయణ గారి కుమార్తె రాధిక మున్నగువారు ప్రధర్శనల ద్వారా నిధులను పోగుచేసి ఇచ్చారు. దానితో పాటుగా అప్పటి గ్రంథాలయ శాఖామాత్యులు భాట్టం శ్రీరామమూర్తి గారు, జె. చోక్కారావు గార్ల సహాకారం, ఆంధ్ర నాట్య ప్రధర్శనల ద్వారా నూతన భవన నిర్మాణం జరిగింది.

గ్రంథాలయంలో కల తాళపత్రాలను జాగ్రత్త చేయుట కొరకు జిల్లా గ్రంథలయ సంస్థకు చేర్చడం జరిగింది. వాటిలో కల విలువైన జోతిష శాస్త్ర గ్రంథాలను ప్రాచీన గ్రంథాలయ రక్షణ శాఖకు తరలించారు

మాధవరావు గారి ప్రోద్భలంతో 1990 లో గ్రంథాలయ నిర్వహణ నిమిత్తం ముందు కల కాళీ స్థలంలో ముందు 3 షాపులను నిర్మించారు. వాటి ఆదాయం ద్వారా గ్రంథాలయ అభివృద్ది నిమిత్తం ఖర్చుచేస్తూఉన్నారు. తధనంతర కాలంలో మరో 4 షాపులు 2006 లో నిర్మించారు. గ్రంథాలయ పై భాగాన ఊరి ధాతల సహకారంతో మరోక అంతస్తు నిర్మించారు. దీన్లో సాంసృతిక సభలకు, సమావేశాలకు నామ మాత్రపు అద్దెతో ఇవ్వడం ద్వారా గ్రంథాలయ నిర్వహణకు మరొక వనరుగా ఏర్పరిచారు.