Sunday, March 8, 2015

అరసవల్లి సూర్యభవానుని దేవాలయ చరిత్ర


శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అతి పురాతన ఆలయం అరసవల్లి.  భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ 3 శాసనాలు లభిస్తున్నవి. వీటిని దేవాలయం నుండి బయటకు వచ్చు ద్వారం వద్ద ప్రదర్శనకు ఉంచారు. ఈ  శాసనాల ద్వారా ఈ ఆలయం  క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినదిగా అతి ప్రాచీనమైనదిగానూ చెప్పబడినది. దీనిని ఒరిసాకు చెందిన కళింగ రాజులలో నల్గవ వాడైన దేవేంద్రవర్మ నిర్మించినట్టుగ చరిత్రకారుల కధనం.
పురాణ కధనం
ఈ ఆలయానికి శ్రీకాకుళం నాగావళి ఒడ్డున కల ఉమారుద్ర కోటేశ్వరస్వామి దేవాలయానికి సంభందం కలిగి ఉన్నది. ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారిని మహాశివరాత్రి దర్శించిన జన్మరాహిత్యం ఉండదని ప్రతీతి. ఇక్కడ లింగ మూర్తిని బలరాముడు ప్రతిష్టించెను. ఈ మూర్తిలో రుద్రకోటి గణము కనిపించుట వలన బలరాముడు రుద్రకోటేశ్వరునిగా నామకరణము చేసెను. 
ప్రతిష్ట పూర్తి అయిన తరువాత దేవతలంతా శివుని దర్శించుకొని వెళ్ళారు. కాని ఇంద్రుడు ఆలస్యంగా రావడం వలన నందీశ్వర, బృంగీశ్వర, శృంగీశ్వర తదితరులు తరువాత రమ్మని చెప్పగా వారితో ఇంద్రుడు వాదిస్తూ ఘర్షణకు దిగెను. కోపము వచ్చిన నందీశ్వరుడు కొమ్ములతో ఇంద్రుని దూరంగా విసిరేసాడు. ఇండ్రుడు పడిన ప్రాంతం తరువాత ఇంద్ర పుష్కరిణిగా ఏర్పడినది. ఇంద్రుడు నంది కొమ్ముల ధాటికి సర్వశక్తులు కోల్పోయి పడిఉన్నసమయం - అప్పుడే తొలి వెలుగులతో ఉదయిస్తున్న సూర్య భగవానుని ప్రార్ధించగా సూర్యుడు ప్రత్యక్షమై నీవు పడినచోట వజ్రాయుధంతో త్రవ్వమనగా అక్కడ సూర్యభగవానుని విగ్రహం బయల్పడినది. దానిని ప్రతిష్టించి కొలిస్తే శక్తి తిరిగి వస్తుందని సూర్యభగవానుడు తెల్పడంతో, అక్కడ మూర్తిని ప్రతిష్టించి పూజించి, తనశక్తులను పొందాడు. తరువాత అక్కడ ఆలయ నిర్మాణం గావించాడు.

నిర్మాణ విశేషాలు
ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజాము నవాబు పాలన క్రిందికి వచ్చింది. ఔరంగజేబు ద్వారా ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాల ధ్వంసం జరిగింది. ఆ విషయాలను అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా ఒకటి. 
సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించారు. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
ఇప్పటి తధనంతర దేవాలయం 18 వ శతాబ్ధంలో ఆదిత్య విష్ణు శర్మ మరియు భానుశర్మవార్ల వంశస్తుల ద్వారా నిర్మించబడినది. శ్రీ రామకృష్ణరావు దుసి గారు ఆలయానికి మరిన్ని నిధులు అందించారు.

ప్రత్యేకతలు
* దేవాలయ ప్రధానమూర్తి సుమారు ఐదు అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకలతో ఏడు గుర్రాలతో ప్రక్క పద్మ,ఉష, చాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది. 
* విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులగు పింగళ, దండులతో పాటు సనక సనందాది ౠషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్య రధం, కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. 
* ప్రతి రధ సప్తమికి సూర్య కిరణాలు మూలవిరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రధం నమూనాలో చక్రాలపై నిలిచినట్టుగా నిర్మించారు.
* బయటకు పోవు మార్గ ద్వారం వద్ద ఆలయానికి సంభందించిన మూడు శాసనాలను నిక్షిప్తం చేసారు.
* ఈ ఆలాయం శ్రీకాకుళానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. త్వరలో శ్రీకాకుళంలోనేకలసిపోవచ్చు

No comments: