Tuesday, July 3, 2007

సొంతడబ్బా.


---సొంత డబ్బాలో ఒకానొక పోష్ట్ ,,,సొంతడబ్బా అని ఎందుకంటే సహాధ్యాయుల బ్లాగులను సందర్శించినపుడు అనేకానేక రంగుల విశేషాలు"విషయమున్న విశేషాలే సుమండీ" కనిపించి కొంచెం కంగారు పుడుతుంది. అరెరే వీళ్ళంతా భలే రాసిపడేస్తున్నారు. మనం మన డబ్బా తప్ప వేరేం రాయలేకున్నాం ఎందుకని? ఎందుకనబ్బాఅనుకుంటూ ఉంటే నాలోవాడు చెప్తాడు. నీ బ్లాగు నీ ఇష్టం నీ సుత్తితో నువ్వు కొట్టు దెబ్బలు తినేవాడి గురించి నీకెందుకు. అందుకనే ధైర్యంగా ఇంకో "'డబ్బా'' వదిలెయ్ అన్నాడు. మరి కాచుకోండి.


నాకు వర్షం అంటే చాలాఇష్టం సాధారణంగా వర్షమొచ్హినపుడు అందరూ ఇంట్లో కూర్చుంటారు. నేనైతే వర్షంలోతడుస్తూ సైకిల్ పై రోడ్లవెంట తిరుగుతాను. అదేంసరదా అంటే నాక్కూడా తెలియదు. కాని వర్షం నన్ను వెనుకకుతోస్తూ ఉంటే ముందుకు పోవడం చాలా బాగుంటుంది. చిన్నగా కురుస్తూ ఉంటే మాత్రం చెరువు గట్టుకు వెళ్ళి ఇటు నుంచి అటు-అటు నుంచి ఇటు, తిరుగుతుంటా.. ఒరేయ్ అదేం పనిరా వానలో తడిస్తే రొంపడతాది రా పైకిరా పై నుంచి మా అమ్మ-అరుపులు వినిపిస్తుంటాయి. మనం వినిపించుకుంటేకద. చెరువు గట్టువెంట తిరిగే అలవాటు ఇప్పటిదికాదు. చిన్నపుడు ఏదైనా తప్పు చేసినపుడు మా అమ్మ చీపురులోంచి రెండుమూడు ఈనెలు తీసి వెంట పడితే దొరక్కుండా చెరువు చుట్టూ తిరిగేవాడిని. చెరువుకు కొంచెం దూరంగా ఒక చింతచెట్టుండేది దానిమానులో పుచ్హుపట్టి ఒకవైపు వరిగి పోయింది. వరిగి మళ్ళీ పెరగడంతో అది చూడ్డానికి విష్ణుమూర్తి శేషపానుపులా ఉంటుంది. అలిగినపుడు మనకదే ఆశ్రయం. చాలా సమయం వరకూ ఇంటికి వచ్హే వాడిని కాను. మా చిన్నక్క వచ్హి కొంతసేపు బ్రతిమలాడేది నేను నాకోపమంతా తనమీదచూపిస్తూ నేరాను పో! అనేవాడ్ని. బలవంతంగా లాక్కెళుతుంటే వదలమని కొడుతుండేవాడిని. భరించి మరీ తీసుకెళ్ళేది. అసలు నేను దెబ్బలు తినేదెక్కడ ఎప్పుడు మా అమ్మ చెయ్యెత్తినా తనే అడ్డంగా వచ్హేసేది దాంతో తనకీ పడిపోయేవి. చెరువుకు ఆవైపుగా పెద్ద కాళీ స్థలం ఉండేది. అక్కడ మరో ఎనిమిది చెట్లు అటు నాలుగు ఇటు నాలుగుగా వరుసగాఉండేవి. అటు చుట్టు ప్రక్కలవాళ్ళకదే' పేద్ద' ఆట స్థలం. కోతికొమ్మచ్హి ఆడినా కొండ కొమ్మచ్హి ఆడినా గూటీ బిళ్ళ, వేటికయినా మాకదే అడ్డాగా ఉండేది. చాలాకాలం తరువాత వాటిలో ఏడు చెట్లను కొట్టేయడం జరిగింది.

ఎనిమిది చెట్ల వల్లనే మాఏరియాను చింతల తోట అంటారట.ఏడు చెట్లు కొట్టేయగా మిగిలిన ఒకేఒక చెట్టు అదే ఇది.


2 comments:

కిరణ్మయి said...

మీ "సొంతడబ్బా" బానేవుంది :)

srinivas said...

బాగుది .............మీ వూరు .............!