Tuesday, September 18, 2007

మాఊరంటే నాకిష్టం

వేమూరి వేంకటేశ్వరరావు, మాఊరంటే నాకిష్టం : {తుని వ్యాసభాగము నుండి}
రైల్ మీల్భోజనం-విషయంలో కూడ తుని పర్యాటకులని బాగానే ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాలు ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మెడ్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడ చెప్పేవారు. భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని ఊరు మట్టిలో ఏమి ఉందో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి ఇంతా అంతా కాదు. దేశం అంతా ప్రసిద్ధి. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉండేవి. తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోయేవి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే పాత రోజులలో ఒక లగ్జరీ. తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని మా ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అనేవారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవాలలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం మా ఊరి వర్తకులకి ఉందనిన్నీ అప్పుడు తెలిసింది. స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబులో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లవుడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. తునిలో ఉన్న సామాన్య జనసందోహానికి అదొక్కటే రేడియో. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది! అరిగిపోయిన ఆ చదరంగం బల్ల మీద గళ్ళు కనిపించేవే కావు.పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యెష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యెష్టమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు,” అని తీర్పు చెప్పేరుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు...
నాకు ఈ వ్యాసభాగం చాలా నచ్చింది.కాని తెలుగు వికీలో ఈ వ్యాసాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ భాగాలనుండి చాలావరకూ కత్తిరించి తీసేయాల్సి రావడం బాగా అనిపించలేదు. కత్తిరించే భాగాలను ఒక టపాగా ఇస్తే... అనే ఆలోచన రావడంతో ఇది ఇలా మీ ముందుకొచ్చింది.

8 comments:

Unknown said...

చాలామంచి ఆలోచన! చాలా సార్లు ఇలాంటి సొంత అనుభవాలను విజ్ఞానసర్వస్వశైలికి తగవని కత్తరించెయ్యాల్సి వస్తుంది.

విహారి(KBL) said...

వంశి పసలపూడి కధల స్టైల్లొ వుంది.బాగుంది.

మేధ said...

బావుందండీ తుని కధాకమామిషు...

Anonymous said...

బలే చెప్పారండీ...

Anonymous said...

చాలా బాగా చెప్పారు అండి..మాది పశ్చిమ గొదావరి జిల్లా, మీరు చెప్పిన రీడింగు రూము, చదరంగం, అన్ని పాత స్మ్రుతులని ఒక్కసారి తట్టి లేపాయి.

Unknown said...

మీ ఊరి విశేషాలు బావున్నాయి...

ramya said...

తుని విశేషాలు బాగున్నాయి.
మీ బ్లాగు నేను ఈరోజే చూసాను,మీ పాతపోస్టు లు అన్నీ చాలా బాగున్నాయి.
మీపేవరేట్ ప్లేస్ బాగుంది,
మీరు వేసిన తోట,మీ రావి మొక్క,మీప్రెండ్ అన్నీ చాలా బాగున్నాయి.
చందమామ కథల్లో పల్లె చాలాచాలా బాగా గీసారు.
మీ ఇల్లు,అక్కడ నుండి చూస్తే కనిపించే ప్రక్రుతి అద్బుతంగా వున్నాయి.
మీ ఇల్లు పొదరిల్లు లా చాలా బాగుంది.
పాపికొండల్లో గోదావరి ,మీవూరి రహదారులు అన్నీ చాలా చాలా బాగున్నాయి.

Anonymous said...

Hi Viswanath


Awesome.