Saturday, May 28, 2016

నత్తా రామేశ్వరం క్షేత్ర విశేషాలునత్తా రామేశ్వరం' పేరు వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రామచంద్రుడు, 'నత్త గుల్లలు' కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరుకి 'నత్తా రామేశ్వరం' అనే పేరు వచ్చిందని ఒక కధనం
శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'రామావతారం, 'పరశురామావతారం' ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాలలో శ్రీమహా విష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం. అలాంటి గొప్పదనాన్ని పొందిన క్షేత్రం 'నత్తా రామేశ్వరం'. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఉంది

ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను, వాయు పురాణాల్లోను వున్నది.  పురాణ విశేషాలలోకి వెళితే -

శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాపపరిహారనిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు సీతాదేవి కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకొన్నాడు. దానికి మద్యాన్న సమయంలో గోస్తనీ నదిలో త్రికోటి తీర్ధములు వచ్చి చేరుతాయని తలచి హనుమంతుని వారణాసికి పంపి శీవలింగమును తెమ్మని చెప్పేను. అయితే హనుమ వచ్చు సమయం మద్యాన్నం దాటుతుండుట వలన అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు, సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని కూడా అక్కడే ఉంచేసారు. అలా నత్తలు, ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం.
ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభి ముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం పరశురాముడు గోస్తనీ నదీ తీరమున 9000 సంవ‌త్స‌రాలు ఏకాగ్ర‌చిత్తముతో శ్రీ మహావిష్ణువుకై త‌ప‌మాచ‌రించారు.ఆ త‌ప‌స్సుకు మెచ్చిన శ్రీ‌మ‌హావిష్ణువు అత‌నికి త‌న‌లో నాల్గ‌వ అంశ‌ముగా ఉన్న సువ‌ర్ణ‌ వైష్ణ‌వ ధ‌నువు నీయ‌గా అత‌డు దానితో అనేకమంది రాక్ష‌సుల‌ను, కార్తవీర్యార్జుని జయించి పెడమార్గాలతో జనులను భాదించే కొందరు రాజులను, దుర్మార్గ‌ములైన  క్ష‌త్రియుల‌ను కూడా సంహ‌రించినాడు

అటుపై హత్యల వలన ఏర్పడిన దోషాలను తొలగించుకొనుటకు  కైలాస‌మునకు వెళ్ళి క్రౌంచ ప‌ర్వ‌త‌మును భేదించి శివుని ఆనతితో పర్వతమునుండి ఒక లింగ‌ము తీసుకుని వ‌చ్చి గోస్త‌నీతీర‌మున ప్ర‌తిష్టించారు. స‌ప్త‌మునుల‌తో, బ్ర‌హ్మర్షి, దేవ‌ర్షుల‌తోడ‌ను, యాజ్ఞ‌వ‌ల్క్యాది భూసురుల తోడ‌ను, ఆ లింగ‌మున‌కు జ‌లాదివాసం, ధాన్యాదివాసం, ర‌త్నాదివాసం మొద‌లైన సంస్కార‌ముల నాచ‌రించి, అంత‌ర్మాతృకా బ‌హిర్మాతృకాదుల‌చే ప్రాణ‌ప్ర‌తిష్ట మొన‌ర్చి స్థాపించినాడు.
అయితే పరశురాముని కోపాగ్ని వలన ఆ శీవలింగం  అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేసాడు.. స్వామి చల్లబడ్డాకా.. అయ్యోస్వామీ నీకు పూజలెలా అని బాధపడుతుంటే.. అప్పుడు స్వామి బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీళ్ళతో ఉంటాను ఒక్క ఫాల్గుణమాసం లో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు

ఆ లింగ‌మున‌కు స‌ప్త‌కోటేశ్వ‌ర రామ‌లింగ‌మ‌ని నామ‌ధేయ‌ము క‌లిగెను. భార్గ‌వ‌నిర్మితంబ‌నీ క్షేత్ర‌మ‌ము పంచ‌క్రోశ‌ప‌రిమిత‌మైన‌ది. ప‌రుశురాముడా క్షేత్ర‌మున‌కు స‌ర్వ‌పాప‌హ‌ర‌మైన‌దిగాను, స్వ‌ర‌ర్ణ‌తీర్థ‌ఫ‌ల‌ద్రాయ‌క‌మైన‌దిగాను వ‌ర‌మిచ్చెను
అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు ... ఋషులు ... దేవతలు ... ఇలా మొత్తం ఏడు కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని 'సప్త కోటీశ్వర లింగం' అని కూడా పిలుస్తుంటారు. శ్రీ రామేశ్వ‌ర‌స్వామివారి న‌త్త‌ల‌తో కూడియున్న లింగం కావున శంభూక రామ‌మేశ్వ‌ర‌మ‌ని కూడా పిలువ‌బ‌డుతున్న‌ది.
ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే వుంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు వున్నాయి. నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు
అదేవిధంగా ఈ ఆల‌య ప్రాంగ‌ణంలో సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర‌స్వామి, వీర‌భ‌ద్రస్వామి, ఆంజ‌నేయ‌స్వామి, కాల‌భైర‌వ‌స్వామి, గోస్త‌నీ న‌ది ఒడ్డున ల‌క్ష్మ‌ణేశ్వ‌ర‌స్వామి ఆల‌యాలు ఉన్నాయి. రామేశ్వ‌ర‌స్వామి ఆల‌యం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రంగా పేరు గాంచింది. ఈ ఆల‌యంలో శివ‌రాత్రి ఉత్స‌వాలు అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హిస్తారు. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా ప‌దివేల‌మందికి అన్న‌దానం నిర్వ‌హిస్తున్నారు. ఏటా ఈ ఆల‌యంలో జ‌రిగే ఉత్స‌వాల‌కు అత్య‌ధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసి స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకుంటారు. ముఖ్యంగా గోస్త‌నీన‌దిలో ఉన్న రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యం కేవ‌లం వైశాఖ‌మాసంలోనే భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం తెరిచి ఉంటుంది.
ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తేముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్సనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.

నత్తా రామలింగేశ్వాలాయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం కలదు. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో వున్నది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుంది. 6 కి.మీ. మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రమున్నది.

Friday, May 27, 2016

గోస్తనీ నది మహత్యం

పశ్చిమగోదావరి జిల్లాలోని పవిత్రమైన నదులలో గోస్తనీ నది  కూడా ఒకటి.

ఈ నది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద గోదావరి నుంచి పాయగా జీవం పోసుకొని ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం, పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు మండలాలు తాకుతూ 18 గ్రామాల మీదుగా 37,600 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి భీమవరం మండలం యనమదుర్రు డ్రయిన్‌ ద్వారా సముద్రంలో కలుస్తోంది.

గోస్తని చరిత్ర విశేషాలను తెలుసుకోవాలనుకొన్న నారదుడు బ్రహ్మదేవుని చేరి గోస్తని పుట్టుక, గొప్పధనం తెల్పమని అడుగుతాడు


దానికి బ్రహ్మదేవుడు - గోస్తనీనది పరమ పవిత్రమైనది. పూర్వం పృదుమహారాజు భూమండలాన్ని పరిపాలిస్తున్నపుడు ప్రజల ఆరోగ్యానికై ఓషదులను సాధించుటకు భూదేవిపై బాణము సందిచెను. దానికి భూదేవి ప్రత్యక్షమై ఓ రాజా నీ మనోభీష్టము తప్పక తీరగలదు. అని ఒక కామదేనువును ఆయనకు ప్రసాదించెను. తన కోరిక తెల్పిన రాజుకు ఔషదులతో కూడిన క్షీర ధారలను ప్రసాదించెను. అలా ప్రవహించిన ధారల ప్రవాహం పోను పోను విస్తరించుకొని నదిగా రూపాంతరం చెందినది. దానిలో స్నానం చేసినా, సేవించినా సకల రోగభాదలు తొలగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిరి. 
 


ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నానేక  గ్రామాలలో నత్తారామెశ్వరం, జుత్తిగ, మల్లిపూడి లాంటి చరిత్ర కలిగిన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉత్సవాలు జరిగినపుడు (గతంలో) వేలాది మంది భక్తులు కార్తీక, మాఘ మాసాల్లో తమ విశ్వాసానికి అనుగుణంగా స్నానాలు ఆచరించే వారు. దీంతో పాటు పంట సాగుచేయడానికి వేలాది ఎకరాలకు నీరు కూడా అందించేది. వేసవిలో పశువులకు త్రాగునీరు అవసరాన్ని తీర్చేది. ఇంకా గత చరిత్ర తెలుసుకుంటే ఈ గోస్తనీ నదిలో ఇసుక రవాణా చేస్తూ పడవలు తిరిగేవని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు.

అటువంటి చరిత్ర కలిగిన గోస్తనీ నదిలో ప్రస్తుతం మురుగునీరు ప్రవహిస్తూ విషపూరితంగా మారిపోయింది. దీనికి తోడు సత్యవాడ డ్రయిన్‌ చివటం, తేతలి, పైడిపర్రు, మండపాక మీదుగా రేలంగి వద్ద (వేల్పూరు శివారు) గోస్తనీలో కలుస్తోంది. దీంతో మరింత మురుగునీరు వచ్చి కలిసి మరింత కాలుష్యం పెంచుతోంది.

Thursday, April 14, 2016

శ్రేష్టమైన మామిడి తాండ్ర

మామిడి తాండ్ర''' అనేది ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యంపొందిన తీపి మిఠాయి.  పదార్దంలో మామిడి తాండ్ర ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని మామిడి పండు రసం నుండి తయారుచేస్తారు. పొరలు పొరలుగా ఉండి పులుపు, తీపి]సమ్మేళనంతో అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర.

మొన్న వాడపల్లి వెంకన్నను దర్శించుకోడానికి వెళ్ళి అలా గోదారి గట్టంటా ఆత్రేయపురం వెళితే మామిమిడి తాండ్ర కథా కమామిషు బయటపడింది. వివరాల్లోకి వెళితే 

దీని తయారీ విధానం ఇలా ఉంటుందిట


* శ్రేష్టమైన మామిడి తాండ్ర తయారీ కోసం కొన్ని రకాల జాతుల మామిడీ పళ్ళను మాత్రమే వాడుతారు. పుల్లైనన మామిడి తాంద్రకు పనికిరాదు.
* అలా సేకరించిన మామిడి పళ్ళను తొక్క తీసి మాగాయపచ్చడీకి తీసినట్టుగా పల్చని ముక్కలు తీసి టెంకలు పక్కన పెదతారు.
 
* మామిడి ముక్కలను పెద్ద గ్రైండర్లలో పోసి మెత్తగా ఆయేవరకూ తిప్పి ఆరసాన్ని పెద్ద బానలలో తీస్తారు.
* చెక్కర కలిపే ముందు కొందరు దానిని త్వరగా గడ్డకట్టేటందుకు నీళ్ళతో కలపి వేడి చేస్తారు. కొందరు గ్రైండింగ్ చేసేటపుడే చెక్కర కలిపి చేస్తారు.

* అలా వచ్చిన రసం పెద్ద పాత్రలలో బియ్యం జల్లెడలలో వేసి వడకడతారు
* వడకట్టిన రసం పెద్ద పాత్రలలోనే ఉంచి ఎండలో పెడతారు.
* పెద్ద అరపల మాదిరి తక్కువ ఎత్తులో పందిరి వేసి దానిపై చీరలు దుప్పట్లు వేసి వాటిమీద కొత్త తాటాకు చాపలు పరుస్తారు.
* పరిచిన చాపలను ఎత్తుపల్లాలు లేకుండా ఉండేలా రాళ్ళను పెట్టి చాపలపై నీళ్ళు కొడుతూ శుబ్రపరుస్తారు.
చాపలు శుబ్రపడి ఎండిన తరువాత వాటిమీద కొంచెం చిక్కబడిన రసం మద్యలో నుండి పోసుకు వెళతారు. చివరల వరకూ ఆఖరుగా పోస్తూ చేతులతో సరిచేస్తారు. చివరల వరకూ కారిపోకుండా చీరలను మడతపెట్టీ అడ్డుపెదతారు.
* మళ్లీ మళ్ళీ పొరలు పొరలుగా మామిడి రసం పోసుపోతారు. అది తగిన మందం అయినపుడు దాన్ని అనుకొన్న మరిమానంలో ముక్కలుగా కోస్తారు. వాటిని మైకా కవర్లలో పాకింగ్ చేసి అమ్మకానికి ఇస్తారు.

మామిడి తాండ్ర కేవలం ఎవరికి వారుగానే తయారు చేయం కాక కుటీర పరిశ్రమగా విస్తరించినది. మామిడి ఉత్పతి అదికంగా జరిగే తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్టణం జిల్ల, విజయనగరం జిల్లాలలో దీనిని బారీ ఎత్తున పెద్ద కళ్ళాలు(సిమెంటు చేయబడిన కాళీ స్థలం) లో తయారు చేస్తారు. ఈ విదంగా తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు.
Thursday, February 18, 2016

అంతర్వేది తీర్ధం-లాంచీ ప్రయాణం


అంతర్వేది తీర్ధం అంటే మాహా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు చించినాడ బ్రిడ్జి కట్టారు కనుక ఎక్కువ రాకపోకలు దానిపై నడుస్తున్నాయి కాని కొన్ని ఏళ్ల ముందు అది లేకపోవడం వలన నరసాపురం నుండి లాంచీల మీద వెళ్ళవలసి వచ్చేది.
రాత్రి గోదావరి నదిపై లాంచీ ప్రయాణం గమ్మత్తుగా ఉండేది.

 

భోజనం చేసి బయలుదేరి నరసాపురంకు  10, 11 గంటలకు వెళ్లి టికెట్ కోసం వలందర్ రేవులో క్యూలో నించుంటే గంట పట్టేది లాంచీ ఎక్కడానికి.  మరీ జనం ఎక్కువ ఉంటె సెకండ్ షో ఖర్చయిపోయేది. అప్పటికి జనం తగ్గుతారు కాబట్టి
తాటాకులతో వేసిన టెంపరరీ వంతెనల మీదుగా ఓఎన్ జీసీ పెద్ద పంట్లమీడకు దూకి -
ఒక్కో లాంచీ రాగానే లెక్క ప్రకారం ౩౦ మందిని ఎక్కిన్చగానే  లాంచీ ప్రయాణం మొదలయ్యేది. 
ఇక అప్పటి నుండి రాత్రి చలిలో గోదారిలో ప్రయాణం - మద్య మద్య ఎర్ర దీపాలను గుర్తులుగా పెట్టేవారు. ఎర్ర దీపాల కు అటు ప్రక్క వచ్చే లాంచీలు ఇటు ప్రక్క వెళ్ళేవి అలా వచ్చేలాన్చీలను లెక్కపెట్టుకొంటూ 
అటు లాంచీ వచ్చినప్పుడల్లా కెరటాలు రావడం మా లాంచీ ఊగిపోవడం, అందులో ఉన్న వాళ్లకు మా వాళ్ళు మా వాళ్లకు వాళ్ళు చేతులూపుతూ జనాల కేకలు అరుపులు అలా 2 గంటలు ప్రయాణం చేసేవాళ్ళం 
అక్కడి నుండి సముద్రమ దగ్గరకు చీకట్లో సగం రోడ్డు మిగతా సగం ఇసుకలో నడిచి చీకట్లో సముద్రం కనిపించగానే దాన్లోకి దూకి  గెంతులు. 
మెల్లగా తెల్లవారు వరకూ అలా కొట్టుకొని  
ఎర్ర ఎర్రని  సూర్యుడు పై పైకి పసుపు రాసుకొంటూ రావడం చూచేసి ఆయన తెల్ల తెల్లగా అయ్యేవరకూ ఉండి 
బట్టలు మార్చుకొని దేవాలయ దర్శనానికి వచ్చేవాళ్ళం


దర్శనం అయ్యాక దేవాలయ భోజన ప్రసాదం లేదా వేరు వేరు సంఘాల వారు నిర్వహించే అన్న సమారాధన భోజనమో చేసి తిరునాళ్ళలో పడితే సాయంత్రం అయ్యిపోయేది, 
ఇక అక్కడి నుండి అశ్వరూడాంభిక ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, వశిష్టాశ్రమం, గోదావరి సముద్ర సంగమం దానికి దగ్గరలో ఉన్న లైట్ హౌస్ ఇలా అన్నీ ఒక రౌండ్ వేసి -  మళ్ళీ తిరిగి లాంచీల రేవులో ఎదురు చూపులు, నరసాపురం నుండి బస్సులు - అదీ అంతర్వేది చాలా మందికి తెలిసిన కథ :)

Tuesday, January 19, 2016

పెళ్ళికూతురమ్మ చెరువు తిరునాళ్ళు

పెళ్ళికూతురమ్మ చెరువు పేరుతో ఒక చెరువు అక్కడొక ఆలయం, ఆలయంలో పెళికొడుకు పెళ్ళికూతురు ఇదీ ఇక్కడ ప్రత్యేకత . ఇది పశ్చిమగోదావరి జిల్లా దేవ గ్రామానికి సమీపంలో ఆచంట, పెనుగొండ మండలాల మద్య కల ఒక చెరువు. 

దీని అసలు పేరు పద్మనాభుని చెరువు. ఇక్కడ గ్రామం కాని ఇళ్ళు కాని లేవు. ఇదొక చేల మద్య ఉన్న పెద్ద దిబ్బ వంటి పెద్ద విశాల కాళీ ప్రాంతం ప్రక్కన ఒక పెద్ద చెరువు ఒక చిన్న చెరువులు మాత్రమే ఉన్నయి. ఈ దిబ్బను వ్యవసాయదారులు కళ్ళాలు వేసుకోవడానికి, పంట నూర్పులకు, ఇతర అవసరాలకు వాడుకొంటారు. 

అలాంటి ఈ దిబ్బ మద్య ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఆలయంలో దేవతలెవ్వరో అని చూస్తే నుదుట బాసికాలు, బుగ్గన చుక్క తదితర అలంకారాలతో ఇద్దరు వధూవరులు కూర్చొని దర్శనమిస్తారు. విచిత్రంగా ఉన్న ఈ అలయ చరిత్రలోకెళితే పెనుగొండ నుండి ఆచంట వెళ్ళే మట్టిరోడ్డు ఈ చెరువుల గుండా వెళుతుంది. 

అప్పట్లో కలిగిన వాళ్ళు పల్లకీల్లో వెళ్ళడం జరిగేది. అలా పెనుగొండలో కల వైశ్యుల ఆడపడుచు వివాహం జరిగిన పిదప ఆచంటకు పయనమై ఈ మార్గం గుండా వెళుతున్నపుడు వరుడు మూత్ర విసర్జన కొరకు దిగి పని పూర్తిఅయిన పిదప కాళ్ళు కడుక్కోడానికి చెరువులో దిగబోయినపుడు  పాము కాటు వేయడం జరిగింది.
 దాంతో అతడు చెరువులో పడి మృతి చెందటం గమనించి అందరూ పరుగెత్తి అత్డి వద్దకు వెళ్ళి పరీక్షించి మరణించినట్టుగా నిర్ధారించారు. అది విని పల్లకిలో ఉన్న పెళ్ళీకూతురు ఒకప్రక్కగా వెళ్ళి అదే చెరువులో దూకి అమెకూడా మృతి చెందినది. అలా ఆమె ప్రతివ్రతాధర్మ ఇష్టపూర్వక మరణానికి వారినిద్దరినీ అక్కడే సమాది చేసారు.


మునుపు సరిగా పంటలు పండక ఇబ్బందులు పడే వారైన రైతులకు అలా జరిగిన తరువాత సుభిక్షంగా పంటలు పండటం, సరియైన సమయానికి వర్షాలు కురవడం, చుట్టుప్రక్కల అందరికీ అనుకూలమైన పనులు జరుగుతూ వారు ఏ కార్యం తలపెట్టినా అవి నిర్విగ్నంగా జరగటం వంటివి జరిగేవట. ఇవన్నీ అక్కడ సమాధి చేయబడ్డ వధూవరుల వలనే అనే నమ్మకం బలపడి అక్కడ వారి మూర్తులను కొలువుతీర్చి పూజలు చేయడం జరుతూండేది.  అదే కాక ఏఇంట్లో వివాహం జరిగినా వివాహానంతరం వధూవరులను ఈ దేవాలయానికి తీసుకురావడం జరుతూంతుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా ఇక్కడ మొక్కుకొని చేయడం కూడా చేస్తుంటారు.
ఈ అలయానికి అటు ఆచంట నుండి ఉత్సవాలను నిర్వహించేందుకు వైశ్యప్రముఖులు వస్తారు. ఇటు పెనుగొండ నుండీ ఆలయ నిర్వహణ జరుగుతున్నది. వేరెక్కడో ఊరిలో ఉన్న ఈ ఆలయానికి  రెండు పట్టణాల నుండీ ఆలయానికి ధర్మకర్తలుగా, నిర్వహణ జరగటం విచిత్రం.


మునుపు చిన్న ఆలయం ఉందేది దానిని 1982 లో పెద్ద ఆలయంగా మార్చారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మొదలు మూడురోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ అవే చేల గట్ల మీద, చెరువు ప్రక్క దిబ్బలమీద తిరునాళ్ళు జరుగుతాయి. ఒకప్పుడు అక్కడికి చేరుకోవడానికి మట్టి రోడ్లే ఉండేవి. ఇపుడు దగ్గరవరకూ కంకర రోడ్లు ఉన్నాయి, ఆచంట, మార్టేరులను కలిపేలా చెరువుకు కొద్ది దూరంగా తారురోడ్డు నిర్మించారు. సంక్రాంతికి పల్లెల మద్య జరిగే ఈ తీర్ధం, కోడి పందాలు, గుండాటలు, చూడటానికి వేల మంది వస్తుంటారు

Tuesday, January 5, 2016

వెంకటాపూర్ వెంకటేశ్వర దేవస్థానం

 
కోరుట్ల మండలం వెంకటాపూర్ లో కల వెంకటేశ్వర దేవస్థానం. బంగారు పని చేసి జీవించే భోజి వెంకయ్య నరసమాంబ దంపతులకు కలలో వేంకటేశ్వరుడు కనబడి ఇక్కడున్నట్టుగా చెప్పడం వలన ఏర్పడిన దేవాలాయం. తదనంతరం అదే గ్రామ నామంగా స్థిరపడింది
వెంకటాపూర్ కోరుట్ల మండలంలోని ఒక చిన్న పల్లెటూరు. వ్యవసాయ ఆధారిత గ్రామం. గ్రామానికి పేరు రావడం వెనుక ఒక చిత్రమైన కథ ఉంది. కోరుట్ల కేంద్రంగా అక్కడక్కడ కొన్ని కుటుంబాలు నివసిస్తుండే ప్రాంతం. ఆయా కుటుంబాలు కొద్దిగానే ఉండటం వలన వాటికి అప్పటికి పేర్లు ఏర్పడని సమయంలో గ్రామానికి సమీపంలో కల కొండ ప్రక్కగా నడక దారులు ఉండేవి. వాటి ప్రక్కగా చుట్టుప్రక్కల వారు కోరుట్లకు ప్రయాణం సాగించేవారు. బంగారం పని చేసుకొని జీవించే వ్యాపారి బోజి నరసయ్య భార్యతో ఆ సమీపంలో నివసిస్తూ కోరుట్లకు వ్యాపార నిమిత్తం వెళ్ళి కొద్ది రోజులుండి వస్తుండేవాడు. 
 
 అలా ప్రయాణిస్తూ విశ్రాంతి నిమిత్తం కొండలలోఉండే గుహలాంటి బాగాల్లో కాసేపు పడుకొనేవారు. అలా పడుకున్న వారికి ఒకసారి కలలో వెంకటేశ్వరుడు కనబడి పైన గుహలో ఉన్నట్టుగా చేప్పడంతో వెదుకుతూ వెళ్ళగా పైన ఉన్న గుహలో శంఖ చక్రాలతో వెంకటేశ్వరుని ప్రతిమ కనబడింది. దానిని చుట్టుప్రక్కల నివసించేవారికి తెలియపరచిన ఆ జంట ఆ ఆలయ నిర్మాణానికి కృషిచేస్తూ అక్కడే పరమపదించారు. అలా వెంకటేశ్వరుని కనుగొన్న తరువాత అక్కడి ప్రాంతం ఎక్కువ కుటుంబాల నివాసంగా మారటం దానికి వెంకటాపురం అని ఏర్పడటం తరువాత వెంకటాపూర్ అని స్థిరపడటం జరిగాయి. ఇది అక్కడ కల చిత్రాల ఆధారంగా, స్థానికుల కథనాల ద్వారా తెలిసిన చరిత్ర

Wednesday, December 30, 2015

ఫేస్‌బుక్ - ప్రీ బేసిక్స్

ప్రీ బేసిక్స్ - ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఫేస్‌బుక్ వాడని వారున్నారా అనే విధంగా విస్తృత వ్యాపి పొందిన ఫేస్‌బుక్ నెట్ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటే, ఇక చెప్పనక్కరనేలేదు. వాళ్ళూ వీళ్ళూ అని కాక అందరూ ఎడాపెడా వాడేయగలుగుతారు. ఇలా ఫ్రీగా ఇవ్వడం బాగుందనుకుని పొలోమని ఫ్రీబేసిస్ కొరకు మెసేజ్‌లు పెట్టుకొంటూ పోతే ఆనక మొత్తంగా వట్టిపోతాం. వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు మనం వాడేసుకొంటాం ఇంకేంటి సమస్య అంటే చాలా సమస్యలు ఉన్నాయి.
* ప్రకటనలు ఇప్పుడు వేలలో ఉంతే అవి లక్షల్లో ఉండచ్చు, వాటి వీక్షణ ద్వారా వాళ్ళు ఉచితానికి పెట్టే దానికి డబల్ త్రిబుల్ ఇన్‌కం లాగుతారు.
* పోటీ తత్వం నసించి నీరసించి పోయి ఇతర సైట్‌లు చాలా కనుమరుగైపోతాయి.
* బాగా డబ్బున్న కంపెనీల ఆధిపత్యం ద్వారా అంతర్జాలాన్ని కూడా కార్పోరేట్ సంస్థల మాదిరి తయారుచేస్తారు.
* ఇదో జాడ్యంలా మారి నెటిజన్ల సృజనకు అగాధంలా మారుతుంది.

* పిచ్చి పీక్స్‌కెళ్ళడం అనే మాట, లేదా వదిలించుకోలేని దురలవాట్ల సరసన ఫేస్బుక్ కూడా చేరుతుంది.
* యువతలో పని తత్వం తగ్గి పనికిమాలిన చాటింగ్ ద్వారా విలువైన జీవితకాలాన్ని కోల్పోతారు
ఉచితం ఉచితం అని మన రాజకీయనాయకులు చేతికి ఎముకలేని గొప్పోళ్ళ మాదిరి మన డబ్బుని వెదజల్లి మనలను వెదవలను చేస్తుంటే, వాటిని చూసి మనం పొంగిపోతూ మన వెనుక తాటాకులను మర్చిపోతున్నాం - తెల్ల వాళ్ళు అలాంటి పనులు చేయడంలో మనకన్నా బాగా ముందున్నారు

Wednesday, December 9, 2015

బాణభట్టు

కాదంబరి అనే అద్భుతమైన కావ్య రచన చేసిన కవి బాణభట్టు  ప్రాచీన భారతదేశపు ప్రముఖ సంస్కృత పండితుడు. సంస్కృ కవులలో ముఖ్యంగా సంస్కృతాన గద్య కవులలో బాణునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి  కారణం బాణుడు మొట్టమొదటి చారిత్రక కావ్య రచయిత, మొట్టమొదటి స్వీయ చరిత్ర నిర్మాత కావడం వలన. పదమూడు శతాబ్ధాలుగా వాజ్మయ రచయితగా అత్యున్నత స్థానంలో ఉన్నాడు.
వత్స గోత్రీకుడైన బాణుడు బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలో సోణా (సౌన్) నదీ తీరంలో ఉన్న పృధుకూట గ్రామంలో జన్మించాడు. ఊ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికూటగా పిలుస్తున్నారు. ఈయన తలిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే నడిచింది. తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణీంచుట వలన దేశ సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారంలో అనేకమంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యాపద్దతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకొన్నాడు.

బాణుడు కామ, అర్ధ, రాజనీతి, అలంకార శాస్త్రాలను అభ్యసించాడు. అతడి ప్రతిభా విశేషాలను విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతడిని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వనించాడు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వారికి వినిపించాడు. దానికి సంతసించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని కానుకలుగా సమర్పించాడని ఒక కథనం.

బాణుణి కాలం హర్షవర్ధనుని కాలంలో కనుక క్రీ.శ. 606 నుండి 648 వరకూ ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా.  బాణుడు హర్షచరిత్రతోపాటు కాదంబరిని కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేసాడు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కదా వస్తువుగా తీసుకోవడమనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమనుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణభట్టు పూర్తిచేసాడు. ఇతడిని ఇంకా పుళింద,పుళింద్ర  పేర్లతో పిలుస్తారు. అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తిచేసి పండితుల ప్రసంసలు పొందాడు.
సంస్కృత మూలంగా కల కాధంబరిని తెనుగులో
పేరాల భరతశర్మ గారు తన సిధ్ధాంత గ్రంధంలో మొత్తం కాదంబరి కధను చక్కని శైలిలో తెనించారు. అని హరిబాబు గారు పేర్కొన్నారు. అది ఎవరికైనా లభ్యత ఉంటె తెలియచేయగలరు.

Thursday, November 19, 2015

వాహన చోదకులారా జర భద్రం

ఎన్నో వాహనాలు వేగంగా వెళ్ళే రహదారుల ప్రక్క నివాసాలు ఉండే వారికి ఎందుకు భయం ఉండదు. అన్నీ రోడ్లమీదే చేస్తుంటారు. అటూ ఇటూ చూడటం వంటివి కూడా ఉండవు.
పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే
మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్కనే
వాహనాల వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి, రోడ్లప్రక్కన నివసించే ప్రజలు కాదు అనేది రూల్ అని అనుకుంటారా
ఇవన్నీ ప్రక్కన పెట్టినా ఏదైనా ప్రమాదం జరిగినా అదీ వాళ్ళ పొరపాటుగానే అయినా అక్కడ జరిగే సీన్ వర్ణించలేము.
పొరపాట్లు, పరిస్థితులు, ఏమీ ఉండవు.  - ఏకపక్ష నిర్ణయం - బండి వాడిదే తప్పు - వాడిని అర్జెంటుగా అడ్డంగా పట్టుకొని తన్నేసి ఆనక తీరిగ్గా విచారించి డబ్బు అయితే డబ్బు, కేసయితే కేస్
కనుక వాహన చోదకులారా జర భద్రం  :)
మీరే అక్కడ ఉంటె అందరిలా కాక  కొద్దిగా ఆలోచించండి - మందలో మనం ఒకరుగా కాదు

Monday, November 9, 2015

ఆన్లైన్లో కొనుగోళ్ళా

అమెజాన్, ఈబే, ప్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ కొనుగోళ్లలో కొన్ని సార్లు బావున్నా కొన్ని సార్లు బాగా ఉండదు. ఇటీవలి నా అనుభవం - Envent Deejay Knight - 2.1 Bluetooth Multimedia Speaker తీసుకొన్నాను. మొదటిది బాగానే వచ్చింది. అది బావుందని మళ్ళీ ఆర్డర్ చేసాను అది చచ్చింది. కొద్దిఎక్కువగా  డామేజ్ అయ్యింది. అయితే బాగానే పలికేస్తుంది, పాడేస్తుంది. సరే రీప్లేస్ కొరకు అడిగితె అమెజాన్ వాడు పది దినాల్లో వెనక్కు పంపు వంద రూపాయలు పోస్టల్ చార్జీలకు మీ ఎకౌంట్ కు చేర్చుతాను అని ఇచ్చాడు. సరే అని పోస్టాఫీసుకు వెళితే దాని బరువుకు సుమారు 500 అయ్యిద్ది అన్నాడు. సరే కొరియర్ వాడిని అడిగితె వాడో 400 అవ్వుద్ది అన్నాడు. దీనికంటే దీనిని రిపేర్ చేయిన్చుకొంటే బెటరేమో అనిపించింది.   ఒకవేళ పది దినాల్లో వెనక్కు వెళ్ళకపోతే ఇక ఆ శాల్తీలు గాల్లో కలసి పోతాయోమో, ఇక అప్పటి నుండి మళ్ళీ అమెజాన్ తో వార్, కస్టమర్ కేర్తో బేకార్ - అందువలన పెద్ద సామాన్లు కొనాలంటే ఆన్లైన్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని నా నిచ్చితాభిప్రాయము