Tuesday, September 8, 2015

సద్గురు మళయాళ స్వామి

                అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మళయాళ స్వామి, స్ర్తీలు కూడా దీక్షలు తీసుకోవచని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని.
               మలయాళ స్వామి తలిదండ్రులు కరియప్ప, నొత్తియమ్మ దంపతులు. కేరళలోని తిరువాయుర్ సమీపంలో 29-3-1885 వ తేదీన జన్మించారు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాదువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు.
చిన్నతనం నుండి అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం. జాలి దయ ఎక్కువగా ఉంటం. ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం. ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడు ధ్యానంలో ఉండటం చేసేవాడు చిన్నప్పటి నుండి ఆంగ్లం చదవటం ఇష్టం ఉండేది కాదు. దానికి బదులు సంస్కృతం నేర్వటానికి వెళ్లిపోయేవాడు

సన్యాస జీవితం ప్రారంభం

          తిరువంత పురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. ఆయన సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్ధులకు విద్యాబోధన చేసేవాడు.
వేళప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలపై సాదన చేసాడు. నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు ద్వారా పొంది. తురుగు పయనమైనాడు. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తల్లికి సేవలు చేసి నయం చేశాడు. వివాహం కొరకు అడిగితే తాను దేశాటన చేయాలని తిరస్కరించాడు .
వేళప్ప కాళి నడకతో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు. అలా తిరుతున్నపుడు అనారోగ్యంతో ఒక వార్ం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు స్వప్నంలో ఎవరో నోట్లో మత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం మరి దరిచేరలేదు.

తిరుమల సందర్శన

                  అనేక పుణ్య్క్షేత్రాలను దర్శించిన అనంతరం చివరగా ఆయన తిరుమలలోని గోగర్భం చేరారు. ఆ ప్రదేశం ఆయనకు నచ్చడం, అది తప్పసుకు అనుకూలంగా ఉందని భావించి కొంత కాల్ం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన నాటికి తండ్రి కాలషర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరారు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు. ఆయన బాష, వేషం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని అందరూ పిలిచే వారు. అదే తరువాత స్థిర నామంగా మారింది.
               మైసూరు తిరువెంకటాచార్యుడు అనే అతడు వెంకటేశ్వర పూజ చేసి రోజూ ప్రసాదం ఇచ్చి వెళ్ళేవాడు. తరువాత కొందరు భక్తులు రోజూ ఆయనకు ప్రసాదం అందిచేవారు.

ఆయన ద్వారా జరిగినట్టుగా చెప్పే కొన్ని లీలా విశేషాలు

  • తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు.
  • ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి ఒక వేటకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు.
  • తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకసనంద తీర్ధం నుండి, తుంబురు తీర్దానికి వెళ్లారు. భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు. ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఆహారం అందించాడు.
  • ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు.
  • వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం ఇచ్చే ఏర్పాటు చేశారు.
  • కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు.
  • తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు

వ్యాసాశ్రమం

              తిరుమల విడిచి ఏర్పేడు దగ్గర  కాశీ బుగ్గ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. కాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు. వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి, పంటలు పండించారు. జంతుబలి మాన్పించారు. ’’యదార్ధ భారతి ‘’ అనే పత్రికనుస్థాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు. అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది. కేరళలో నారాయణగురు గారు ఏమి బోధించారో, వ్యాసాశ్రమంలో అవన్నీ అమలు పర్ఛడానికి ప్రయత్నించారు.

సేవా కార్యక్రమాలు

  • బందరులో పట్టాభి సీతారామయ్య గారింట్లో గాంధీజీని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు. దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .
  • 1937లో ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలకూ, ఇతర కులాల వారికి భోదలు చేసారు.
  • 1943లో శివగిరిలో జ్ఞానయజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధలు చేసారు
  • 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు.
  • 1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసినపుడు వేలాది మంది పంచములు పాల్గొన్నారు.
  • వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించారు
12-7-1962 లో మళయాళ స్వామి కైవల్యం పొందారు. వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి. విద్యాప్రకాశానంద స్వామివారు ఈ ఆశ్రమాదిపతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరైనారు. వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అనిపిస్తుంది. ఇప్పుడు విద్యానందగిరి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు మళయాళ స్వామి

Thursday, September 3, 2015

గ్రంథాలయ సంఘం స్థాపన, అభివృద్ధి పరిణామం

తొలి గ్రంథాలయం

ఆంధ్రదేశంలో తొలి పౌర గ్రంథాలయాన్ని శ్రీ మంతిన ఆదినారాయణమూర్తి అనే ప్రాధమికోపాధ్యాయుడు 1886 వ సంuలో విశాఖపట్టణంలో నెలకొల్పినట్లు తెలుస్తుంది. ప్రారంభంలో ఒకరి ప్రోత్సాహంతోకాక ఎవరికివారు సంకల్పించుకొని, ఎక్కడికక్కడ కొన్ని గ్రంథాలయాలను నెలకొల్పారు. ఇలా 1905 నాటికి తెలుగునాట 20 గ్రంథాలయాలు లెక్కకు వచ్చాయి. అప్పట్లో వీరేశలింగం పంతులుగారి సంఘసంస్కరణోద్యమం, ఆంధ్రదేశంలో గొప్ప సంచలనాన్ని కలిగించిన వందేమాతరోద్యమం మనవారికి మాతృభాషపై అభిమానాన్ని పురికొల్పింది. తత్ఫలితం - పుస్తకాలు, పత్రికలు విరివిగా వెలువడ్డాయి. ఇవి కూడా గ్రంథాలయాల స్థాపనకు దోహదం చేశాయి. క్రమంగా గ్రంథాలయాల సంఖ్య పెరిగింది.

మొదటి గ్రంథాలయ మహాసభ సంఘస్థాపన

1914 లో బెజవాడలోని రామమోహన ధర్మ పుస్తక భాండాగార కార్యకర్తలకు దేశంలోని గ్రంథాలయ నిర్వాహకులందరిని సమావేశ పరచాలనే చక్కని ఆలోచన కలిగింది. ఏప్రియల్ 10 వతేదీన బెజవాడలో ప్రధమ ఆంధ్రదేశ గ్రంథభాండాగారుల మహాసభను చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
మహా సభ నిర్వహణతోనే ఆంధ్ర గ్రంథాలయోద్యమం - ఆంధ్ర గ్రంథాలయ సంఘం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ చరిత్రే ఆంధ్ర గ్రంథాలయోద్యమం. ఉద్యమ ప్రచారానికి ప్రజలను ఉత్తేజ పరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మహనీయులతో మహా సభలు జరిగాయి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహా సభలు 40 జరిగాయి. ఇవి కాక మరెన్నో జిల్లా, తాలూకా మండలస్థాయి సభలు నిర్వహించారు. ప్రత్యేక సందర్భాల అవసరాన్ని బట్టి మరికొన్ని జరిపారు.
ఈ మహాసభకు గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ గుంటూరు, నెలూరు, కడప, కర్నూలు, బళ్ళారిజిల్లా, హైదరాబాదు సంస్థానంలోని సుమారు 60 గ్రంథాలయాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

కార్యవర్గం, సహాయకులు

శ్రీఅయ్యంకి వెంకట రమణయ్య, సూరి వెంకట నరసింహశాస్త్రి గార్లు మొదటగా ఆంధ్రప్రదేశ గ్రంథభాండాగార సంఘమును స్థాపించారు. తరువాత ఇది ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మారింది. ఈ సభలో సంఘ తొలి అధ్యక్షులుగా శ్రీమోచర్ల రామచంద్రరావు పంతులుగారిని , శ్రీయుతులు అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావుగారలను ప్రథమ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

పత్రిక ఏర్పాటు

గ్రంథాలయోద్యమాభివృద్ధి కోసం గ్రంథాలయ సంఘం నిర్వహించిన కార్యక్రమాలలో పత్రికాప్రచురణ ఒకటి. సంఘ కార్యకర్తలు దేశంలోని వివిధ పత్రికలలో ప్రచురిస్తున్న వ్యాసాలతో తృప్తి చెందక ఉద్యమవ్యాప్తికి ప్రత్యేక పత్రికను నడుపుటకు నిశ్చయించి గ్రంథాలయ సర్వస్వం పత్రికను 1915 వ సం.లో త్రైమాసిక పత్రికగా ప్రారంభించారు. రెండు సంవత్సరముల తరువాత ద్వైమాస పత్రికగా మార్చారు. 1921 సం. లో దీని ప్రచురణ నిలిచిపోయింది.
తొలి సంపుటాలలో గ్రంథాలయాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలతో పాటు బాలభటోద్యమ విషయాలు, సాహిత్య చర్చలు, ఆధునిక కవుల పద్యములు, గేయములు, మరెన్నో వైజ్ఞానిక రచనలు, అన్ని విషయములకు సంబంధించి వెలువడేవి. 1928 వ సం పునరుద్ధరించబడి, 1980-83 మధ్య కాలంలో 4 సంవత్సరములు ఆగిపోయి, తిరిగి 1934 లో ప్రారంభమై మొత్తం మిద 11 సంపుటములను పూర్తి చేసుకొంది. ఈ సంపుటములలో గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన అంశములతోపాటు గ్రంథ సమిక్షలను కూడా చేర్చారు.

1938 లో సంఘ నిర్వహణ బాధ్యత నుండి అయ్యంకి తప్పకున్న తరువాత 1939 సెప్టెంబరు 1941 అక్టోబరుల మధ్య కాలంలో సంవు పత్రిక ఆంధ్రగ్రంథాలయం" పేరుతో ఆంధ్రాంగ్ల భాషలలో త్రైమాసికగా నిర్వహించారు. ఆంగ్లంలో కూడా ఉండటం వలన దీని ప్రచారం బయట రాష్ట్రాలకు, ఖండాంతరాలకు కూడా ప్రాకినది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కాగితం కరువు ఏర్పడడంతో, కేంద్ర ప్రభుత్వం నెలకు పైబడిన వాయిదాలతో ప్రచురించు పత్రికలను నిలిపి వేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులతో 'ఆంధ్రగ్రంథాలయం ప్రచురణ నిలిచి పోయింది. దీనితో తెనాలి తాలూకా పెదపాలెం, అనంతపురం జిల్లా హిందూపురంలో వరుసగా జరిగిన 23, 24 ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభల సంచికలను పత్రికకు బదులుగా ప్రచురించారు. పరిస్థితులు అనుకూలించిన అనంతరం సంఘ స్థాపకులు అయ్యంకి వారి అభీష్టానుసారం గ్రంథాలయ సర్వస్వమును అదే పేరుతో 1948 జనవరిలో పునరుద్ధరించి 12వ సంపుటంగా ప్రారంభించారు. అప్పటి నుండి ఇది క్రమంగా నడుస్తుంది. ప్రస్తుతం 74వ సంపుటం వెలువడుతోంది.

ప్రచురణలు

  • ఉద్యమ ప్రారంభ దినాలలో గ్రంథాలయ సంఘ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించిన శ్రీ సూరి వెంకట నరసింహశాస్త్రిగారు గ్రంథాలయోద్యమాన్ని గురించి వివిధ పత్రికలలో ప్రచురించిన ఆంగ్ల వ్యాసముల సంపుటి "Library Movement in India" ను, తెలుగు పత్రికలలో వెలువడిన శ్రీ యాతగిరి లక్ష్మీ వెంకటరమణగారి వ్యాసాలను "గ్రంథాలయోద్యమము" శీర్షికతోను గ్రంథాలయ సంఘం ప్రచురించింది.
  • 1915, 1916 సం.లలో అప్పటికి దేశంలో పనిచేస్తున్న గ్రంథాలయాల చరిత్రను వెలువరించారు. కొన్ని సంవత్సరాల పాటు సంఘ వార్షిక నివేదికలు, గ్రంథాలయ మహాసభల సంచికలు, ఉద్యమ వ్యాప్తికి దోహదపడే పలు గ్రంథాలు, గ్రంథాలయ నిర్వహణకవసరమైన వివిధ పట్టికలను ప్రచురించారు. సంఘ స్థాపకులు అయ్యంకివారి షష్టిపూర్తిని పురస్కరించుకొని ఐదు చిరుపాత్తములు, సంఘాధ్యక్షులు గాడిచెర్ల వారి షష్టిపూర్తి సమయంలో ఆరు గ్రంథములు, స్వర్ణోత్సవాల సందర్భంలో గ్రంథాలయ ప్రగతి-3 భాగములు సంఘం ప్రచురించింది.
  • గ్రంథాలయములు, వయోజన విద్యకు సంబంధించిన పుస్తకములతోపాటు డా. కట్టమంచి రామలింగారెడ్డిగారి "ముసలమ్మ మరణం", శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి "తెలుగు నుడి దండలు", ఆంధ్రగ్రంథములు మొదటి జాబితా, ఆంధ్రవాజ్మయ సంగ్రహ సూచిక, శ్రీ సర్వోత్తమ జీవితము వంటి పుస్తకాలెన్నింటినో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురించింది.

మహాసభలు

గ్రంథాలయ సంఘం ద్వారా పలు సభలు సమావేశాలు నడిచాయి. 1919లో అయ్యంకి ప్రభృతులు ప్రథమ అఖిల భారత మహా సభను నిర్వహించారు. భారత వైజ్ఞానిక మంత్రిత్వశాఖ లాహోర్లో నిర్వహించిన పౌర గ్రంథాలయ సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అర్హులంటూ హాజరు కావాలకున్న మన ప్రతినిధులను నిరాకరించింది. దానితో ప్రజల ప్రాతినిధ్యం లేని సదస్సులు నిష్ఫలమని భావించి 1919 నవంబరు 1 న మద్రాసు గోఖలే హాలులో తొలి జాతీయ గ్రంథాలయ సదస్సును అపూర్వంగా నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుండి గ్రంథాలయ రంగప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులోనే అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘం ఏర్పడింది.
అనంతరం 1968 లో భారత గ్రంథాలయ సంఘం అభ్యర్థన మేరకు పైన మహాసభ జరిగిన రోజు నవంబరు 14 నుండి వారం రోజులపాటు గ్రంథాలయ వారోత్సవాలుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. 1996 లో భారతీయ గ్రంథాలయ సంఘ 41 వ జాతీయ సదస్సును మూడు రోజుల పాటు విజయవాడలో నిర్వహించారు.

గ్రంథాలయ శిక్షణ

గ్రంథాలయ కార్యక్రమం సవ్యంగా సాగడానికి గ్రంథాలయ శిక్షణ అవసరమని గుర్తించిన సంఘం 1920 వ సం. వేసవిలో మొట్టమొదట 20 మంది గ్రంథాలయ సేవకులకు బెజవాడలో ఒక నెల రోజులపాటు శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో గ్రంథాలయ నిర్వహణ పాఠాలతోపాటు రాజకీయము, అర్థశాస్త్రము, సాంఘిక సేవ మొదలగు విషయాలను బోధించేవారు.
రెండవసారి 1984 జూన్లో 80 మంది అభ్యర్థులకు శిక్షణనిచ్చారు. ఈ బ్యాచ్‌లో గ్రంథాలయ శాస్త్ర పితామహ రంగనాధ్‌గారి శిష్యులు పుణ్యమూర్తుల రాజశేఖరం, కొఠారి రామారావుగారు బోధించారు. 30 మంది విద్యార్ధులలో వావిలాల'గోపాల కృష్ణయ్య, పాతూరి నాగభూషణం, కలిదిండి నరసింహరాజ వంటి ఉద్దండులు శిక్షణ పొందారు. తదుపరి ఈ బాధ్యతను తన భుజస్కందాలపైకెత్తుకున్నారు పాతూరి నాగభూషణం. 1941 మే నెలలో బెజవాడలోని పటమట అచ్చయ్య ధర్మ గ్రంథాలయంలో గాడిచర్లవారి సారధ్యంలో నిర్వహించారు శిక్షణ, మిగిలిన విషయాలతోపాటు తెలుగు, హిందీ, సంస్కృతవాఙ్మయముల చరిత్రలతోపాటు హిందీ భాషను కూడా నేర్పారు. తదుపరి వివిధ ప్రాంతాలలో ఈ శిక్షణ నిర్వహించారు. ఇలా శిక్షణ పొందినవారు తమతమ ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం, ఉన్నవాటిని పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు-తెలంగాణా, రాయలసీమల నుండేకాక జెంషెడ్పూరు నుండి కూడా వచ్చి శిక్షణ పొందారు.
తదుపరి 1966 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపుతో గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును (CLISC) నిర్వహిస్తున్నారు. దానికి అర్హత 10 వ తరగతి ఉతీర్ణులై ఉండటం. 4 మాసములు శిక్షణ, అనంతరం విద్యార్థుల అర్హతను ఇంటర్మీడియట్‌ వరకూ పెంచి శిక్షణా కాలాన్ని 5 నెలలుగా మార్చారు. ఆదిలో తెలుగు మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు నిర్వహింపబడేది. 1989 నుండి ఆంగ్ల మాధ్యమంలో కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం.

ఏడాదికి రెండుసార్లు - జూన్లో ఒకటి, డిశంబరు నెలలలో మరొకజట్టు నిర్వహిస్తున్నారు. శిక్షణానంతరం ప్రభుత్వ పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కమీషనర్ వారు పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. ఈ శిక్షణాలయ స్థాపకులు శ్రీ పాతూరి నాగభూషణంగారి మరణానంతరం వాబ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు.
విద్యార్థులకు గ్రంథాలయంలో సాంకేతిక శిక్షణలో భాగంగా గ్రంథాలయంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణతో పాటుగా M.S. Office, Newgen Libed లలో ప్రవేశం కల్పిస్తున్నారు.

Wednesday, August 26, 2015

పుస్తక ప్రపంచలో ముగ్గురు మరాఠీలు

           పుస్తక ప్రపంచం, దాంట్లో అనేకానేక గ్రంథాలయాలు విజ్ఞానాన్ని వెలుగులుగా వెదజల్లుతూ ప్రపంచ మానవాళి అభివృద్దికి మెట్లుగా మారాయి. తెలుగు పుస్తకప్రపంచంలోగ్రంథాలయాల ద్వారా వెలుగులు కురిపించి సుసంపన్న తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువ చేసిన  ముగ్గురు ప్రముఖులు - అయ్యంకి వెంకటరమణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణంగార్లు

           
స్వతంత్రానికి పూర్వమే గ్రంథాలయాల ప్రాముఖ్యత తెలిసిన మేధావులైన వీరు కేవలం ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే తొలిగా గ్రంథాలయ సంఘాన్ని 1914లో స్థాపించారు. దానితో పాటుగా 1915లో 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించారు. వీటి ద్వారా అనేక గ్రంథాలయాల స్థాపనకు పాటూ పడ్డారు. తరువాత 1924లో అదే సంఘం ద్వారా 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీరు కొంత కాలం విజయవాడ కేంద్రంగా బోట్ లైబ్రరీని కూడా నడిపించారు. ఆశక్తి కలిగేలా ప్రతి ఊరిలో సభలు కార్యక్రమాలు చేస్తూ గ్రంథాలయాల స్థాపనకు పాటుపడి ముందు తరాలకు విజ్ఞానాన్ని అందించడంలో వీరు ముగ్గురూ మరాఠీల్లాగే యుక్తి, శక్తి ప్రదర్శించారు.

అయ్యంకి వెంకటరమణయ్య గారు - తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో ఆగష్టు 7, 1890 సంవత్సరంలో జన్మించాడు.  వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.  శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక" ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919,నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంథాలయం" ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం" గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.


పాతూరి నాగభూషణం గారు1907 ఆగస్టు 20వ తేదీన గుంటూరు జిల్లా పెదపాలెం గ్రామంలో జన్మించాడు.  గ్రంథాలయ నిర్వహణ, వయోజన విద్యాబోధన విషయాలలో అధ్యయనం చేశాడు.  ప్రాథమిక విద్య అభ్యసించే రోజుల్లోనే ఇతడు తన గ్రామంలో బాలసరస్వతీ భండారము అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత గ్రంథాలయ భవనం నిర్మించి, వేలకొలది గ్రంథాలను సేకరించి చుట్టుపక్కల నలభై గ్రామాలకు అందుబాటులో ఉంచాడు. పెద వడ్లపూడి, దుగ్గిరాల గ్రామాలలో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పాడు. బ్యాంక్ కాలువ మీది ప్రయాణీకుల పడవలలో సంచార గ్రంథాలయాన్ని నడిపాడు.  గ్రంథాలయ మహాసభలను నిర్వహించాడు. గ్రంథాలయ విద్యలో శిక్షణనిచ్చి వాటి నిర్వహణకు కావలసిన కార్యకర్తలను సమకూర్చాడు. విజయవాడ పటమటలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, దాని ముద్రణాలయం ఇతని చేతులమీదుగా నిర్మించబడ్డాయి. ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగాను, గ్రంథాలయ సర్వస్వము పత్రికకు సంపాదకునిగాను, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌కు కౌన్సిల్ మెంబరుగాను పనిచేశాడు.


అయ్యదేవర కాళేశ్వరరావు గారు
- కృష్ణా జిల్లా నందిగామ లో 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు.  రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు.  మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.

రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

Tuesday, August 11, 2015

బోట్ లైబ్రరీ ( Boat Library )

గోదావరిలో బొట్ హాస్పిటల్ అనేది నడుస్తుండేది. గోదావరి పరివాహక ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన అది బాగా ప్రాచుర్యం పొందింది.
ఇది చాలామందికి తెలుసు,
అలా నడిచిన బోట్ లైబ్రరీ గురించి తెలుసా ?
                 విజయవాడలో ఈ బోట్ లైబ్రరీ నడిపారు. కృష్ణా బ్యాంక్ కాలువ మీదుగా పెదవడ్లపూడి నుండి కొల్లూరు వరకూ ఇది నడిచేది.
              పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యలో ఆర్యబాల సమాజంలో దీని ప్రార్ంభోత్సవానికి అంకురార్పణ చేయగా అటునుండి  సేవాశ్రమవాణీ మందిరం నుండి గ్రంథాల పెట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి పెద్ద బొట్ వంటి దానిలో అలంకరించారు. కాలువ వడ్డున సభ తీర్చి వక్తల ప్రశంగానంతరం గుంటూరు గ్రంథాలయ అద్యక్షులు శరణు రామస్వామి చౌదరి గారి చేతుల మీదుగా అక్టోబర్ 1935లో దీనిని ప్రారంబించారు.
అప్పటి నాయకులతో నిండి ఉన్న లాంచీ గ్రంథాలయము
 
              కాలువలో మెల్లగా పయనిస్తూ గ్రంథ పఠనం చేయడంలో మజా తెలియడం వలనో లేక గ్రంథాలయం వినూత్నంగా ఉండటం వలనో దీనికి విపరీతమైన ఆధరణ వచ్చింది.  బోట్ గ్రంథాలయానికి వస్తున్న ఆధరణ వలన  పెదవడ్లపూడి నుండి పిడపర్రు వరకూ మరొక గ్రంథాలయం ప్రారంభించాలని నిర్ణయించాలనుకొన్నారు. 
ఇలా రెండు బొట్ వంటి లాంచీల మీదుగా గ్రంథాలయాలను చాలా ఏళ్ళు నడిపిన ఘనత మన పెద్దలది.


Friday, August 7, 2015

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు

పక్కింటోడు పిల్లలను భాష్యంలో చదివిస్తాడు, ఎదురింటోడు నారాయణలో చదివిస్తాడు, స్నేహితుడి పిల్లల్ని  శ్రీ చైతన్య అంటాడు

ఎందుకో కోరి కోరి పిల్లలను జైళ్లకు పంపుతారు తల్లిదండ్రులు --
భావి భారత పౌరులను ఆరోగ్యంగా, ఆనందంగా, తెలివితేటలతో ఎదిగేలా చెయ్యండి

ఏడుపు మొహాలతో ఉండకుండా
అనారోగ్యంగా ఉండకుండా
బుర్ర చెడిపోకుండా 
మానసికంగా కుంగిపోకుండా
ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే
మరి మనం మనపిల్లల్ని ఎందులో చదివించాలి .....?

" ప్రభుత్వ పాటశాలలోనే"
మనం చదువుకున్నాం - ఆడుతూ పాడుతూ
వాళ్ళనూ అలాగే చడువుకోనిద్దాం - ఆడుతూ పాడుతూ

Tuesday, July 21, 2015

పుష్కరానుభావాలు

రాజమండ్రి పుష్కరాల రేవులో స్నానం అయిపోయింది . 
పెద్దగా క్యూలు గట్రా లేవు. అందరికీ త్వరగానే అయిపోతుంది.
సందు సందులో ఎందరో దాతలు
భోజనాలు పెట్టేవారు కొందరు.
పులిహోర పెట్టేవారు మరికొందరు
మజ్జిగ ఇచ్చేవారు ఎందరో
ఆల్మోస్ట్ అన్నీ పరవాలేదు.-- ఒక్క రెండు తప్ప --- అవే - ప్రయాణాలు, గోదారి నీళ్ళు
చిత్రం చూడండి.

బస్సులు, రైళ్ళులో  కష్టం, నదిలో నీళ్ళలో అయిష్టం
రాజమండ్రి నీళ్ళలో అయిష్టం గానే స్నానించాక  పోనీ కొద్దిగా పైకి వెళ్లి మునికూడలిలో మునకేస్తే బావుంటుందని వెళితే - రాజమందరి చాలా బెటర్ అనిపించింది. 
---
ఏదేమైనా  ఆచంట దగ్గర కోడేరో, భీమలాపురమో, యలమంచిలో, లక్ష్మీ పురమో ఇలా చిన్న రేవులలో స్నానమే సూపర్ అనిపించింది. హాయిగా ఎటి గట్టు దాకా నడిచే శ్రమ లేకుండా తిన్నగా రేవులో దిగచ్చు - మంది లేని తేటగా ఉన్న నీటిలో హాయిగా స్నానం చేయచ్చు

Monday, July 13, 2015

పుష్కర కష్టాలలో ప్రశాంత స్నానం

 
పుష్కరాలలో కష్టాలు అన్నిటినీ దాటి ప్రశాంతంగా స్నానమాచరించడం అసాద్యమే. అయితే అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేమంటే రాజమండ్రి కొవ్వూరుల్లో స్నానం సరదా తీరాలంటే కిలోమీటర్ నడిచి అల్లకల్లోలంగా ఉన్న ఆ మురుగు నీటిలో ఒకమునకేస్తే నిజ్జంగానే దేవుని దర్శనం జరిగి మతి పోతుంది. ఇక ఇటు నరసాపురం, సిద్దాంతం, కోటిపల్లి లాంటి బి గ్రేడ్ ఘాట్లలో పట్టుమని పది అడుగుల నీరు లేదు. ఇక మిగిలింది అంతర్వేది. అక్కడ స్నానం సరదా తీరినా బయటకొచ్చాక వళ్ళంతా ఉప్పుతో కంపరమెత్తిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మిత్రులకు కొన్ని సులభ, ప్రశాంత స్నానానికి చిట్కాలు
ధవళేశ్వరానికి దిగివ వేమగిరి ఉంది. అక్కడ దిగి హైవేమీద కడియం వైపుగా కొన్ని మీటర్లు నడిచొస్తే చిన్న దేవాలయాల ప్రక్కగా కాలువమీద వంతెన ఉంది. దానిమీదుగా అవతలివైపు వెళితే గోదావరి గట్టు దానికి ఆనుకొని ఒక మాదిరి రేవు ఉన్నాయి. ఇక్కడ పుష్కలంగా నీళ్ళుంటాయి. దూరంగా ధవళేశ్వరం బేరేజి కనిపిస్తూ ఉంటుంది
  
ధవలేశ్వరం చేపల మార్కెట్ ఎదురుగా పార్కులోకి మార్గం ఉంది దాని ప్రక్క నుండి గోదావరి గట్టు సిమెంట్ రోడ్డుగా మార్చారు. అక్కడ రాం పాదాల రేవులంత కాకున్నా రెండు ఓ మాదిరి రేవులున్నాయి. అక్కడకు బైక్‌లమీద హాపీగా వెళ్ళవచ్చు, నెమ్మదిగా స్నానం చేయవచ్చు.
  
పెరవలి మీద నుండి ధవళేశ్వరం వైపు హైవే మీదుగానే ఖండవల్లి చిన్న పల్లె, క్రిందకు దిగితే ఓ మాదిరి రేవు. నీళ్ళున్నాయి. 

పెరవలి హైవే మీదవెడమవైపు దిగి నిడదవోలు వెళ్లే రోడ్డులో 2 కిలో మీటర్లు వెళితే కాకరపర్రు, ప్రక్కన తీపర్రు రెండు రేవులు, కాకరపర్రు కొద్దిగా లోపలకు వెళ్ళాలి, ఆటోలు ఉన్నాయి. తీపర్రు రోడ్డుమీద నుండి నడిచే దూరంలో రేవు ఉంది 
ఇవన్నీ కార్లు బైకులు అందుబాటులో ఉన్న అందరూ ఉపయోగించుకొని మీ పుష్కర స్నానాన్ని పవిత్రంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు.

Wednesday, June 17, 2015

సృజనాత్మకత

ఒక మనిషిలోని సృజనాత్మకతను బయటపెట్టేవి అతడి వెనుక కల ఆస్తులో,పాస్తులో కాదు. అతడి బాష, నడవడిక, చేసేపనో కూడా కానే కావు. మిగిలిన కాళీ సమయాల్లో చేసే అసంపూర్ణ కార్యక్రమాలే.

వాటిని కొందరు హాబీ అనచ్చు లేదా పనికిమాలిన పనులనచ్చు, పైసా రాబడి రాదనవచ్చు ఎలా అన్నా అవే మనిషిలోని సృజనను తెలియచేసేవి


వాటిని సద్వినియోగం చేసుకొని కొందరు అద్భుతంగా డబ్బు సంపాదిస్తారు, కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు,  కొందరు అన్నీ పోగొట్టుకొని అడుక్కొనే స్థితికి వచ్చేస్తారు.



హాబీలతో కేవలం పేరు మాత్రమే సంపాదించేవాళ్ళు కొందరు, హాబీలతో డబ్బులు మాత్రమే సంపాదించేవాళ్ళు కొందరు, హాబీలను ప్రజా ప్రయోజనాలకు వాడేవాళ్ళు కొందరు, హాబీలను తెలివిగా డబ్బుగానూ, వ్యాపారంగానూ, పేరు ప్రఖ్యాతులుగానూ మార్చుకొనేవాళ్ళు మరికొందరు.

వీళ్ళలో ఎవరు ఆత్మ సంతృప్తి పొందేవాళ్ళు అంటే మాత్రం చెప్పటం కష్టం. కేవలం ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే తమ హాబీలను కొనసాగించేవాళ్ళు తమకు అవి ఉన్నట్టుగా ఎవరికీ తెలియాలనుకోరు. వాళ్ళు మాత్రమే వాటి ద్వారా ఆత్మానందం పొందుతారు.

Thursday, May 7, 2015

ఆంధ్ర సాహిత్య పరిషత్ - కాకినాడ ( ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE - KAKINADA)

ఆంధ్ర సాహిత్య పరిషత్ - ఇది కాకినాడలో ఒకప్పుడు అనేకానేక రచయితల, కవులకు ప్రియమైన ప్రదేశం. అలాంటి ఈ సంస్థ వేటలో -

కాకినాడ పట్టణంలో అడుగుపెడుతూ అడిగా రామారావు పేట ఎక్కడ అని. దానిని ఏ రామారావు పేట అనే ప్రశ్న జవాబుగానూ దానిపై ఇక్కడ రెండు రామారావు పేటలున్నాయి, ఏ రామారావు పేట, మామూలు రామారావు పేట. మీకే పేట కావాలి? - పైపుల చెరువుండే రామారవు పేట కావాలి - అయితే తిన్నగా వెళ్ళండి అన్నారు.
పైపుల చెరువు వెదుక్కుంటూ వెళ్ళి దారిలో చాలా మందిని అడిగా అంధ్ర సాహిత్య పరిషత్ అనే గ్రంథాలయం లేదా ప్రచురణాలయం ఎక్కడ అని. ఎవ్వరికీ తెలియదు అన్నారు. వెదుకుతూ వెళ్ళిన నాకు ఆ చెరువు ఒడ్డున చౌదరి గ్రంథాలయం కనిపించింది. దాన్లోకి వెళ్ళి రిషెప్షన్లో కనిపించిన ఆమెను అడిగా ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని. నాకు తెలీదు అని, ఎందుకు అని అడిగింది. ఏం లేదని అక్కడ చదువుకుంటున్న పెద్దలు కొందరిని చూసి వాళ్ళు పెద్దలు కనుక తెలిసి ఉండచ్చు అని వాళ్ళను అడిగా? ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎక్కడ అని - వాళ్ళు మొహమొహాలు చూసుకొని ఇక్కడ అటువంటిదేమీ లేదే అని తేల్చారు.


లైబ్రరీలో చదువుకుంటున్న ఆ చుట్టుపక్కల ఉండే పెద్దలకే తెలిసి ఉండకపోతే మరెవరికి తెలుస్తుంది. ఇక తప్పక నాకు దీని గురించి చెప్పిన సన్నిధానం నరసింహశర్మగారికి ఫోన్ చేసా. ఆయన చెప్పారు- మీరు సరిగ్గానే వెళ్ళారు, మీరు నిల్చున్న గర్ంథాలయం ఎదురు సందులో ఫైర్ సర్వీస్ ఉంటుంది, అదగితే ఎవరైనా చెపుతారు, దాని ప్రక్కనే ఉంది ఆంధ్ర సాహిత్య పరిషత్ అని. వాటే ట్రాజడీ అనుకుంటూ ఎదురుగా సందులోకి చూస్తే ఫైర్ సర్వీస్ ఆఫీస్, దానికో చిన్న ఎర్ర బోర్డ్, దాని ప్రక్కనే తాటికాయలంత  పేద్ద అక్షరాలతో రోడ్డు మీదకి బోర్డ్ ఉంది, ఆంధ్ర సాహిత్య పరిషత్ అని, హతవిధీ ఇంత పేద్ద అక్షరాల బోర్డే చూడలేకున్నారే ఇక్కడి వృద్ద మానవులూ అనుకుంటూ  లోనికి ప్రవెశించా....
ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రస్తుతం అది మ్యూజియంగా మార్పు చెందినది.


ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే 1911 మద్రాస్‌లో ఏర్పడింది. 8.4.1913 బ్రిటిష్ కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ది, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. పిఠాపురం మహారాజా వారి ఆధిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు.


సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947 లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల  దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది.


సాహిత్య పరిషత్ కేవలం ప్రచురణే కాక సుమారు 10,000 పుస్తకాలను భద్రపరచింది. తాటిఆకుల తాళపత్ర గ్రంథాలను సుమారుగా 4,776 వరకూ సేకరించి భద్రపరచింది.

1973 నుండి సాహిత్య పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు.  ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది. 1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.

 ఈ భవనంలో వస్తు ప్రదర్శన మరియు గ్రంథ ప్రదర్శనలే కాక వెనుక కల హాలులో కాకినాడ తదితర ప్రాంతాల కవులు, రచయితల కార్యక్రమాలు జరుగుతాయి. నెలలో ప్రతి మూడవ ఆదివారం ఇక్కడ కవి సంగమం జరుగుతుంది. ప్రముఖులు, కవులు, రచయితలు సాహిత్య అభిమానులు పాల్గొంటారు...

Tuesday, April 28, 2015

గ్రంథాలయ స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం

               నా ఎరుకలో ఒక లైబ్రరీ ద్వారా చదవేందుకు అవకాశం కల్పించడం కాక మహా అయితే ఒకటో రెండో కార్యక్రమాలు జరుగుతాయి... కాని నేను ఈ మద్య చూసిన ఒక గ్రంథాలయం స్వరూపం విష్ణుమూర్తి విశ్వరూపం మాదిరిగా అనేక రూపాలలో సేవలను అందించడం చూసా.....అదే వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం
                 భీమవరం పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుముదవల్లి గ్రామం పూర్వం నుండీ చాలా ముందు చూపు కలిగిన యువకులను కలిగి ఉండేదేమో అందుకే 1800 నుండి 1900 వరకూ బహుముఖాలుగా అక్కడి ప్రజలు అభివృద్దివైపు అడుగులు వేసారు.  మిగిలిన వారితో వేయించారు. అలాంటి వారిలో కొందరు- రాసి సిమెంట్ - బి.వి.రాజు, లార్స్‌విన్ గ్రూప్ -ఎస్.కృష్ణంరాజు, డెల్టా పేపర్మిల్స్ - భూపతిరాజు సూర్యనారాయణరాజు, డా.బి.హెచ్.సుబ్బరాజు వంటి వారు. ఇదంతా జరగటానికి కారణం వీరేశలింగ కవి సమాజ గ్రంథాలాయం. దీని ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది - అభివృద్ది చిత్రం

అక్షరాశ్యతా వ్యాప్తి - ఈ గ్రంథాలయం ద్వారా రాత్రి పాఠశాలల నిర్వహణ జరిగేది. ఎందరో ఈఊరి పెద్దలు ఈ పాఠశాల ద్వారా విద్యావంతులు అవడం జరిగింది.
స్త్రీ విద్య - ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్దతి ఉందేది. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంభందించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు.
హిందీ ప్రచారం - 1920 నుండి ఈ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు.
అసృశ్యతా నివారణ - సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి బృందం అంతరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
వైద్య సహాయం - ఊరిలో పేదవారికి వైద్య సహాయం అందాలనృ ఉద్దేశ్యంతో - 1911 నుండి ఊరిలో వైద్యం తెలిసిన ఘంటశాల నాగభూషణం గారి ఆద్వర్యంలో గ్రంథాలయవేదికగా వైద్య శిబిరాలు కొనసాగేవి, ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. (గ్రంథపాలకులుగా ప్రస్తుతం ఆర్.ఎం.పి పనిచేస్తున్నారు)
సహాకార పరపతి సంఘం - పల్లెలకు రైతులు వెన్నెముఖ అని నిరూపించదానికన్నట్టుగా గ్రంథాలయానికి అనుభందంగా సహకార సంఘం ఏర్పాటు చేసి రైతులకు స్వల్ప వడ్డేలకు రుణాలు ఇవ్వడం చేసారు.
జాతీయోజ్యమానికి సహాకారం - జాతీయ ఉద్యమాన్ని ప్రోత్సహించేందుకు ఈ గ్రంథాలాయం ద్వారా పలు కార్యక్రమాలు చేసేవారు. వీటిలో గ్రామ యువకులు పాల్గొనేవారు.
రాజపుత్ర సమాజ సేవా సమితి - క్షత్రియ కుటుంబాలలో వివాహ, ఇతర శుభకార్యక్రమాల సమయంలో ఆయా కుటుంభాల పెద్దల నుండి కొంత కట్నం సమాజాభివృద్దికి ఖర్చుచేయడం తిరుపతిరాజుగారి బృందం మొదలెట్టింది. దీనిని ఒక నిధిగా ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే వడ్డేని పేద విద్యార్ధులకు, ఇతర ఉపకారాలకు ఖర్చు పెట్టడం చేస్తున్నారు
స్త్రీ పునర్వివాహాలు - క్షత్రియ కుటుంభాలలో చాలా కాలం పునర్వివాహాలు ఉండేవి కవు, తిరుపతిరాజుగారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వాదాన్ని బలపర్చై 1934లో స్త్రీ పునర్వివాహ సమాజం ఏర్పరిచారు
పోస్టల్ సేవలు - చాలా కాలం కుముదవల్లిలో పోస్టాఫీసు లేదు. తిరుపతిరాజుగారి బృందం గ్రంథాలయంలోనే అసలు ధరకే పోస్తేజీని అందించేవారు.
ఇలా అనేకరకాలుగా ఈ గ్రంథాలయం ఊరికి విజ్ఞానాన్ని పంచడం అనేది ఒక విధంగా ఆ ఊరి ప్రజల అదృష్టమే...