Thursday, November 15, 2012

బుడుగు, పిడుగు

           "ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడుగు. ... ఇంకో అస్సలుపేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు"

        ఇది బుడుగు పరిచయం. బుడుగు గురించి తెలియని తెలుగు వారు తక్కువ. ఎందువలన అంటే ఆ పుస్తకం అంత ఫేమస్. బాపు గారి బొమ్మల కారణంగా అది మరింత ఫేమస్ అయ్యి అయ్యి అయ్యి  బుడుగు కాస్తా పిడుగయ్యాడు.
బుడుగు ఆలోచనలు  అనంతం. అవి మనకు అందవు. అలాటి కూని చూడండి.
  • నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు.
  • సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి...
  • అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
  • ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్బలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్ధం అట. ఇలా అని బాబాయి చెప్పాడు.
  • డికేష్టివురావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట.
  • బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి.
  • అయిసు ఫ్రూటువాడిని పిలిచి ముందుగా రెండు ఎంగిలి చేసెయ్యాలి. అప్పుడు అమ్మ కొనిపెడుతుంది. తరవాత ప్రెవేటు చెబుతుందనుకో. ఈ పెరపంచకంలో ప్రెవేటు లేకుండా మనకి ఏం రాదుగదా మరి?
  • ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి.
  • ఈ పెద్దవాళ్ళు ఒకోసారి అబద్ధం చెబితే తిడతారు. ఒకోసారి నిఝెం చెబితే కూడా ప్రెవేటు చెప్పేస్తారు.
  • చంపడానికి ఇప్పుడు రాచ్ఛసులు అయిపోయారట. అందుకని మనం పదమూడో ఎక్కం, సిబి పాఠం ఇవన్నీ చదూకోవాలట. అవన్నీ వచ్చేస్తే రాచ్ఛసులు చచ్చిపోతారట. మనం బాగా చదూకుని ప్ఫది కాణీలో, వంద కాణీలో తెచ్చినా రాచ్ఛసులు చచ్చిపోతారట. లాపోతే సీగాన పెసూనాంబనిచ్చి పెళ్ళి చైరన్నమాట. ఇలాగని మా రాద చెప్పింది. రాధంటే అమ్మలే.

ఇవి బుడుగు ఆలోచనలు, అద్భుతంగా ఉండే ఇలాంటి మాటలు ఎన్ని సార్లు చదివినా మనసుకు హాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. 
మీరూ మీ పిల్లలతో హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే కొనండి బుడుగు.
ఇలాంటి మంచి పుస్తకాలు మన ఇళ్ళలో లేకపోవడం అంటే మన పిల్లలకు మనం చాలా దూరం చేస్తున్నట్టే.

Wednesday, September 19, 2012

గురు ధీం

http://www.youtube.com/watch?v=jmCSBadJcw4

Music Director : A. R. Rehman
Singer : Chithra K. S., Madras Chorale Group, A. R. Rehman

నాకు నచ్చిన మంచి ప్రోత్సాహక ధీం సాంగ్స్ లలో ఇది ఒకటి. కంఫోజింగ్ మీనింగ్ కూడా బావుండే సినిమా

jaage hain deer tak
hamen kuch deer sone do
thodi se raat aur hai
subah to hone do
aadhe adhure khwaab jo
pure na ho sake
ek baar phir se neend mein
woh khwaab bone do
మేలుకొన్నాం చాలా సమయం దాకా
మమ్ము కొంత సమయం నిద్రించనివ్వు
ఇంకా రాత్రి ఉంది
ఉదయం కానివ్వు
మద్యలో ఉన్న కల
పూర్తి కాలేకపొతుంది
మరొక్క సారి నిద్రలో
ఆ కలలోకి పోనివ్వు

Wednesday, August 29, 2012

పగటి వేషాలు

             పగటి వేషాల గురించి తెలియని వారు మనలో చాలా తక్కువ. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నా వారు కూడా పల్లెలలో మాత్రమే కాక పట్తణాలలో కూడా తిరగటం వలన పగటి వేషాల గురించి తెలుసు. అయితే వ్యత్యాసం ఎక్కడంటే ఇప్పటి తరం వాళ్ళు వాళ్ళను అడుక్కొనేవారుగా అనుకోవడం. వారు చెప్పేది అర్ధం కాకపోవడం........ పగటి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శంచే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది....... పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు రావడం, వర్గమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి.

  రోజూ మా వీధికి వచ్చే ఒకటి రెండు వేషధారులను మీకు అందిస్తున్నాను చూడండి. వారు రోజుకొకరు చొప్పున వంతుల వారీ మారుతూ ఉంటారు.
                 
                          పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. ..... బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి.
                  
               సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే "బహు రూపులు" అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు.... వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. ప్రస్తుత సమాజానికి కొన్ని కళారూపాలు దూరం అవుతున్నవి వాటిలో ఇదే ముందుండడం భాదాకరం... వీరిని ఆదరించేవారూ, అభిమానించేవారూ, కనీసం ప్రభుత్వ పరంగా, ఇతరత్రా ఆర్ధిక సహాయం చేసేవారూ కరువవడంతో రాబోయే రోజులలో పగటి వేషాలు పగటి కలలే అవుతాయి.

Sunday, March 21, 2010

పీచు మిఠాయి

                         పీచు మిఠాయి అనేది మా చిన్నప్పుడు భలే ఇష్టంగా తినే వాళ్లం. ఎర్రగా పీచుపీచుగా ఉండే అదంటే ఇష్టం ఉండని వాళ్ళు అరుదు. ప్రస్తుతం బయట చాలా తక్కువగా కనిపిస్తున్నా ప్యాకెట్లలో షాపింగ్ మాల్స్, సినిమా దియేటర్స్ వంటి వాటిలో కొద్ది ఎక్కువ ఖరీదులో అయినా బాగానే దొరుకుతున్నాయి.




అప్పట్లో సైకిల్ పై వీధులలో తిరుగుతూ పాత ఇనప సామాన్లు గాని, ప్లాస్టిక్ గాజు సీసాలు లాటివి ఇచ్చినా
అక్కడికక్కడే త్రిప్పుతూ తయారు చేసి
ఇచ్చేసేవాళ్ళు.
చిన్నప్పుడు అయితే రోజూ డబ్బులు దొరికేవి కావు. డొంకలు బొంకలు ఏదో ఒక మూల పాత ఇనప సామానో మరోటో వెతికి పట్టేసే వాళ్లం. అలా కొన్నామంటే ఇక ఆరోజుకు పండగే
దానిని తయారు చేసే పద్దతి ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. పంచాదారతోనే చేస్తారంటే నమ్మేవాళ్ళం కాదు. ఎర్రగా ఉన్న దానిని పంచదార కాదు మరేదో అనుకొనేవాళ్ళం.
వారానికి జరిగే మా ఊరి సంతలో ఇప్పటికీ ఒకతను పెడుతుంటాడు. వెళ్ళిన ప్రతీసారీ తప్పకుండా కొంటూఉంటాను. నిజానికి అది తిప్పుతుంటే చూడ్డానికి వెళతాను కొనడానికి కాదు. డ్రమ్మును అలా తిప్పుతూ ఉంటే తీగలుగా సాలీడు దారాల్లా వచ్చే వాటిని చూడటం భలే సరదాగా ఉంటుంది. తరువాత పుల్లతో దానిని త్రిప్పుతూ గుండ్రంగా తయారుచేసి మనకివ్వడమ్ ఇంకా భలేగుంటుంది. కాని వెళ్లి అక్కడ నిల్చుంటే బావోదని కొని అక్కడ తెలిసున్న పిల్లలెవరైనా ఉంటే ఇచ్చేస్తూఉంటాను.
నా కూడా ప్రెండ్స్ ఎవరైనా వచ్చినా 'ఎహే ఇదెందుకురా' చిన్న పిల్లోడిలా' అంటూ ఉంటారు. నే చేసేది చూసి ఎవడి దూల వాడికానందం అనుకుంటారు :)
ఇలాటి చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించడం తెలియకపోవడంమీ ఖర్మ అంటాను (అనను, అనుకుంటాను అంతే :).

Monday, October 5, 2009

వాసవీధామ్

పెనుగొండ అంటే చాలా మంది ఎరిగి ఉండచ్చు. అది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయము ద్వారా ప్రసిద్ది చెందింది. ఇటీవల వరకూ ఎక్కువగా తెలియక పోయినా ఇక ఇటుపై తప్పక గొప్పగా ప్రసిద్ది చెందవచ్చు.
ఇది చదవండి మీకూ తెలుస్తూంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఈ ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఈ ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.



నేను పెనుగొండ వెళ్ళి చాలా కాలం అయింది. ఈ మద్య జరిగిన మార్పులు చూస్తే చాలా బాగా అనిపించాయి. వాసవీ ధామ్ అని పేరుతో పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. అసలు వాసవి ఆలయమే ఊరికి ఒక వైపు చక్కని పచ్చపొలాల ప్రక్కగా ఉంటుంది. దీనికి తోడు ఎదురుగా పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. అలాంటి వాతావరణానికి గుడికి కొద్ది దూరంగా అనేక ఎకరాల పంట చేలను పూడ్చి నిర్మణాలు చేపట్టారు. ఇక్కడ యాత్రికులకు అనేక కాటేజీలు, వాసవి గురించిన సమస్త వివరాలూ ప్రదర్శించే పెద్ద ప్రదర్శన శాల, ద్యాన మందిరాలు , స్టార్ హొటలూ, అనేక చిన్న దేవాలయాలు ఇలా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. లోనివైపుగా వాసవీమాత అగ్నిలో దహనమౌతున్న ప్రతిమను సహజంగా ఉండేలా రూపొందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు తొంభై అడుగుల పైబడిన వాసవీ మాత విగ్రహం. ఇది ప్రస్తుతం సిమెంటుతో నిర్మించారు, తరువాత ఇలానే దీనిపై కాంస్యపు పలకలను తయారు చేస్తారట. దానిని రోడ్డువైపుగా వాసవీ ధామ్ ప్రధాన ద్వారం వైపు నిర్మించారు. చూడండి అద్భుతంగా ఉన్నది.

Thursday, May 14, 2009

మా ఊరి గ్రంధఆలయము

శ్రీ రామచంద్ర గ్రంథాలయము.
మాఊరి గ్రంధాలయము గూర్చి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది మాకొక బడి, ఒడి స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు ఊహ తెలియకముందే మానాన్నగారితో కలసి ఆ గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు. చందమామ చేతికిచ్చి ఆయన పేపరు చదువుతుంటే చందమామ,బొమ్మరిల్లు లో బొమ్మలు చూడటం అటు తరువాత ఊసుబోక చదివేవాళ్ళను చూడటం, పుస్తకాలు పేపర్లు ఎగరకుండా పెట్టే చిన్న చెక్కముక్కలతో బల్లలమీద మోదటం, అందరూ హటాత్తుగా నన్నే చూస్తుంటె ఏమీ తెలియని వాడిలా చటుక్కున మానాన్న ప్రక్కకెళ్ళి దాక్కోడం జ్ఞాపకమున్నది.
తరువాత
వచ్చీరాని చదువుతో కధలు చదవటానికి పడిన అవస్థ జ్ఞాపకమున్నది. ఆపై ట్వింకిల్ పుస్తకాల సీరియల్స్, పంచతంత్రం, గలివర్ యాత్రలు, సింధుబాద్ సాహసాలు, పరమానందయ్య శిష్యుల కధలు, రామకృష్ణమఠం వారి అందమైన రంగుల పుస్తకాలైన బొమ్మలకధలు, పిల్ల రామాయణం, బొమ్మల భారతం, లాంటి వాటి నుండి ఎగురుకుంటూ వారపత్రికలు, మాసపత్రికలు లాంటి పుస్తకాలకు అలవటుపడటం ఠంచనుగా వారం వారం చదవటం తెలుసు. వాటి తరువాత తరమైన మదుబాబు,పానుగంటి లాంటి డిటెక్టివు పుస్తకాలు శెలవు,శెలవుల్లోనూ రోజుల తరబడి కూర్చొని చదవటమ్. మా వాళ్ళు చదువు చదవక పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నానని కోప్పడటం తెలుసు. అటునుండి వేసవి శెలవుల్లో రుచిమరిగి ఇప్పటి వరకూ విడవలేకున్న నవల్ల గురించి చెప్పేదేముంది మీకే తెలుసు. ఇదంతా ఎందుకంటే నాకా అదృష్టం మా గ్రంధాలయం వలనన్నమాట.





అటువంటి గ్రంధాలయం గురించి కుతంత చిన్నగా చెప్పేసి మిగించేత్తాను. 1870 లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంధాలయములలో ఒకటి.. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంధాలయము 1914 లో పండిత రుద్రరాజు నరసింహరాజుగారి ప్రోత్సాహముతో భవనముగా రూపుదిద్దుకొని 1962 కు రెండు అంతస్తులుగా ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన అతి పెద్ద గ్రంధాలయముగా మార్పు చెందినది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు బాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ద గ్రంధాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఉన్న కొన్ని పుస్తకాల లిష్ట్ రాద్దామనుకొన్నాను కాని అ మొదలెట్టి ఆ వరకూ వచ్చేసరికి నాకు నీరసమొచ్చేసింది. ఇక మిగతావేం రాస్తాం. వదిలేసాం ఓపికున్నపుడు రాద్దాం లే అని. ఎలాగూ వీటిని వికీలో ఎక్కించాలి కనుక లిష్ట్ పూర్తి చేసి తీరతామన్న మాట.


* అద్భుత రామాయణము - అనగారి వెంకతకృష్ణరాయడు.
* అద్భుతోత్తరరామాయనము - నాదెళ్ళపురుషోత్తముడు.
* ఆధ్యాత్మరామాయణము - కోటమరాజు నాగయామాత్యుడు.వావిళ్ళవారు
* అనిరుద్ద చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు. సాహిత్యాకాడమీ
* అభినవాంధ్ర విష్ణుపురానము - అఛ్యుతరామామాత్యుతకవి.
* అమరజీవి అల్లూరి - దండు వెంకటరామరాజు.
* అభినవ భారతము - మతకపల్లి మాధవకవిమంజువాణి ఏలూరు
* అరుణాచల ఖండము - జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రశ్రీమద్రమాయనము 7 సంపుటములు- జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రవాల్మీకి రామాయణము 7అ సంపు - వావికొలను సుబ్బారావు.
* ఆంద్రమహాబారతము - నన్నయ,త్క్కన,ఎర్రాప్రగడ.వావిళ్ళ్ళవారు
* ఆంధ్రపురానము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
* ఆంధ్ర బ్రహ్మాండపురాణము - జనమంచి శేషద్రిశర్మ తణుకు
* ఆంధ్ర భవిష్యపురానము - మల్లాది సూర్యనారాయణశఅస్త్రి. తణుకు
* ఆంధ్రలింగపురాణము - ములుగు చంద్రమౌళీశ్వరశాస్త్రి. రజతముధ్రాక్షరశాల.
* ఆంధ్రస్కాందపురాణము - జనమంచి శేషద్రిశర్మ
* ఉత్తరరామాయనము- కంకటి పాపరాజు.వావిళ్ళ
* ఉత్తర హరి వంశము - నచనసోముడు వావిళ్ళ
* కపిలదేవహూతి సంవాదము - పోతన. బాలభక్త సమాజము పోడూరు.
* కవి కర్ణరపాయనము - సంకుసాల నృసింహకవి.
* కంద రామాయణముం గంధపెద వీరభద్రరఅవు. రామానంధగౌడీయ మఠము.కొవ్వూరు.

Wednesday, April 29, 2009

ఉపచార విధానం

పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.


ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం

ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం

పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం

అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం

ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము

స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం

వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం

యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం

ఏడు వారాల నగలు.


ఏడు వారాల నగల గురించి వినే ఉంటారు. రోజుకు కొన్ని నగల చొప్పున
ఏడు రోజులకూ కేటాయించబడిన నగలను ధరించేవారు అప్పటి రోజులలో.
తిదులను, నక్షత్రాలను, రాశులను అనుసరించి ఒక్కోరోజు ఒక్కో సెట్ నగలన్నమాట.

అవేమిటో చూద్దామా (కాదు చదువుదాం)


ఆదివారం - సూర్యుని కోసం కెంపుల కమ్ములు, హారాలు మొదలగునవి.
సోమవారం - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి
మంగళ వారం - కుజునికోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధ వారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారం - బౄహస్పతి కోసం పుష్యరాగపు కమ్ములు, వడ్డాణము, ఉంగరాలు.
శుక్రవారం - శుక్రుని కోసం వజ్రాల హరాలు, ముక్కు పుడక మొదలగునవి.
శనివారం - శనికోసం నీల మణి హారలు, ఉంగరాలు మొదలగునవి.

ఇది నిజానికి నా మూసేయాలనుకొనే http://viswanath123.blogspot.com/ బ్లాగులోనిది. ఇది ౨౦౦౭లో రాసాను.

Friday, January 23, 2009

మావుళ్ళమ్మ



భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత.
పోయిన సారి పండుగకు ఇంటికి వెల్లినపుడూ భీమవరం వెళ్ళా ఆ విశేషాలు వికీలో రాస్తూ బ్లాగులో కూడా ఇస్తే భావుంటుందని రాస్తున్నా....
దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి
స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.



చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్దుడు " విగ్రహాలను చెక్కారు.

మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నది. ఈ సారి ఉత్సవాలకు వేసిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక ఒక్కొక్కరోజు నాలుగు ప్రసిద్ద కళాకారుల ప్రోగ్రాములు ఇక్కడ మామూలు. వాటిలో సురభి నాటకాలు కనీసం పది ఉంటాయిట( రోజూ ప్రోగ్రాముల లిస్టు పేపరుకు అదేలెండి జిల్లా ఎడిసిం లో వస్తుందట)

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేధికగా వెలుగొందుతున్నది. ఇక్కడ సనామనం పొందిన కొందరు కళాకారులు.

Friday, December 26, 2008

పెస్టివల్ పుస్తకాలు




అదేంటో గాని హైదరాబాదు ఏరకంగా సూసినా నాకు చెత్త సిటీలాగే కనిపిత్తాది. ఏదో కొన్ని ఇసయాల్లో తప్ప అలాంటిదే ఒకిసియం 'పుస్తకాల దుకాణాలు' మంచియ్యన్నీ ఇక్కడుంటం. ఆ మద్య అబిట్స్ విశాలాంద్ర సూత్తే భలే ముచ్చటేసింది. సూపరు సూపరు బుక్సు అన్నీ ఉన్నాయి. ఆత్రం కొద్దీ చేలా కొనేసాను. అంతే కాక సంవత్సరానికి సభ్యత్వం కూడా తీసుకొన్నా అప్పటికంటే కూడా మొన్నామధ్య జరిగిన బుక్కు పెస్టివల్కెళ్ళినపుడు ఇంకా చాలా మంచి పుస్తకాలు కొనేసే చాన్సు వచ్చింది. ఎలాగా మందగ్గర కార్డుందికద అందరికీ 10 పెర్సెంట్ అయితే మనకి 20 పెర్సెంట్ వచ్చుద్ది.
అయితే మేము అలాగెల్లినందుకు చాలామందికి మంచి జరిగిందండోయ్ అదేంటంటారా.
పెద్దపెద్ద పుస్తకాలు, ఎక్కువ రేట్లున్న పుస్తకాలు కొనాలనుకుని ఎనకాడేవోళ్లకు నా కార్డు బాగా ఉపయోగపడింది. నేను పెస్టివల్కి రెండుసార్లెల్లేను. మొదటి సారెల్లినపుడు మన గుంపోళ్ళ మీటింగ్ జరిగింది. అప్పుడన్నమాట. ఆ రోజున నింపాదిగా చూడాలనుకొనే పెద్దయ్యలు కొంతమంది తగిలి పెద్దపుస్తకాల కోసం మోజుపడితే కొనిపించీసేం. మల్రోజు క్రిస్మస్ కెళ్ళాం అప్పుడూ బాగా జనాలున్నారు. మొదట్రోజు తెలీటం చేత ఈ సారి చాలా మంది పుస్తక ప్రియులికి 20 పర్సెంట్ తగ్గీపిత్తాం కొనుక్కుంటారా అనడిగితే ఓయస్ అనీసేరు. దాంతో ఆళ్ళకి ఆళ్ళ ప్రెండ్స్ ఆళ్ళకి ప్రెండ్స్ అలా చాలామందిచేత పెద్దపెద్ద పుస్తకాలు,రేటెక్కువ పుస్తకాలు కొనిపించీసేం. ఆళ్ళూ ఆళ్ళ స్నేహితులూ, ఆళ్ళతో పాటు మేమూ చేలా ఆనందపడిపోయేం. ఇయ్యన్నె కాక మేంగూడా చాలా పుస్తకాలు కొనీసేం. మొదట్రోజు విజేత పబ్లికేషన్స్ వాళ్ళ సాపుకెళ్ళినపుడు పెద్దబాలశిక్ష ఎంతాని అడిగేం ' నూటతొంభై అసల్రేటు నూటిరవైకిచ్చేత్తాం తీసుకొండన్నారు. సరే మొత్తమంతా చూసేసాక మల్లొచ్చి తీసుకుందాం అనుకుని అన్నీ అయ్యేకా వచ్చి అడిగితే నూటిరవైయ్యన్నారు.అదేంటండే ఇందాకొచ్చి అడిగితే నూటిరవయ్యేనన్నారు ఇప్పుడు ఇరవై పెంచేసేరు అనగానే కొద్దిగా ఆగండి అని మా ముందున్న బేరం అదే పెద్దబాలశిక్షకు నూటయాబై ఇచ్చి వెళ్ళిపోగానే మాకు మరోటి నూట ఇరవై ఇమ్మని ఇచ్చేసేరు. ఇచ్చేత్తా అన్నారు మీరు ముందు అడిగారు కనుక ఆరేటు ఇప్పుడు కాదండి అని,
పోన్లే మనకైతే తక్కువకే వచ్చిందికద అనుకుని బయల్దేరేసాం.




ఆ మద్య విజయవాడ ఎళ్ళినపుడు ఎమొస్కో వాళ్ళను శ్రీపాద గారివి వడ్లగింజలు,క్షీరసాగరమధనం లాంటి నవల్లేమమయినా ఉన్నాయా ఆని అడిగితే ఈ మద్య అటువంటి నవల్లు ప్రింటింగ్ జరగటం లేదు, మాదగ్గరకూడా లేవు అన్నారు. అయ్యో అనుకొన్నా. బుక్ పెస్టివల్లో నాకా పుస్తకాలు దొరికేసినయ్యి. శ్రీపాదకధలు అనీ ఒకటి, పుల్లంపేట జరీచీర అనీ ఒకటి. ముందు చూళ్ళేదుకాని పుల్లపేట జరీచీర బుక్కులోనే ఇయ్యన్నీ ఉన్నాయ్. కాపోతే కధలు తగ్గించేసి చిన్నగా మార్చేసేరు. సరే ఏదైనా నాక్కావలసిన పుస్తకాలు దొరికినియ్యి అదే ఆనందం.

నేను తీసుకున్న పుస్తకాలు ఇయ్యి
1. ఒకయోగి ఆత్మకధ
2. అత్తగారి కధలు (భానుమతి)
3. అంపశయ్య (నవీన్)
4. రంగులరాట్నం (ముళ్ళపూడీ వెంకట రమణ)
5. బుడుబు ( శీ రమణ )
6. శ్రీపాద కధలు (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి)
7. పుల్లపేట జరీచీర (శ్రీపాద)
8. పెద్దబాలశిక్ష
9. ఆనాటి వాన చినుకులు (వంశీ)
10. మా పసలపూడి కధలు (వంశీ)
11. బాపు బొమ్మల రామాయణం (రమణ)
12. స్తోత్ర రత్నాలు (శ్రీనివాస్)

ఇంకా కూని మల్లది నవల్లూ, యందమూరి నవల్లూ కూడా