Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts
Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts

Tuesday, March 3, 2015

శ్రీకాకుళం



శ్రీకాకుళం అతి పురాతన చరిత్ర కలిగిన పట్టణం. భారతదేశం యొక్క  ఈశాన్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక ప్రముక పట్టణం మరియు జిల్లా యొక్క ముఖ్యపట్టణం. ఉత్తరాంధ్రగానూ, గుల్షంబాద్ గానూ, చీకాకోల్ గానూ, శీఖాకోల్‌గా కూడా పిలుస్తూ శ్రీకాకుళం స్థిరపరచబడినది. 
 
చారిత్రక విశేషాలు
దీని చారిత్రక విశేషాలలోనికి వెళితే, క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్ధంలో బౌద్ద మత ప్రాభల్యం ఎక్కువగా ఉండేది. 14 వ శతాబ్ధంలో భారతదేశ తూర్పు రాజవంశాలైన గంగారాజ వంశపు రాజుల యొక్క కళింగ రాజ్యంలో సుమారుగా 800 సంవత్సరాలు ఒక భాగంగా ఉండేది.  ఒరిస్సా గజపతులను, కొండ జమీలకు కూడా భాగంగా కలుపుకొని రాజ్యం వర్ధిల్లింది. విజయనగరం రాజులు కూడా కొంత కాలం శ్రీకాకుళంలో కొంత భాగాన్ని పరిపాలించారు. తరువాత ముస్లిం పరిపాలనలో కొంత కాలం ఉంది. వారు గుల్షన్‌బాద్‌గా వ్యవహరించేవారు. తరువాత కొంత కాలానికి బ్రిటిష్ రాజరికంలో దీనిని చీకాకోల్‌గా వ్యవహరించారు. స్వతంత్రానంతరం శ్రీకాకుళంగా మార్చారు. 
శాలిహుండం, జగతి మెట్ట, ధంతపురి మొదలైన ప్రదేశాలలో జరిగిన అనేక తవ్వకాల ఆధారంగా ఇక్కడి ప్రజలు గొప్ప శాంతితో కూడిన సాంస్కృతిక జీవితం అనుభవించిన ఆనవాళ్ళు లభించాయి.
నదులు
బలరాముని నాగలి ధాటికి విచ్చిల్లిన భూమి నుండి ఉద్భవించిన నాగావళీ నది మొదలు వంశధార, మహేంద్రతనయ, చంపావతి, భుధ, సువర్ణముఖి, వేగవతి మరియు గోముఖి నదుల వలన పచ్చని పంటలతో, అరణ్యాలతో విలసిల్లిన భూమి శ్రీకాకుళం.
క్షేత్రాలు
పురాణపరంగా, పుణ్యక్షేత్రాలపరంగా వాసికెక్కిన మేటి శ్రీకాకుళం పట్టణం. పురాణాలలో తెల్పబడిన ఎన్నో క్షేత్రాలు, తీర్ధాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. అరసవెల్లి, శ్రీకూర్మం, ముఖలింగం లాంటి ప్రసిద్ద క్షేత్రాలతో విలసిల్లుతుంది.

ప్రముఖులు
ఇక్కడ వడ్డాది పాపయ్య, ఎస్. కాంతారావు, కరణం మల్లేశ్వరి,కాళీపట్నం రామారావు, కోడి రామ్మూర్తి నాయుడు,గిడుగు రామమూర్తి, బలివాడ కాంతారావు, మల్లాది వేంకట కృష్ణశర్మ, సర్దార్ గౌతు లచ్చన్న వంటి పెక్కుమంది కళాకారులు, సాహితీకారులు, రాజకీయనాయకులు ఇలా ఎన్నో రంగాలలో విశేషమైన కృషి చేసారు

శ్రీకాకుళం పట్టణానికి రవాణా బహుముఖాలుగా ఉంది. మద్రాస్,కలకత్తా జాతీయ రహదారి 5 ను ఆనుకొని ఉండటం, శ్రీకాకుళం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే లైను ద్వారా రవాణా వసతి కలిగిఉంది.

Monday, October 5, 2009

వాసవీధామ్

పెనుగొండ అంటే చాలా మంది ఎరిగి ఉండచ్చు. అది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయము ద్వారా ప్రసిద్ది చెందింది. ఇటీవల వరకూ ఎక్కువగా తెలియక పోయినా ఇక ఇటుపై తప్పక గొప్పగా ప్రసిద్ది చెందవచ్చు.
ఇది చదవండి మీకూ తెలుస్తూంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఈ ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఈ ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.



నేను పెనుగొండ వెళ్ళి చాలా కాలం అయింది. ఈ మద్య జరిగిన మార్పులు చూస్తే చాలా బాగా అనిపించాయి. వాసవీ ధామ్ అని పేరుతో పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. అసలు వాసవి ఆలయమే ఊరికి ఒక వైపు చక్కని పచ్చపొలాల ప్రక్కగా ఉంటుంది. దీనికి తోడు ఎదురుగా పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. అలాంటి వాతావరణానికి గుడికి కొద్ది దూరంగా అనేక ఎకరాల పంట చేలను పూడ్చి నిర్మణాలు చేపట్టారు. ఇక్కడ యాత్రికులకు అనేక కాటేజీలు, వాసవి గురించిన సమస్త వివరాలూ ప్రదర్శించే పెద్ద ప్రదర్శన శాల, ద్యాన మందిరాలు , స్టార్ హొటలూ, అనేక చిన్న దేవాలయాలు ఇలా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. లోనివైపుగా వాసవీమాత అగ్నిలో దహనమౌతున్న ప్రతిమను సహజంగా ఉండేలా రూపొందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు తొంభై అడుగుల పైబడిన వాసవీ మాత విగ్రహం. ఇది ప్రస్తుతం సిమెంటుతో నిర్మించారు, తరువాత ఇలానే దీనిపై కాంస్యపు పలకలను తయారు చేస్తారట. దానిని రోడ్డువైపుగా వాసవీ ధామ్ ప్రధాన ద్వారం వైపు నిర్మించారు. చూడండి అద్భుతంగా ఉన్నది.

Friday, January 23, 2009

మావుళ్ళమ్మ



భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత.
పోయిన సారి పండుగకు ఇంటికి వెల్లినపుడూ భీమవరం వెళ్ళా ఆ విశేషాలు వికీలో రాస్తూ బ్లాగులో కూడా ఇస్తే భావుంటుందని రాస్తున్నా....
దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి
స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.



చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్దుడు " విగ్రహాలను చెక్కారు.

మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నది. ఈ సారి ఉత్సవాలకు వేసిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక ఒక్కొక్కరోజు నాలుగు ప్రసిద్ద కళాకారుల ప్రోగ్రాములు ఇక్కడ మామూలు. వాటిలో సురభి నాటకాలు కనీసం పది ఉంటాయిట( రోజూ ప్రోగ్రాముల లిస్టు పేపరుకు అదేలెండి జిల్లా ఎడిసిం లో వస్తుందట)

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేధికగా వెలుగొందుతున్నది. ఇక్కడ సనామనం పొందిన కొందరు కళాకారులు.