Wednesday, August 29, 2012

పగటి వేషాలు

             పగటి వేషాల గురించి తెలియని వారు మనలో చాలా తక్కువ. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నా వారు కూడా పల్లెలలో మాత్రమే కాక పట్తణాలలో కూడా తిరగటం వలన పగటి వేషాల గురించి తెలుసు. అయితే వ్యత్యాసం ఎక్కడంటే ఇప్పటి తరం వాళ్ళు వాళ్ళను అడుక్కొనేవారుగా అనుకోవడం. వారు చెప్పేది అర్ధం కాకపోవడం........ పగటి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శంచే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది....... పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు రావడం, వర్గమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి.

  రోజూ మా వీధికి వచ్చే ఒకటి రెండు వేషధారులను మీకు అందిస్తున్నాను చూడండి. వారు రోజుకొకరు చొప్పున వంతుల వారీ మారుతూ ఉంటారు.
                 
                          పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. ..... బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి.
                  
               సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే "బహు రూపులు" అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు.... వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. ప్రస్తుత సమాజానికి కొన్ని కళారూపాలు దూరం అవుతున్నవి వాటిలో ఇదే ముందుండడం భాదాకరం... వీరిని ఆదరించేవారూ, అభిమానించేవారూ, కనీసం ప్రభుత్వ పరంగా, ఇతరత్రా ఆర్ధిక సహాయం చేసేవారూ కరువవడంతో రాబోయే రోజులలో పగటి వేషాలు పగటి కలలే అవుతాయి.

3 comments:

Yohanth said...

nice post

Anonymous said...

yes his is true

Unknown said...

మా ఊరు వస్తుంటారండి.ఆకరి రోజు శక్తి వేషం వేస్తారు .వాళ్ళ డప్పు సౌండ్ వింటేనే పిల్లలందరూ పరుగో ..పరుగు .ఒక్కళ్ళు కూడా వీధిలో ఉండరు.

బాగుంది.