Thursday, August 9, 2007

TOUR OF PAAPI KONDALU.

మా పాపికొండలప్రయాణం

గోదావరి మీద పోలవరం వద్ద బ్రిడ్జి కడుతున్నారని పేపర్లలో వార్తలు చదువుతుంటే బాధగా అనిపించింది. ఈదెబ్బతో పాపికొండలు మటాష్ అయిపోతాయి, వాటర్ ప్లోటింగ్ లేక గోదావరి కూడా ఇప్పుడు విజయవాడ తరువాత పిల్లకాలువలా పారే కౄష్ణా నదిలా తెల్ల మొహంతో ఇసుక మేటలను మాత్రమే చూపిస్తుందనుకుంటా, గోదావరిలో స్నానం చేయాలనుకొనే రాజమండ్రి వాసులంతా పాపం మైలు దూరం లోనికి నడువాల్సొస్తుందేమో రేవులనుండి. ఇలా ఆలోచించిన నాకు ఒక్క సారి పాపికొండలు టూర్ వెళితే బావుండు అనిపించింది. ఈసారి ఊరెళితే తప్పక ప్రయత్నించాలి లేకుంటే మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. మొన్న సంక్రాంతికి ఊరెళ్ళానుగాని చాలారోజులు పనుల వత్తిడిలో బయలుదేరుటకు కాదుకదా కనీసం అలోచించేందుకు కూడా వీలవలేదు. కాని విచిత్రంగా ఇదేవిషయమ్మీద మా స్నేహితులే చర్చ లేవదీసారు. అదెలానంటే మేము సాధారణంగా సాయంత్రాలు మిలీనియం పార్కు అనబడే చెరువు గట్టున సమావేశం అవుతుంటాము.మా ఫ్రెండ్స్ లో ఎవరిని ఎప్పుడు కలవాలన్నా అక్కడే దొరకుతారు. {మిలీనియం పార్క్ అనబడే దీని కధ నా పాత పోష్టులో చూడచ్హు } పోలవరం బ్రిడ్జ్ గురించి వాళ్ళూ కూడా నాలాగే అనుకోవడం జరిగిందని టూర్ ప్లాన్ చేయలనుకుంటున్నారని వాళ్ళ మాటాలద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వున్నావు గనుక నువ్వేళ్ళేలోగా ఏదో ఒకరోజు డిసైడ్ చేద్దాం అన్నారు. నాకింకేం కావాలి కాగలకార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అయింది. తరువాత మాటల్లో ఎంతమంది వస్తారు? ఎలా వెళ్ళాలి? టికెట్లు బుక్ చేయడం ఎలా? లాటి డిస్కషన్ తో కొంత సమయం గడిచాక ముందుగా సమాచారం కోసం నెట్ లో వెతికేందుకు వెళ్ళాం.ఎన్ని రకాలుగా సెర్చ్లు చూసినా ఎలా టైప్ చేసినా మాక్కావలసిన సమాచారం మాత్రం సరిగా దొరకలేదు.ఇలా కాదుగాని అసలు ఎందరొస్తారో తెలుసుకోండి డైరెక్టుగా రాజమండ్రి పోయి వివరాలు టికెట్లు రెడూ తేవచ్హు.అన్నారు. సరి. ఉన్న జనం పన్నెండు. అనుమానంగా లేదా ఊగీసలాడేవారు ఏడు. మొత్తం పందొమ్మిది. సాయంత్రానికి కంఫం చేసి చెప్పమన్నాం ఎంతమంది ఖచ్హితంగా వచ్హేదీ... ఆరోజు సాయంత్రానికి పదహారు మందితో లిస్ట్ మాకప్పచెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను మరో ఇద్దరు కలసి రాజమండ్రి బయలుదేరాం.

రాజమండ్రి మాకు రెండు వైపులనుండి వెళ్ళచ్హు. ఇటునుండి కొవ్వూరు మీదుగానూ, అటునుండి రావులపాలెం మీదుగానూ. చిత్రంగా ఎటెళ్ళినా రెండుసార్లు గోదారి క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇటు నిడదవోలు దాటాక విజ్జేశ్వరం చిన్నపాయనూ, తరువాత కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగానూ. ఆవైపుగా మొదట సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా, తరువాత రావులపాలెం - గోపాలపురం బ్రిడ్జి మీదుగానూ.

మేము రాజమండ్రి కోటిపల్లి బస్టాప్ నుండి తిన్నగా దానవాయి పేటలోని మా ఒకానొక పాతఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్హిన పని చెప్పాం. తనకు తెలిసిన వివరాలు కొన్ని చెప్పాడు కాసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం వెళదాం అన్నాడు. సాయంత్రం డెల్టా పేపర్ మిల్లు వైపుగా కొత్తగా కట్టిన సింహాద్రి అప్పన్న గుడిగా పిలువబడే నరసింహ స్వామి వారి దేవస్థానికి వెళ్ళి ధర్శనం చేసుకొని ,గోదావరి స్టేషన్ రోడ్డుకొచ్హాం.అక్కడి నుంచి గోదావరి ప్రక్కగా ఒక్కొక్క స్నాన ఘట్టాన్నీ చూసుకుంటూ తాపీగా నడుచుకుంటూ కనిపించిన ప్రతి ట్రావెల్ అఫీసులోనూ ఎంక్వైరీ చేసుకొంటూ మార్కండేయస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న లాంచీల రేవుకొచ్హాం.

ఏతా వాతా చెత్తంతా ఏరేయగా మిగిలిన సమాచారం ఇది. రాజమండ్రి నుండి మొదలయ్యే ఈటూర్ పట్టిసీమ,గండి పోశమ్మ దేవాలయాలమీదుగా పేరంటాలపల్లితో అంతమయిపోతుంది. ట్రావెల్ లేదా టూరిజం వారిద్వారా వెళ్ళే 50 మంది కెపాసిటీ కలిగిన మీడియం యాచెట్ అనబడే బోట్లో పెద్దలకు- 500లు, పిల్లలకు- 300ల రూపాయలు. ఇంక్లూడ్ ఉదయాల్పాహారం. మధ్యాన భోజనం నాన్ వెజ్ లేకుండా. సాయంత్రం తేనీరు. ఇలా ఉంది మెనూ. బోటు అప్పర్ డెక్ పై రెండు వరుసల కుర్చీలు ఒక వైపు టీ వి, డీవీడీ మరొకవైపు చిన్న స్టేజ్ లాటి ఏర్పాటు. డేన్సులు వగైరాలకు. ఇది నీళ్ళెక్కువ ఉంటే రాజమండ్రి తక్కవుంటే పట్టిసీమల నుండి బయలుదేరునని తెలియచేసారు.ఇక లాంచీలనావల వర్తక్ సంఘం వారి ద్వారా లాంచీ ఒక్కింటికి నలభై మంది.పెద్దలకు 300లు. పిల్లలకు 200లు పైన చెప్పిన విధంగా బ్రేక్పాస్ట్,లంచ్,ఈవెనింగ్ టీలతో కలిపి. నో టివి నో సాంగ్స్. లాంచీ పైన టెంట్ వేస్తారు పైన క్రింద ఎక్కడైనా కూర్చోవచ్హు. ఇవి రెండున్నూ ఆదివారం ఉదయం బయలుదేరుతాయి.ఒక్క కార్తీక మాసంలో మాత్రం ప్రతీ రోజూ నడుస్తాయి. ఇలానేకాక ఒకే ఫ్యామిలీ విడిగా వెళ్ళాలనుకుంటే లాంచీ మొత్తంగా మాట్లాడుకోవచ్హు. ఈ మాదిరిగా ఉన్న టికెట్ రేట్లు విన్న మావాళ్ళు లోకల్ ఫ్రెండును అడిగారు ఏంచేద్దామని. వాడు అంతకు ముందు వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత సమాచారం సేకరించాడు. ఫైనల్ గా వాడు చెప్పినదేమిటంటే పెద్ద బోట్ అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకూ కుర్చీలలో కూర్చొని కూర్చొని నడుములు పట్టేసి సగం ప్రాణం ఎగిరిపోతుంది. అదే లాంచ్ అయితే పైన ఎలానూ పరుపు వేస్తాడు మరియు టెంట్ ఉండనే ఉంటుంది కాబట్టి కావలసినంతసమయం మనిష్టంగా దొర్లవచ్హు ఎలానూ ఉన్నదంతా కుర్రాళ్ళే కనుక అసలు సమస్యే ఉండదు. అదీ వాడు వాళ్ళ మాటగా చెప్పింది. సరేపదమని మార్కండేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న లాంచ్ రేవుకు వెళ్ళాం. అక్కడ మెట్లపై ఒక చిన్న టెంట్ దానిక్రింద టేబిల్ ,నాలుగు కుర్చీలు. ఈ సెటప్ లో ఇద్దరు ముసలోళ్ళు టేబిల్ పై రెండు రిసీట్ పుస్తకాలతో కూర్చొని ఉన్నారు. మా పదహారు మందికి టికెట్స్ తీసుకోవడంతో పనిపూర్తయిపోయిది. చల్లని సాయంత్రం గోదారి వడ్డున నడుచుకొంటూ అటుదగ్గరలో కొత్తగా కట్టిన ఇస్కాన్ శ్రీ కౄష్ణ దేవాలయం చూసేందుకు వెళ్ళాం ఇదే రోడ్డులో స్వామి అయ్యప్ప దేవాలయం భారీ ఎత్తున నిర్మాణదశలో ఉంది.ఆ చుట్టుపట్ల పెద్దపెద్ద పాలరాతి దిమ్మలు వరుసగా పేర్చబడి ఉన్నాయి. వాటిని దాటి కొంత దూరం పెళ్ళాక గోదావరి వడ్డున విశాలమైన కాళీ స్థలంలో ప్రశాంత వాతావరణంలో కట్టిన కౄష్ణ దేవాలయానికి చేరుకున్నాం. దాన్ని చూస్తేనే అర్ధమవుతుంది రాజమండ్రి లో ఇప్పుడు చూడ దగిన కట్టడాల్లో ముఖ్యమయినవాటిలో ఒకటిగా మారిపోతుందని. దేవాలయం లోపలి భాగం కూడా చాలా విశాలంగా ఉంది. అన్నిరకాల భక్తి సాహిత్యం పూజా సామగ్రి ప్రసాదాలు చేతి తయారీ వస్తువులు అమ్ముతున్నారక్కడ కాకుంటే రేట్లు చాలా హెచ్హుగా ఉన్నయి. జనవరిలో నేను తిరుమల వెళ్ళినపుడు కొత్తగా ఓపెన్ చేయబడిన ఇస్కాన్ దేవాలయనికి వెళ్ళాను.అక్కడ కూడా ఇలానే ఇన్నీ అమ్ముతున్నారు.ఎందువలనో తెలియదు గాని ప్రతీ వాటిపై 50 శాతం తగ్గింపుతో అందచేస్తున్నారు.వెంటనే నేను తెలుగు వచన రామాయణం , భాగవతం , భగవద్గీత మూడిటినీ తీసుకొన్నాను. అంతకు ముందు నే చూసిన ఈపుస్తకాల్లో లేని ఒక ప్రత్యేకత దాదాపు ఇరవై పేజీలవరకూ మధ్య మధ్యన ఆయిల్ ప్రింట్ ఫోటోలు ఉండటం. నా వద్ద ఆ సమయంలో ఎక్కువ డబ్బు లేకపోయింది లేదంటే ఇంకా తీసుకొనేవాడినే....................
మేటర్ ఎక్కువగా ఉండుటవలన మిగిలిన దాన్ని మరొక పోష్టుగా అందిస్తాను.{సశేషమన్నమాట}

11 comments:

విహారి(KBL) said...

నాకు చాల బాధగ వుందండి గోదావరి ఎండిపోతుంటే.
పొలవరం ప్రొజెక్ట్ రాకుండావుంటే బాగుణ్ణు.
పాపికొండల అందాలు అలానే వుండాలి.

రాధిక said...

పాపి కొండలు చూడాలన్నది ఎప్పటి నుండో నా కల.కాలేజ్ లో వుండగా ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు.పెళ్ళయ్యాకా మా వారు ఒప్పుకోలేదు.ఊటి,కొడై,మునార్ లకన్నా ఏమీ అందం గా వుండదులే అని ఒక్క మాటలో తీసిపారేసారు.ఇప్పుడేమో ఇండియా వచ్చినప్పుడల్లా తిరుపతి,షిరిడీ...లు చుట్టి రాడవం లో చూపించే శ్రద్ద పాపికొండలు చూద్దామంటే వుండదు.కల కలగానే మిగిలిపోతుందేమో?మీరు అదృష్టం చేసుకున్నారు.

Srini said...

నాకు ఎప్పట్నుంచో రాజమండ్రి, పాపికొండలు ఇంకా కోనసీమ ఇలా మన అంధ్ర రాష్త్రంలోని అందాలన్ని చూడాలని ఒక కల. చిన్నప్పటినుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తప్ప వేరే చూసింది లేదు. ఇండియాలో ఉన్నప్పుడు వెళదాం వెళదాం అనుకుంటూనే వాయిదాలు వేసాను. ఇంక అవన్ని ఎప్పుడు చూస్తానో ఏమో.

హృదయ బృందావని said...

very nice విశ్వనాథ్ గారు! చాలా బాగా రాశారు. చదివే వాళ్ళకి చూస్తున్న భావన కలిగిస్తాయి మీ ఆర్టికల్స్. ముఖ్యంగా ఫొటోస్ చాలా బాగుంటాయి. :)

మీ బ్లాగ్ పేజ్ లింక్ నా బ్లాగ్ లో పెట్టుకోవచ్చా?

బ్లాగేశ్వరుడు said...

విశ్వనాధ గారు నా ఇప్పుడు అర్థం అయ్యింది, గోదావరి స్టేషన్ వద్ద నున్న శివ లింగం బొమ్మ, ఇస్కాన గుడి బొమ్మ, సింహాద్రి పేపర్ మిల్లు వద్ద నున్న అప్పన్న దేవాలయం ఫోటోలు ఎందుకు అంటించమన్నారో. నేను గోదావరి జిల్లలొ పుట్టి పెరిగిన వాడినే కాని గోదావరి జిల్లాలు, కోనసీమ పెద్ద గా చూడ లేదు. ఏదో చిన్నప్పుడు మా నాన్న గారి ఉద్యోగం రాజోలు లొ ఉండేటప్పుడు కొద్దిగా కోనసీమ చూశాను.

Viswanadh. BK said...

మీ అందరికీ నచ్హినందుకు కృతజ్ఞతలు.
నేననుకుంటా ఎక్కువ డబ్బుతో దూరపు అందాలకోసం పరుగెత్తేకంటే
తక్కువ డబ్బుతో దగ్గరి అందాలు ఎక్కువ ఆస్వాదించవచ్చునని.
బృందావనిగారూ-- మీరు నాబ్లాగ్ పేజీ మీ బ్లాగ్లో ఉంచడం నాకూ ఆనందమే
మాటల బాబుగారూ-- నేనుకూడా బయటుండటంవలనే మిమ్మల్ని వికీకి ఆ పొటోలు అతికించమన్నాను.ఈలోపు నేనుకూడా ప్రయత్నిస్తాను.
once again tanks for all of u.

మేధ said...

విశ్వనాథ్ గారు, మీరు రాసిన గోదావరి ప్రయాణం చదువుతూ ఉంటే, నాకు కళ్ళ ముందు అంతా కనిపిస్తున్నట్లుగా ఉంది.. నేను కూడ ఈ మధ్యే చదివాను పేపర్ లో, పోలవరం వల్ల పాపికొండల అందాలు మాయమైపోతాయి అని అప్పటినుండి అనుకుంటున్నాను వెళదామని.. మీరు వెళ్ళగలిగినందుకు అదృష్టవంతులు..

Anonymous said...

విశ్వనాధ్ గారూ,
చూస్తుంటే మీ ఊరు మా ఉరు దగ్గరే ఉన్నట్లుంది. మీరు ఎక్కడనుంచండీ..? పాపి కొండలకి సంబంధించిన సమాచారం చాల ఉపయుక్తంగా ఉంది. ఈ సారి నవంబర్లో ఇండియా వెళ్ళినప్పుడు పాపికొండలు తప్పక చూసేందుకు ప్రయత్నిస్తాను. లేకుంటే మీరన్నట్టు భవిష్యత్తులో మనకీ అవకాశం ఉండదు.

rākeśvara said...

నేనూ కొవ్వూరికి ఒక ముప్పై నిమిషాల దూరాన ఉంటాను. మీరు వెళ్తున్నారని చెబితే నేను కూడా వచ్చేవాడిని :). మా ఇంటిలో పదేళ్ళగా ఉంది పట్టిసీమ, పాపి కొండలు ప్లాను.
మా అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఊరించడమేగానీ, ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు :(
ప్రాజెక్టు వచ్చేముందే వచ్చేనెల కాస్త తిరిగి వస్తా !

విశ్వనాధ్ said...

ఈసారి తప్పక చెపుతాగా...

papikondalu viharayatra 09848051004 said...

viswanadh garu mee rachana chala bagunnadi.papikondalu viharayatra boat tickets cantact addras:-MANDA SRINIVASARAO,SDV TOURS&TRAVELS,NEAR OVERBRIDGE,TADEPALLIGUDEM . Cell:9848051004.Ph No:08818 221099